మరో ముగ్గురు ఐపిఎస్‌లపై వేలాడుతోన్న కత్తి...!?
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ముగ్గురు ఐపిఎస్ అధికారులపై సస్పెండ్ వేటు వేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. చాలా అరుదైన కేసుల్లో మాత్రమే ఇటువంటి చర్యలను ప్రభుత్వాలు తీసుకుంటుంటాయి. ఒక మహిళా నటి విషయంలో ఐపిఎస్ అధికారులు తమ విధులను అతిక్రమించి, అనైతిక, అక్రమ, దౌర్జన్యపూరితంగా వ్యవహరించడంతో కూటమి ప్రభుత్వం వీరిపై వేటు వేసింది. వీరి చేసిన అక్రమాలపై పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకున్న తరువాతే..వారిపై చర్యలకు ఉపక్రమించింది. చట్టాన్ని, ధర్మాన్ని కాపాడాల్సిన పోలీసులే..అక్రమంగా వ్యవహరించడం, పాలకుల అడుగులకు మడుగులెత్తడంతో..వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. సినీనటి కాదాంబరి వ్యవహారం బయటకువచ్చినప్పటి నుంచి వీరిపై చర్యలు తీసుకోవాలని అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. వారిపై చర్యల కోసం అన్ని వర్గాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చింది. దాంతో..ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే..ఈ ముగ్గురేకాకుండా గత జగన్ ప్రభుత్వంలో అన్యాయంగా, అక్రమంగా వ్యవహరించిన మరో ముగ్గురు ఐపిఎస్ అధికారులపై కూడా త్వరలో వేటు పడనుంది. వాస్తవానికి కాదంబరి కేసులో సస్పెండ్ అయిన అధికారులపై ప్రభుత్వం ముందుగా చర్యలు తీసుకోవాలని భావించలేదు. అయితే కేసులో ఉన్న తీవ్రత దృష్ట్యా వారిపై చర్యలు తీసుకుంది. కాగా జగన్ ప్రభుత్వంలో సిఐడి ఛీఫ్‌లుగా వ్యవహరించిన సునీల్‌కుమార్, సంజయ్‌లు వారి పరిధి దాటి వ్యవహరించారని, వారిపై తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే ఉపన్యాసాలు దంచారు. అయితే వీరిపై ఇంత వరకూ చర్యలు తీసుకోలేదు. అప్పటి నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజును హింసించిన కేసులో ఐపిఎస్ సునీల్‌కుమార్‌పై ఆరోపణలు వచ్చాయి. ఆయనను కస్టడీలో తీవ్రంగా హింసించారని, ఆయనను చంపేందుకు ప్రయత్నించారని, నాడు రఘురామకృష్ణంరాజును హింసిస్తూ ఆ వీడియోలు అప్పటి ప్రభుత్వ పెద్దలకు చూపించారనే ఆరోపణలు సునీల్‌కుమార్‌పై ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మొదట సునీల్‌కుమార్‌పైనే వేటు పడుతుందని రాజకీయవర్గాలు, మీడియా విశ్లేషకులు అంచనా వేశారు. అయితే అదేమీ జరగలేదు. ఆయనకు పోస్టింగ్ మాత్రమే ఇవ్వలేదు. అదే విధంగా ఐపిఎస్ సంజయ్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. నాటి ప్రతిపక్ష నేతలను వేధించిన కేసులు, నిబంధనలకు విరుద్ధంగా మీడియా మీట్‌లు నిర్వహించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయనపైనా వేటు పడుతుందని అందరూ భావించారు. అయితే ఆయనను కూడా కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఇక అప్పటి ప్రతిపక్షనేత, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అక్రమంగా అరెస్టు చేసిన కొల్లి రఘురామిరెడ్డిపైనా చర్యలు తీసుకోలేదు. అప్పట్లో ఆయనను స్కిల్ కేసులో కొల్లి రఘురామిరెడ్డి అరెస్టు చేశారు. నాడు..తనకు వారెంట్ ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని చంద్రబాబు ప్రశ్నించినా..రఘురామిరెడ్డి సమాధానం ఇవ్వకుండా..ఆయనను అర్థరాత్రి అరెస్టు చేసి రోడ్డుమార్గంలో విజయవాడ తరలించారు. వీరి ముగ్గురిపైనా కూటమి ప్రభుత్వం వేటు వేస్తుందని భావించినా..ఇంకా వీరిపై చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ముగ్గురిపై వేటు వేసిన ప్రభుత్వం త్వరలో సునీల్‌కుమార్, సంజయ్, రఘురామిరెడ్డిలపై కూడా వేటు వేస్తుందని, వారందరిపైపూర్తి స్థాయిలో విచారణ చేసిన తరువాత వేటు వేస్తుందనే అంచనాలు ఉన్నాయి. మొత్తం మీద..అప్పట్లో జగన్‌తో అంటకాగిన మరో ముగ్గురిపై కూడా వేటు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.