WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పార్టీని వీడే ప్రసక్తేలేదు:కాగిత

తాను తెలుగుదేశం పార్టీని వీడిపోతానని జరుగుతున్న ప్రచారాన్ని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకటరావు ఖండించారు. 'జనం ప్రత్యేక ప్రతినిధి'తో ఆయన స్వయంగా మాట్లాడుతూ ఇది కొంత మంది చేస్తున్న ప్రచారమే తప్ప దీనిలో వాస్తవం లేదన్నారు. ముప్పయి సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను...గతంలో టిటిడి ఛైర్మన్‌గా, అసెంబ్లీలో విప్‌గా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించాను. అవినీతి మచ్చలేని రాజకీయనేతగా ప్రజలు సర్టిఫికేట్‌ ఇచ్చారు...నా సినియారిటీని గుర్తించి మంత్రి పదవి ఇవ్వాలని కోరిన విషయం యధార్థమే. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు బాధపడుతున్నాను..తప్ప..ఆయనపై విమర్శలు, ఆరోపణలు చేయనని ఆయన తేల్చి చెప్పారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మరో రెండు, మూడు రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును, కాగిత వెంకటరావు కలవబోతున్నారు. సీనియర్‌ అయిన 'కాగిత'కు ముఖ్యమైన పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగిత అనుచరలు చేసిన ధర్నాలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని కార్యకర్తలు, ఓటర్లు, అనుచరులు కోరుకుంటారు...దానిలో తప్పేముంది...కోపంతోనే వారు విమర్శలు చేశారని, పార్టీపట్ల ధిక్కారం కాదని దీనిని అంత సీరియస్‌గా తీసుకోవద్దని ఆయన మీడియా వర్గాలను కోరారు. తాను ముప్పయి సంవత్సరాలుగా కాంగ్రెస్‌ వ్యతిరేకవాదిగా ఉన్నాను...ప్రజలు పలుసార్లు గెలిపించారు..మూడు సార్లు ఓడించారు. అయినా తాను ఎప్పుడూ నిరాశకు గురి కాలేదని, తనను గెలిపించిన ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేయనని చెప్పారు. 

  గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినప్పుడు మంత్రి పదవి ఇవ్వాలని కోరారా? అని ప్రశ్నించగా...కోరానని..సమాధానం ఇచ్చారు..అప్పుడు ముఖ్యమంత్రి మీకు హామీ ఇచ్చారా...? అని ప్రశ్నించగా...అది తమ అంతర్గత వ్యవహారమని..తాను నాయకుని ఏం కోరానో...ఆయన నాకు ఏమి ఇస్తామని చెప్పారో..తనకు మాత్రమే తెలుసనని మీడియా వర్గాలు ఏదోదే ఊహించుకుని కథనాలు ప్రచురిస్తే ఎలా...? దయచేసి వాస్తవాలను ప్రచురించాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మీతో మాట్లాడారా...? అని ప్రశ్నించగా...తమ నాయకుడు అప్పుడు మాట్లాడారు..ఇప్పుడు మాట్లాడారు...రేపు కూడా మాట్లాడతారని వ్యాఖ్యానించారు. మంత్రి పదవులు అందరికీ ఇవ్వలేరు కదా...ఏయే కారణాలతో తనకు మంత్రి పదవి దక్కలేదో తనకు తెలియదని దీనిపై ఎవ్వరూ రాద్ధాంతం చేయవద్దని కార్యకర్తలకు, అనుచరులకు ఆయన చెప్పారట. భవిష్యత్‌ తన సీనియార్టీని 'చంద్రబాబు' గుర్తిస్తారన్న నమ్మకం తనకు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తాను పార్టీ మారతానని మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి...తెలుగుదేశం పార్టీతోనే ఎదిగాను..పార్టీ మారితే ఇంకా ఎత్తు ఎదగగలనా...? పార్టీ తనకు చాలా గుర్తింపు ఇచ్చిందని, అది తనకు సంతృప్తి కలిగించిదని, పదవి దక్కని బాధ ఉంది...కానీ ముఖ్యమంత్రిని ఎదిరించే ఆసక్తి లేదు...పార్టీని వీడే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు.


(231)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ