WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సీనియార్టీ, సిన్సియార్టీ వద్దా...?

మంత్రివర్గ విస్తరణ అనంతరం గుంటూరు జిల్లా టిడిపిలో చెలరేగిన అసంతృప్తి జ్వాలలు 'చంద్రబాబు' ప్రతిష్టను పూర్తిగా మంట గలిపాయి. పార్టీలో సీనియార్టీకి, సిన్సియార్టీకి విలువ ఇవ్వకుండా, అవకాశావాదంపై మొగ్గుచూపడంపై పలువురు సీనియర్‌ ఎమ్మెల్యేలు బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావును ఐదేళ్లు కొనసాగించే పరిస్థితి కనిపించడంతో ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన 'ధూళ్లిపాళ్ల నరేంద్రకుమార్‌' అనుచరలు భగ్గుమంటున్నారు. తమ నాయకుడి తండ్రి 'వీరయ్యచౌదరి' ఎన్టీఆర్‌ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీలో కొనసాగారని, పార్టీ కోసమే ఆయన ప్రమాదానికి గురై చనిపోయారని, ఆయన కుమారుడైన 'నరేంద్రకుమార్‌' వరుసగా ఐదుసార్లు విజయం సాధించి ప్రజల్లో తనకు ఉన్న ఆదరణను నిరూపించుకున్నారని, ఇన్ని అర్హతలు ఉన్నా కూడా ఆయనకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని వారు ఆగ్రావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 

   2004 ఎన్నికల్లో జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో టిడిపి ఓటమి చెందినా 'నరేంద్రకుమార్‌' గెలిచిన సంగతిని 'చంద్రబాబు' మరిచిపోయారా...? పుల్లారావు పార్టీలోకి ఎప్పుడు వచ్చారు..? ఆయన అంతకు ముందు పార్టీకి చేసిన సేవ ఏమిటి? పార్టీ కోసం ఆయన చేసిన త్యాగం ఏమిటి? వ్యాపారవేత్తగా ఉన్న ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా విజయం సాధించారు తప్ప...పార్టీకి ఆయన ఒరగబెట్టిందేమిటి? తమ నాయకుడు సామాన్య కార్యకర్తగా, రైతుబిడ్డగా రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రి వీరయ్యచౌదరి రెండుసార్లు విజయం సాధించి మూడవ సారి ఓడించిన అనంతరం పశ్చాత్తాపడి ఆయన కుమారుడిని ఐదుసార్లు గెలిపించారు. ఏ నాడూ అధినేత చంద్రబాబు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ విమర్శలు చేయలేదు. 'జగన్‌' పార్టీ నాయకులతో కానీ, కాంగ్రెస్‌ నాయకులతో కానీ తమ నాయకునికి వ్యాపారలావాదేవీలు లేవు. అవినీతికి, అక్రమాలకు పాల్పడినట్లు ఏ పత్రిక ఇంత వరకు ప్రచురించలేదు. అపార రాజకీయ అనుభవంతోపాటు ఎన్నికల్లో ఓటమి ఎరుగని నేతగా, అఖండ ప్రజాధరణ ఉన్న 'నరేంద్ర'ను విస్మరించడంతో పాటు 'పుల్లారావు'ను మరో రెండేళ్లు కొనసాగించడంలోని మర్మం ఏమిటి? తమ నాయకుడు చేసిన తప్పేమిటి...? పుల్లారావు చేసిన ఒప్పేంటి...అని వందలాది మంది కార్యకర్తలు, నాయకులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మంత్రి పదవి ఇవ్వకపోవడానికి సంఘం ఛైర్మన్‌ పదవి అడ్డు అయితే దాన్ని వదులుకోవడానికి తమ నాయకుడు సిద్ధంగా ఉన్నారని ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవాలు తెలుసుకుని 'నరేంద్ర'ను పిలిపించుకుని నచ్చచెప్పాలని పలువురు కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు.

(946)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ