WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అనుకున్నదొక్కడి...అయిందొక్కటి...!

కర్నూలు జిల్లా స్థానిక సంస్థల నుండి ఎమ్మెల్సీగా అధికార పార్టీ అభ్యర్థి శిల్పాచక్రపాణిరెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని పార్టీ వర్గాలు వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా అదే నమ్మకంతో ఉండేవారు. అదే సమయంలో డిప్యూటీ సిఎం కె.ఇ.కృష్ణమూర్తి పలు ప్రచార వేదికల్లో మాట్లాడుతూ 'జగన్‌' పార్టీ అభ్యర్థి తమకు పోటీయే కాదని, ఆయన ఎందుకు పోటీ చేస్తున్నానని తలపట్టుకుంటున్నారని వ్యంగ్యంగా విమర్శలు చేశారు. ఇవన్నీ వాస్తవేలేనని అధికారపార్టీ ప్రముఖులు, అధికార వర్గాలు, విపక్షాల నాయకులు గుడ్డిగా నమ్మారు. కానీ చావుతప్పి...కన్నులొట్టపోయి కేవలం 30ఓట్ల మెజార్టీతో టిడిపి అభ్యర్థి అతికష్టంపై విజయం సాధించారు. భూమానాగిరెడ్డి మరణంతో ఆయన అనుచరులు ఆఖరు నిమిషంలో ప్లేట్‌ ఫిరాయించారని, కొంత మంది టిడిపి ఓటర్లు కూడా విపక్షాల అభ్యర్థికి అమ్ముడుపోయారని, ఆ తరువాత చెప్పినా జరగవల్సిన నష్టం జరిగిపోయింది. కౌంటింగ్‌ జరుగుతున్న సమయంలో ఒక దశలో 'జగన్‌' పార్టీ అభ్యర్థి స్వల్ప ఆధిక్యం కనబర్చారు. దీనితో అధికారపార్టీ ప్రముఖులు, కౌంటింగ్‌ నిర్వహిస్తున్న అధికారులు అవాక్కయ్యారు. 

  పోటీ వన్‌సైడ్‌గా ఉంటుందని అధికారులు భావించారు...కానీ ఎక్కడేం జరిగిందో...ఎవరెవరు...ఎన్ని లక్షలకు అమ్ముడుపోయారో...ఏయే ఒత్తిడిలతో ప్లేట్‌ ఫిరాయించారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. పోటీలో లేడని భావిస్తే...పోటీ ఇవ్వడమే కాకుండా గెలుపు వరకు వచ్చి ఆఖరిలో ఓడిన 'జగన్‌' పార్టీ అభ్యర్థిని అధికారప్రముఖులు పరోక్షంగా అభినందించారని బయటకు పొక్కింది. ఇంతకీ అక్కడేం జరిగిందనే విషయంపై 'చంద్రబాబు,చినబాబు'లు ఆరా తీయడం లేదు. ఏదో ఒకటి అభ్యర్థి గెలిచారు కదా...అని వారిద్దరూ సరిపెట్టుకుంటున్నారు తప్ప...ఇంత వెన్నుపోటు జరిగినా..దానికి కారకులైనవారి వివరాలను సేకరించడంలో వారిద్దరు వెనుకడుగు వేయడంలో మర్మం ఏమిటో అర్థం కావడం లేదని ఆ జిల్లాకు చెందిన కొందరు టిడిపి నాయకులు మీడియా వర్గాలతో వాపోతున్నారు. ఆదిలో మెజార్టీ లేదు...అధికారంలోకి వచ్చాక విపక్షాల స్థానిక సంస్థల ప్రతినిధులు చాలా మంది టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. మొదట్లో 475 ఓట్లు 'జగన్‌' పార్టీకి 505 ఓట్లు ఇతరులకు 95 ఓట్లు ఉన్నాయి. ఆ తరువాత జరిగిన రాజకీయ సమీకరణాలతో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. భూమానాగిరెడ్డి చేరికతో ఆగ్రహం చెందిన 'గంగుల ప్రభాకర్‌రెడ్డి' 'జగన్‌' పార్టీలో చేరిపోయారు. అయినప్పటికీ టిడిపి 707, జగన్‌ పార్టీ 298 ఓట్లు ఉన్నాయని లెక్కలు తేల్చారు. దీనిని బట్టి 300 మెజార్టీ గెలుస్తామని అంచనా వేసుకున్నా...అవన్నీ తలకిందులు అయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జి మంత్రి అచ్చెంనాయుడు జరిగిన పరిణామాలతో ఖంగుతిన్నారు. అధికారపార్టీ అభ్యర్థి ఓడిపోతే పరిస్థితి ఏమిటి...? చావు తప్పి కన్నులోట్టపోయినట్లు విజయం సాధించారు...లేకుంటే పరిస్థితి ఏమిటని కర్నూలు జిల్లా నాయకులు వాపోయారు. నాయకులు పార్టీ ఫిరాయించినా...స్థానిక సంస్థల విపక్షాల ప్రతినిధులు వారిని అనుసరించలేదని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. నాయకులే పార్టీ మారారు...క్రిందిస్థాయి నాయకులు ఎవరూ టిడిపికి మద్దతు ఇవ్వలేదు..ఎందుకు ఈ విధంగా జరిగిందో వివరాలతో నివేదిక ఇవ్వాలని 'చంద్రబాబు, చినబాబు' స్థానిక నాయకులను ఆదేశించారు.


(337)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ