WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తిరుమలలో సేవా టిక్కెట్ల గోల్‌మాల్‌...!

దేవస్థానానికి లక్ష రూపాయల నుండి కోట్ల రూపాయల వరకు విరాళం ఇచ్చిన వారికి పాస్‌బుక్‌లను కేటాయించి ఒక్కొక్కరికి ఒక్కోవిధంగా దర్శనాలు కేటాయించే విధానాన్ని అనుకూలంగా మార్చుకున్న దళారులు, బోగస్‌ పాస్‌బుక్‌లతో పాటు దాతల వద్ద ఉన్న పాస్‌బుక్‌లను కూడా ఉపయోగించుకుని బ్లాక్‌లో టిక్కెట్లను అమ్ముకుని కోట్లు గడించారు. దీనిపై ఆరోపణలు రావడంతో అప్రమత్తమైన టిటిడి ఇఒ సాంబశివరావు ఆరు నెలలకు ముందు దాతలకు వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ ద్వారా దర్శన టిక్కెట్లు కేటాయించే పద్దతిని ప్రవేశపెట్టారు. దీంతో దాతలు ఆన్‌లైన్‌ ద్వారా తమ కావాల్సిన సేవలను పొందుతున్నారు. దీంతో బోగస్‌ టిక్కెట్లు అమ్ముకునే వారి దూకుడుకు చెక్‌పెట్టడం జరిగింది. నకిలీ పాస్‌ పుస్తకాల ద్వారా ప్రస్తుత దాతలలో కొంత మందిని ఆకర్షించి వారికి మాయమాటలు చెప్పి పాస్‌బుక్‌లను పొంది సేవా టిక్కెట్లను అమ్ముకోవడం ప్రారంభించారు. సుమారు 45వేల మంది దాతలు టిటిడికి భారీగా విరాళాలు ఇచ్చారు. వీరిలో లక్ష రూపాయలు ఇచ్చిన వారికి ఒక విధంగా పది లక్షల రూపాయలు ఇచ్చిన వారికి మరో విధంగా కోటి రూపాయలు ఇచ్చిన వారికి ఇంకోవిధంగా దర్శనాలను,వసతిని కల్పించేవారు. నిన్నటి వరకు ఆన్‌లైన్‌ విధానం లేకపోవడంతో దళారులు, కొంత మంది టిటిడి ఉద్యోగులతో లోపాయికారి ఒప్పందాలను కుదుర్చుకుని వారి పేర్లతో టిక్కెట్లను కొనుగోలు చేసి ఇతరులకు ఇచ్చేవారు. ముఖ్యంగా తిరుమల జెఇఒగా శ్రీనివాసరాజు నియమింపబడిన తరువాత బ్రేక్‌ దర్శనాన్ని మూడు విభాగాలుగా విభజించడం జరిగింది. 

    అందులో ముఖ్యమైనది లిస్ట్‌-1 జాబితా. ఈ జాబితా నుండి దర్శనం చేసుకునే వారికి స్వామివారి గర్భగుడిలో హారతి ఇస్తారు. దీంతో హారతి కోసం ఐదు వేలు పదివేలు, పదిహేను వేలు కూడా ఖర్చుపెట్టి కొందరు భక్తులు దళారుల ద్వారా కొనుగోలు చేశారు. ఈ విధంగా గత నాలుగేళ్ల నుండి జరుగుతూనే ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు లిస్ట్‌-1 ద్వారా రోజుకు ఎంత మంది దర్శనం చేసుకున్నారు...ఎవరెవరు ఎక్కడ నుండి ఏ ముఖ్యుల సిఫార్సుల ద్వారా వచ్చారు అనే దానిపై విచారణ జరిపితే బోగస్‌ బ్రేక్‌ టిక్కెట్‌ వివరాలు బయటపడతాయి. గతంలో వీవీఐపి దర్శనానికి వంద నుండి నూటయాభై మందికి మాత్రమే టిక్కెట్లు కేటాయించేవారు. అప్పట్లో గర్భగుడిలో హారతి ఇచ్చే పద్దతి అందరికీ దక్కేది కాదు. ఆ దర్శనానికి ముందు ఎఎడి దర్శనం ఉండేది. ఈ దర్శనాన్ని సుమారు ఐదువేలమందికి టిక్కెట్లు ఇచ్చేవారు. దాంతో చాలా మంది వీవీఐపిలు ఎఎడి ద్వారా స్వామివారిని దర్శించుకుని వసతి గృహాలు ఖాళీ చేసి తిరిగి వెళ్లేవారు.దీంతో వీవీఐపిల తాకిడి తగ్గేది. 

  టిటిడి ఇఒగా ఐ.వై.ఆర్‌.కృష్ణారావు బాధ్యతలు స్వీకరించాక ఎఎడి దర్శనాన్ని రద్దు చేసి ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేశారు. దీంతో వీవీఐపిల తాకిడి ఎక్కువ అవడంతో బ్రేక్‌ దర్శనాల టిక్కెట్లను పెంచడం జరిగింది. గతంలో రాత్రి ఏడు నుండి ఎనిమిది లోపల బ్రేక్‌ దర్శనం ఉండేది. దానిని కూడా రద్దుచేయడంతో ఉదయం బ్రేక్‌ దర్శనం మాత్రమే ఉండేది. రాత్రి బ్రేక్‌ దర్శనం రద్దుచేసిన తరువాత వచ్చిన ఇబ్బందులను అధిగమించేందుకు అధికారులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఒక్కొక్క ఇఒ రావడం ఆయన దర్శనాలలో మార్పులు చేర్పులు చేయడం...అదే విధంగా జెఇఒలు రావడం, దర్శనాలలలో మార్పులు, చేర్పులు చేయడంతో సేవా టిక్కెట్ల కుంభకోణానికి ఆస్కారం ఏర్పడింది. వసతి గృహాలు ఉచితంగా కట్టించిన దాతలకు కేవలం సంవత్సరానికి ఇన్ని రోజులు ఉచితంగా ఉండేందుకు అనుమతి ఉండేది. అదే విధంగా దాతలకు ఉచిత వసతితో పాటు వారి ఇచ్చిన విరాళాలను బట్టి దర్శనాలను ఏర్పాటు చేసేవారు. ముఖ్యంగా లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన వారికి ఇచ్చే దర్శనం టిక్కెట్లను వైకుంఠం కాంప్లెక్స్‌లో నమోదు చేయాలి. కానీ అనమోదు చేయకుండా అక్కడ పనిచేసే ఉద్యోగులు, అధికారులు దళారులతో కుమ్మక్కు అయి అనేక మందికి ఆ టిక్కెట్లు అమ్ముకోవడం జరిగింది. ఎప్పుడైతే ఆన్‌లైన్‌ విధానం వచ్చిందో అప్పుడే ఈ వైకుంఠం కాంప్లెక్స్‌ బోగస్‌ టిక్కెట్లు తగ్గాయి. 

  ఐదేళ్ల నుండి జరిగిన బ్రేక్‌ దర్శనాల టిక్కెట్లు, సేవా దర్శనాల టిక్కెట్లపై విచారణ జరిపితే కోట్ల రూపాయల విలువ గల కుంభకోణం బయటపడే అవకాశం ఉంది. దీని విలువ కొన్ని వేల కోట్లు రూపాయలు ఉంటాయని కొన్ని పత్రికలు ప్రచురించిన కథనాలను టిటిడి అధికారులు కొట్టిపారేశారు. బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముకోవడం నిజమే...కానీ పత్రికల్లో ప్రచురించిన విధంగా కోట్ల రూపాయలల్లో ఉండవని మీడియా వర్గాలకు ఆఫ్‌ ది రికార్డుగా చెప్పారు. జెఇఒ సిబ్బంది ప్రమేయం కుంభకోణంలో ఉందని బయటపడడంతో అక్కడ సూపరింటెండ్‌గా పనిచేసిన 'ధర్మయ్య'ను సస్పెండ్‌ చేయడం జరిగింది. కుప్పం నియోజకవర్గంలో నాయకుడిగా చలామణి అవుతూ 'చంద్రబాబు'కు సన్నిహితంగా ఉండే 'మనోహర్‌' అనే నాయకునికి 'ధర్మయ్య' బంధువని తెలిసింది. 45వేల మంది దాతల పాస్‌ పుస్తకాల్లో రెండు వేల పుస్తకాలను మాత్రమే దళారుల నుండి స్వాధీనం చేసుకున్నారు. 

   దీనిపై పకడ్బందిగా విచారణ జరిపితే జెఇఒ కార్యాలయంలో పనిచేసిన ఉద్యోగులు, అధికారులు, వైకుంఠం కాంప్లెక్స్‌లో ఉద్యోగ బాధ్యతలునిర్వహించిన ఉద్యోగులు ఇంటి ముఖం పట్టక తప్పదు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందించనుందో ఇంత వరకు బయటపడలేదు. ఇందులో ఇంత వరకు బాధ్యత నిర్వహించిన, నిర్వహిస్తున్న ఇఒలకు బాధ్యతలేదని తప్పుకునేందుకు ప్రయత్నించినా వారి హయాంలోనే ఇవన్నీ జరిగాయన్నది వాస్తమే కదా. తప్పు ఎవరు చేసినా..ముద్రపడేది అధికారులపైనే. జెఇఒ శ్రీనివాసరాజు తీసుకున్న నిర్ణయాన్ని గుడ్డిగా సమర్థించిన పాలకవర్గం పలువురు ఇఒలు ఇప్పుడు లబోదిబో మంటున్నా జరిగిన అక్రమాలకు వీరందరూ కారణం కాదా...! ముఖ్యంగా ఎఎడి దర్శనం చేసిన ఐ.వై.ఆర్‌.పై అప్పట్లో వ్యతిరేకత వ్యక్తం అయినా కాంగ్రెస్‌ పాలకులు పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కూడా దీనిపై దృష్టిసారించలేదు. తాను పెట్టిన ఆన్‌లైన్‌ విధానమే ఈ కుంభకోణాన్ని బయటపెట్టిందని ఇఒ సాంబశివరావు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ ఆయన అంతకు ముందు దానిపై ఎందుకు దృష్టిసారించలేకపోయారు. వీవీఐపి మూడు విధాల బ్రేక్‌ దర్శనాన్ని ఎందుకు రద్దు చేయలేదు. ఇవన్నీ ప్రశ్నిస్తే ఆయనకు కోపం...! తనకే పాపం తెలియదని చెబుతున్నారు..త్వరలో దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయా...? దోషులను రక్షించేందుకు టిటిడి అధికారులు, పాలకులు తెరవెనుక ఉండి దాన్ని నీరు కారుస్తున్నారా...? వేచి చూడాల్సిందే.! 

(354)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ