WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ముగ్గురు ఐఎఎస్‌లపై బదిలీ వేటు....!

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇఒగా బాధ్యతలు నిర్వహిస్తున్న డి.సాంబశివరావును, జెఇఒగా బాధ్యతలు నిర్వహిస్తున్న 'భాస్కర్‌'ను తిరుమల 'జెఇఒ'గా గత ఆరేళ్ల నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాసరాజులను బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇఒ సాంబశివరావుపై అధికారపార్టీ నాయకుల ప్రముఖులతోపాటు, చంద్రబాబు సన్నిహితులు కూడా ఆయనకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరాజు గత ఆరేళ్ల నుండి ముఖ్యవ్యక్తుల సిఫార్సుతో నిరాటంకంగా జెఇఒగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరో జెఇఒ భాస్కర్‌ కూడా ఆ పోస్టులోకి వచ్చి మూడేళ్లు అయింది. ఈ నేపథ్యంలో మూడు నామాల స్వామి కార్యాలయాల్లో పనిచేస్తున్న ముగ్గురు అధికారులను బదిలీ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఇఒగా బాధ్యతలు నిర్వహిస్తున్న 'సాంబశివరావు' నిజాయితీపరుడు, సమర్థుడైనప్పటికీ తిరుమలపై దృష్టిసారించకపోవడంతో ఆయన విమర్శలపాలయ్యారు. 

  ఆయన తిరుమలపై ఎందుకు దృష్టిసారించలేకపోయారనే విషయంపై రకరకాలైన కథనాలు ఇంటా బయటా వ్యక్తుల నుండి వినిపిస్తున్నాయి. తిరుమలలో శ్రీవారి బ్రేక్‌, సేవా దర్శన టిక్కెట్ల వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని ఇఒ సాంబశివరావుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గట్టిగా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిని ఆయన ఇంత వరకు ఖండించకపోవడంతో అది నిజమేనని భావిస్తున్నారు. అంతే కాకుండా ఆయా టిక్కెట్ల వ్యవహారంలో 'సాంబశివరావు' సిఫార్సు చేయటం అరుదు. ఎవరెవరికీ ఏయే సేవా టిక్కెట్లను ఏ ముఖ్యవ్యక్తుల సిఫార్సులతో కేటాయిస్తున్నారా...? లేక జెఇఒ కార్యాలయ ఉద్యోగులే కేటాయిస్తున్నారా? అనే విషయాలపై ఇఒ సాంబశివరావు ఆరా తీయలేకపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో లిస్ట్‌-1 జాబితా దారులు కేవలం వంద లోపే ఉండేది. టిడిపి ప్రభుత్వ హయాంలో అది 500కు చేరుకుందంటే పరిస్థితి ఏమిటో స్పష్టమవుతుంది. నిన్న మొన్నటివరకు మాజీ బోర్డు సభ్యులు తమిళనాడుకు చెందిన శేఖర్‌రెడ్డి సిఫార్సులు ఎక్కువగా చలామణి అయ్యేవి. ఆయన తరువాత బోర్డు ఛైర్మన్‌ కార్యాలయ ఉద్యోగులు, బోర్డు సభ్యుల సిఫార్సులు ఎక్కువగా ఉండేవని జెఇఒ కార్యాలయ వర్గాలు చెబుతున్నప్పటికీ ఈ సేవా టిక్కెట్ల కేటాయింపులో జెఇఒ శ్రీనివాసరాజు కూడా ఉదారంగా వ్యవహరించారని విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ ఇఒ సాంబశివరావుకు తెలుసు. అయినా ఏమీ చేయలేకపోయారు. ఇఒకు కనీస మర్యాద ఇవ్వాల్సిన జెఇఒ శ్రీనివాసరాజు ఆయనను ఖాతరే చేయరని ఉద్యోగులు చెబుతున్నారు. శ్రీనివాసరాజును జెఇఒగా ఇంకా కొనసాగించాలని రాజ్యాంగపదవిలో ఉన్న ప్రముఖులతో పాటు అధికారపార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కోరుకుంటున్నారు. 

  కానీ ఇఒ సాంబశివరావు విషయంలో ఆయన సామాజికవర్గం వారే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీంతో 'చంద్రబాబు' ముందు 'సాంబశివరావు'ను బదిలీ చేద్దాం..తరువాత శ్రీనివాసరాజు వ్యవహారం పరిశీలిద్దామని అన్నట్లు బయటకు పొక్కింది. కానీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సమీప బంధువు అయిన జిఎడి పొలిటికల్‌ అదనపు కార్యదర్శి 'అశోక్‌కుమార్‌'ను తిరుమల జెఇఒగా నియమించాలని ఒత్తిడి పెరగడంతో ఆయన నియామకానికి గ్రీన్‌సిగ్నల్‌ రాబోతోంది. అన్ని వర్గాలతో కలిసి మెలసి ఉంటే 'అశోక్‌కుమార్‌' రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రముఖులకు వసతి సౌకర్యం కల్పించడంలో ఆయా వర్గాల మన్నలను పొందారు. దీంతో సంతృప్తి పడ్డ 'చంద్రబాబు' 'అశోక్‌'ను తిరుమల జెఇఒగా నియమించేందుకు అంగీకరించారట. తిరుపతి జెఇఒగా బాధ్యతలు నిర్వహిస్తున్న 'భాస్కర్‌' పనితీరుపై పలు విమర్శలు రావడంతో ఆయన అధికారాలకు ఇఒ సాంబశివరావు ఎప్పుడో కత్తెర వేశారు. దీంతో ఆయన తనను బదిలీ చేయాలని ఎప్పటి నుండో సిఎంఒ వర్గాల చుట్టూ తిరుగుతున్నారు. చివరకు ఈ ముగ్గురిని బదిలీ చేద్దామనే నిర్ణయాన్ని సిఎం తీసుకున్నా ఆశ్చర్యమేమీ లేదు.

(1005)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ