లేటెస్ట్

'సుజనాచౌదరి' మళ్లీ కేంద్రమంత్రి కాబోతున్నారా...!?

రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి 'సుజనాచౌదరి' మరోసారి కేంద్ర మంత్రి కాబోతున్నారని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవలే టిడిపి నుంచి బిజెపిలో చేరిన 'సుజనా'ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని తెలుస్తోంది. టిడిపి నుంచి బిజెపిలోకి తనతో పాటు ముగ్గురు రాజ్యసభ సభ్యులను తీసుకెళ్లి తన సత్తా చాటిన 'సుజనా'కు కేంద్ర మంత్రి పదవి ఇస్తే..రాబోయే రోజుల్లో ఆంధ్రాలో పార్టీని ఆయన పటిష్టం చేస్తారని బిజెపి పెద్దలు నమ్ముతున్నారట. ఢిల్లీ మీడియా వర్గాల్లో 'సుజనా' మంత్రి పదవి గురించి జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై పలు ఛానెల్స్‌ వార్తలను ప్రసారం చేస్తున్నాయి. దక్షిణాదిలో కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలని భావిస్తున్న బిజెపి పెద్దలు..ఇప్పుడు 'సుజనా'కు మంత్రి పదవి కట్టబెట్టి..రాబోయే ఎన్నికల నాటికి బలపడాలనే ఆలోచనతో ఉన్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఘోరంగా దెబ్బతినడంతో...టిడిపి ఇక కోలుకునే పరిస్థితి లేదనే అనిప్రాయం పార్టీ నాయకుల్లో వ్యక్తం అవుతోంది. తమ రాజకీయ భవిష్యత్‌ కోసం..బిజెపిలో చేరాలనే నాయకులు చాలా మంది ఉన్నారు. గతంలో టిడిపిలో ఉన్న 'సుజనా'కు వీరందరితో దగ్గరి పరిచయాలు ఉన్నాయి. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్‌ నాయకులు చాలా మంది 'సుజనా'తో టచ్‌లో ఉన్నారు. 'సుజనా'కు కేంద్ర మంత్రి పదవి ఇస్తే..వీరంతా ఆయనను అనుసరిస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కాగా...'సుజనా'కు మంత్రి పదవి ఇస్తే..రాష్ట్రంలో రాజకీయంగా బలమైన సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని, అదే సమయంలో టిడిపిని సమర్థించే ఆ సామాజికవర్గం బిజెపి వైపు చూసే అవకాశం ఉంటుంది. మరో వైపు అధికారంలో ఉన్న వైకాపాను దెబ్బ తీయడానికి ఈ సామాజికవర్గం పనికి వస్తుందని, ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత...టిడిపిని మొదటి నుంచి సమర్థించే సామాజికవర్గం కొంత డస్సిపోయిందని, 'జగన్‌'ను ఎదుర్కోవడం వారికి శక్తికి మించి పని అవడంతో..'బిజెపి' పంచన చేరి...వారిని ఎదుర్కోవాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో...పార్టీ మారినా...తమ రాజకీయ ఉనికిని నిలబెట్టుకోవచ్చనే భావన ఆ వర్గంలో కనిపిస్తోంది. అదే సామాజికవర్గానికి చెందిన 'చౌదరి'ని నాయకుడిగా నిలబెడితే...వారంతా భేషరతుగా మద్దతు ఇస్తారనే భావన ఉంది. దీనిని ఆలోచించే బిజెపి పెద్దలు..ఇప్పుడు 'సుజనా' వైపు మొగ్గుతున్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. సాంకేతికంగా కూడా టిడిపి రాజ్యసభ సభ్యుల విలీనం జరిగిపోవడంతో...'సుజనా' తొందరలోనే మరోసారి కేంద్ర మంత్రి అవుతారని ఆ వర్గాలు చెబుతున్నాయి.

(384)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ