WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బ్లాక్ టిక్కెట్ల వెనుక బ‌డాబాబులు...!

తిరుమలలో శ్రీవారి సేవా టిక్కెట్లను , బ్రేక్‌ దర్శన టిక్కెట్లను కొందరు బోర్డు సభ్యులు జెఇఒ కార్యాలయంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు, అధికారులు, ఛైర్మన్‌ కార్యాలయంలో పనిచేస్తున్న అంతరంగిక సిబ్బంది తమ చేతివాటం చూపించినట్లు ఆధారాలతో బయటకు పొక్కినా ఏ ఒక్కరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. తిరుమల ను జెఇఒ శ్రీనివాసరాజుకు పూర్తిగా అప్పచెప్పారని ఇఒ సాంబశివరావును పట్టించుకోవద్దని పాలకులు చెప్పారని టిటిడి ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఇందులో నిజం లేకపోలేదు. లేకుంటే సమర్థుడు, నిజాయితీపరుడైన ఇఒ సాంబశివరావు సేవా,బ్రేక్‌ టిక్కెట్లపై ఎందుకు దృష్టిసారించలేకపోతున్నారు.ఆయనపై ఒత్తిడి తెచ్చిందెవరు? అనే విషయాలపై రకరకాలైన ప్రచారాలు జరుగుతున్నాయి. కొందరు ముఖ్యుల ఒత్తిడితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇఒ సాంబశివరావు చేతులు కట్టివేశారని లేకుంటే టిక్కెట్లు అమ్ముకునేవారి భరతం ఆయన ఎప్పుడో పట్టేవారని నిజాయితీపరులైన ఉద్యోగులు చెబుతున్నారు. తాను ఒత్తిడిలకు తలగ్గొకుండా, సామాన్యభక్తులకు అనేక సౌకర్యాలు కల్పించానని చెప్పుకుంటున్నా ఇఒ సాంబశివరావు తిరుమలలో జరుగుతున్న ఈ తతంగాలపై ఎందుకు నోరు విప్పడం లేదు. 

   బదిలీ చేస్తారన్న భయమా...? లేక ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా...? తాను ఎంతో నిజాయితీగా బాధ్యతలు నిర్వహిస్తున్నానని, ఎటువంటి అవకతవకలకు అవకాశం ఇవ్వనని చెబుతున్న టిటిడీ ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి తన హయాంలో ఎన్ని సేవా టిక్కెట్లు, ఎన్ని బ్రేక్‌ దర్శనాలలను ఇప్పటి వరకు సిఫార్సు చేశారు అనే విషయంపై వాస్తవాలు చెప్పగలరా...? ఛైర్మన్‌ కార్యాలయ అధికారుల సిఫార్సులతో టిక్కెట్లు అమ్మకాలు జరుగుతున్నాయని, టిటిడి విజిలెన్స్‌ వర్గాలు కూడా ఇఒ దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాయని అయినా ఇంత వరకు ఎలాంటి మార్పులు చేర్పులు జరగలేదని టిటిడి ఉద్యోగులు చెబుతున్నారు. అదే విధంగా జెఇఒ కార్యాలయంలో టిక్కెట్ల కేటాయింపులో అవకతవకలపై 'ధర్మయ్య' విషయం బయటకు పొక్కగా మరి కొంత మంది ఉద్యోగులు బాగోతాలు బయటపడబోతున్నాయి. జెఇఒ శ్రీనివాసరాజు తన కార్యాలయ సిబ్బందికి పూర్తి అధికారాలు ఇవ్వడంతో కొందరు చెలరేగిపోయి ఇష్టారాజ్యాంగా ప్రవర్తిస్తున్నారు. ఒక్కొక్కసారి ఈ దర్శనాల కోరిన వారి జాబితాను కనీసం ఆయన పరిశీలించరట. తిరుపతిలో ఉన్నా లేకపోయినా, ఆ జాబితాలను ఉద్యోగులే తయారు చేస్తున్నారట. ముఖ్యంగా ఉదయం బ్రేక్‌ దర్శనంలో లిస్ట్‌-1 టిక్కెట్ల కేటాయింపులో భారీ ఎత్తున్న సొమ్ములు చేతులు మారుతున్నాయని, పలువురు లిఖితపూర్వకంగా కూడా ఆధారాలతో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ అదే పరిస్థితి నేటికీ కొనసాగుతుంది. 

   బోర్డు సభ్యులల్లో కొంత మంది యాభైమందిని సిఫార్సు చేస్తుండడంతో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చివరకు 35 టిక్కెట్ల కేటాయింపుకు ఒప్పందం కుదిరిందట. అందులో ఉదయం బ్రేక్‌ దర్శనంలో లిస్ట్‌-1 కేటగిరికి ఆరు నుండి పది లిస్ట్‌-2కు మరో పది లిస్ట్‌-3 కేటాయింపుకు మిగిలిన వారిని వీరు సిఫార్సు చేస్తున్నారు. ఈ లిస్ట్‌-1కు సిఫార్సు చేసే ముందు సభ్యుల పేరుతో కొందరు దళారులు టిక్కెట్లను అమ్ముకుంటున్నారు. ఇవన్నీ ఇఒకు తెలుసు...దేవాదాయశాఖ అధికారులకు, మంత్రికి, ముఖ్యమంత్రికి సిఎంఒ అధికారులకు తెలుసు. కానీ ఏ ఒక్కరూ ఆ బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టలేకపోతున్నారు. ఇఒ సాంబశివరావుకు పూర్తిస్థాయి అధికారాలు ఇస్తే వారం రోజుల్లో ఈ అరాచకాలను అరికడతారని, ఆయన మాత్రమే చేయగలుగుతారని ఉద్యోగులు చెబుతున్నారు. త్వరలో సాంబశివరావును బదిలీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొత్త ఇఒగా వచ్చే అధికారి ఇందులో తలదూర్చే అవకాశాలు లేవు. గట్టివాడు...మొండివాడు నిజాయితీపరుడు, సమర్థుడు, స్వంతలాభం చూసుకోని అధికారిగా పేరున్న 'సాంబశివరావే' ఏమీ చేయలేకపోతున్నారు. ఇటువంటి లక్షణాలు ఉన్న అధికారులు ఎందురున్నారు..ఒకవేళ ఉన్నా లేకున్నా...కఠినంగా వ్యవహరించగలుగుతారా...?

(333)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ