WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలోఉష్ణోగ్రతలు

మధ్య భారతావనిలో కొనసాగుతున్న ఉష్ణగాలుల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరుకున్నాయి. మధ్యప్రదేశ్‌, మరాట్వాడ, తెలంగాణ, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో తీవ్రస్థాయి ఉష్ణగాలుల ప్రభావం కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. 

  మరో రెండు, మూడు రోజుల పాటు వడగాల్పుల పరిస్థితి కొనసాగే అవకాశముంది. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లోనూ సగటు ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీల మేర పెరిగాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మండుతున్న ఎండలకు వడగాల్పులు కూడా తోడవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. భానుడి దెబ్బకు రోడ్లన్నీ ఖాళీ అవుతున్నాయి. వడదెబ్బకు గురై హాస్పిటల్ పాలవుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అనంతపురం జిల్లాలో ఎండలు మండి పోతున్నాయి. 42-45డిగ్రీల ఉష్ణోగ్రతతో అదరగొడుతున్నాయి. ఉదయం 10గంటల నుంచే జనం రోడ్లపై తిరిగేందుకు ప్రజలు భయపడుతున్నారు.

  ఆంధ్రప్రదేశ్‌లోని కడప, కర్నూలు నగరాల్లో సోమవారం అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనంతపురం జిల్లాలో 42, నంద్యాల, తిరుపతిలో 41 డిగ్రీలు, జంగమహేశ్వరరంలో 40 డిగ్రీలు, నందిగామలో 39, విశాఖపట్నం, తుని, కావలి, కాకినాడలో 36, మచిలీపట్నం, ఒంగోలులో 35, నర్సాపురం, కళింగపట్నంలో 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రామగుండం, మెదక్‌లో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, మహబూబ్‌నగర్‌లో 41, హన్మకొండ, హైదరాబాద్‌, ఖమ్మం, నల్గొండలో 40, హకీంపేటలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.

 

(343)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ