WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చింతమనేని'ని బుజ్జగిస్తున్న 'రాయపాటి'...!

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రాజకీయంగా,అధికారికంగా తనను అనేక ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా తనపై తప్పుడు కేసులు నమోదు చేయించిన 'పీతాని సత్యనారాయణ'కు మంత్రి పదవి ఇవ్వడంపై ఆగ్రహం చెంది, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెబుతున్న చింతమనేని ప్రభాకర్‌ను బుజ్జగించేందుకు నర్సరావుపేట పార్లమెంట్‌ సభ్యుడు రాయపాటి సాంబశివరావు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 'రాయపాటి'కి అప్పచెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. తనతో పాటు తన అనుచరవర్గాన్ని కూడా 'పీతాని' ఇబ్బందులు పెట్టడమే కాకుండా వ్యక్తిగతంగా వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయని, అయినప్పటికీ భరించానని, పుండుమీద కారం చల్లిన చందంగా మళ్లీ ఆయనకే మంత్రి పదవి ఇవ్వడం ఎంత వరకు సబబు అని 'చింతమనేని' ప్రశ్నిస్తున్నారట. 

   'చంద్రబాబు'పై తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా వ్యక్తిగత ఆరోపణలు చేసిన 'పీతాని'ని అప్పట్లో తాను సమర్థవంతంగా ఎదుర్కొని ఎదురుదాడి చేసిన విషయాన్ని 'చింతమనేని' గుర్తు చేస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు తానేమీ బాధపడడం లేదని, 'పీతాని'కి మంత్రి పదవి ఇవ్వడంలో ఉన్న మర్మం ఏమిటని ఆయన 'రాయపాటి'ని ప్రశ్నించినట్లు తెలిసింది. అధికారవర్గాలపై 'పీతాని' ఆరోపణలు చేయడం, తన సామాజికవర్గంపై అవాకులు, చవాకులు పేలారు...అయినా సహించాను..భరించాను..ఓర్చుకున్నానని...ఇంకెన్నాళ్లు ఇలా ఉండాలని.. నిన్నకాక మొన్న పార్టీలోకి వచ్చిన 'పీతాని' తమపై పెత్తనం చేస్తారా...? ఒక పథకం ప్రకారం తమను అవమానించేందుకు ఆయనను మంత్రిని చేశారా..? ఆయన సామాజికవర్గానికి చెందిన 'రెడ్డి సుబ్రహ్మణ్యం'కు కౌన్సిల్‌ ఛైర్మన్‌ పదవి ఇచ్చారు..అయినా 'పీతాని'కి మంత్రి పదవి ఇవ్వడంలోని అర్థమేమిటని 'చింతమనేని' వర్గం ప్రశ్నిస్తుంది. 

  ఏదో విధంగా సర్దుకుపోండి..తాను నియోజకవర్గ స్థాయిలో కానీ...జిల్లా స్థాయిలో కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తానని 'రాయపాటి' 'చింతమనేని'కి చెప్పినప్పటికీ ఆయన ససేమిరా అంటున్నారు. ఎవరెవరినీ 'పీతాని' ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ తెలుసనని, అటువంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుని టిక్కెట్‌ ఇవ్వడమేమిటి...? ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడమేమిటని...ఆయన వల్ల పార్టీకి ఒరిగేదేమిటని 'చింతమనేని' వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ఎంత బుజ్జగించినా, బతిమిలాడినా ఆయన దిగిరాకపోవడంతో ఎంపి రాయపాటి ఏలూరు వెళ్లాలని భావిస్తున్నారు. 'రాయపాటి' స్వయంగా వెళ్లి ఆయనను బుజ్జగిస్తే ప్రయోజనం ఉంటుందని ఆయన అనుకుంటున్నారు.తాను ఎమ్మెల్యే పదవికి, విప్‌ పదవికి మాత్రమే రాజీనామా చేస్తానని, పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని ఆయన 'రాయపాటి'కి స్పష్టం చేశారట. ప్రాణం ఉన్నంత వరకు పార్టీలోనే ఉంటానని వేరే పార్టీలో చేరే ప్రసక్తేలేదని కూడా ఆయన చెబుతున్నారు. చివరకు ఈ పరిణామాలు ఎటువైపుకు దారి తీస్తాయో వేచి చూడాల్సిందే.


(2258)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ