WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

గ్రామాల్లో ఆర్టీసీ స‌భ‌లు...!

నష్టాల భారీన పడిన ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు గుంటూరు జిల్లాలోని ఆర్టీసీ అధికారులు గ్రామాలకు వెళ్లి సభలు నిర్వహిస్తున్నారు. ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి నేతృత్వంలో అనేక గ్రామాలకు వెళ్లిన ఆర్టీసీ అధికారులు బస్సు ప్రయాణం సురక్షితం...ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు...అని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ సంస్థ విద్యార్థులకు, వికలాంగులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, ఎమ్మెల్యేలకు, సీనియర్‌ సిటిజన్స్‌కు, ఎమ్మెల్సీలకు,ఎంపిలకు, తెల్లకార్డుదారులకు, పాత్రికేయులకు రాయితీలను కల్పిస్తున్నామని అటువంటి సంస్థ ప్రస్తుతం నష్టాల్లో ఉందని అటువంటి సంస్థను లాభాలబాటలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అంటున్నారు. 

  గుంటూరు జిల్లాలో రోడ్లు భద్రతా నియమనింబంధనలకు విరుద్దంగా, రవాణా నియమాలకు విరుద్ధంగా అనేక ఆటోలు తిరుగుతున్నాయని, ఆయా ఆటోలలో నియమిత సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని దీన్ని నివారించేందుకు ఆర్టీసీలో ప్రయాణమే సురక్షితమని ప్రజలకు వారు వివరిస్తున్నారు. స్టీరింగ్‌ ఆటోలు, పాత ఆటోలు, కమాండర్‌లు వివిథ రకాల జీపుల వలన రోజుకు ఆర్టీసీ రూ.33లక్షలు నష్టపోతుందని, కాంట్రాక్టు  క్యారేజీలుగా తిరగాల్సిన బస్సులు స్టేజీ క్యారేజీలుగా తిరగడం వలన రోజుకు ఏడు లక్షల రూపాయలు ఆర్టీసీకి నష్టం వస్తుందని అన్నారు. అంతే కాకుండా చిన్న,పెద్ద అక్రమ వాహనాల వల్ల గుంటూరు జిల్లాలో రోజుకు నలభై లక్షల రూపాయలు నష్టపోతుందని సర్వే ద్వారా బయటపడిందని , దాదాపు నెలకు 12కోట్ల రూపాయలు సంవత్సరానికి 140కోట్ల రూపాయలను సంస్థ నష్టపోతుందని అధికారులు చెబుతూ ప్రజలే ఆర్టీసీ సంస్థను పరిరక్షించుకోవాలని, సంస్థ మనుగడకే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బస్సు స్టేషన్లు, డిపోలు ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నామన్నారు. ఆర్టీసీకి ఆదాయం వస్తే మరిన్ని కొత్త బస్సులు, డిపోలు ఇతర సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆర్టీసీ నష్టాల నుండి గట్టెకపోతే దాని ప్రభావం పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ ప్రజలపై పడుతుందని అని వారు వివరిస్తున్నారు. సంస్థ మనుగడలో లేకపోతే ఈ రాయితీలు ప్రైవేట్‌ సంస్థలు ఇవ్వవని వివరిస్తున్నారు. ఆర్టీసీ లాభాల్లో ఉంటేనే ప్రజలకు లాభమని..నష్టాల్లో ఉంటే సమాజానికే కష్టమని అధికారులు వివరిస్తున్నారు. 

 అంతకు ముందు ప్రజల వద్దకు స్వయంగా వెళ్లి వారి అభిప్రాయాలను చెప్పిన అధికారులు తాజాగా గ్రామసభల ద్వారా సంస్థయొక్క ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తున్నారు. గ్రామసభలకు, స్థానికసంస్థల ప్రతినిధులు హాజరవుతున్నారు. మిగతా జిల్లాకన్నా గుంటూరు జిల్లాలో ఆర్టీసీ సంస్థను లాభాల బాటలో నడిపించాలనే ఆలోచనతో ఆర్టీసీ సంస్థ రీజనల్‌ మేనేజర్‌ జ్ఞానంగారి శ్రీహరితో పాటు క్రింది స్థాయి అధికారులు, డిపోమేనేజర్లు, సిబ్బంది, గ్రామ సభలకు వెళ్లి ప్రజలను చైతన్యం చేస్తున్నారు. 'జనం ప్రత్యేక ప్రతినిధి' వివిధ గ్రామసభలకు హాజరై ఆర్టీసీ అధికారులు చేస్తున్న కృషిని గమనించారు. ఏది ఏమైనప్పటికీ చారిత్రాత్మకమైన సంస్థను రక్షించుకునేందుకు వీరి చేస్తున్న కృషి ఎంతనైనా అభినందనీయం.


(430)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ