కుక్కల నోరు విప్పితే...జగన్‌కు చిక్కులే...!?
సినీనటి కాదంబరి జత్వాని కేసు కీలక దశకు చేరుకుంది. ఆమె అక్రమ కేసులో కీలకమైన వ్యక్తి కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సినీనటి జత్వానిని హింసించి, అక్రమంగా కేసు బనాయించిన కేసులో విద్యాసాగర్ ప్రధాన నిందితుడు. బొంబాయిలో ఉండే జత్వానీ..విజయవాడకు సమీపంలోని తన భూమిని అక్రమంగా వేరేవారికి అమ్మబోయారని ఆమెపై కుక్కల విద్యాసాగర్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని ఆమెను, ఆమె కుటుంబాన్ని ఆంధ్రాపోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే..ఈ కేసంతా అక్రమమని, అన్యాయంగా ఆమెపై కేసు నమోదుచేశారని తేలింది. దీనిలో అప్పటి ఇంటిలిజెన్స్ ఛీప్ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఐపిఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలపై ఆరోపణలు వచ్చాయి. వీరిని ప్రభుత్వం సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది. జత్వానీ కేసు నమోదు అయిన వెంటనే కుక్కల విద్యాసాగర్ పరారీలో ఉన్నారు. ఫోన్‌లు స్విచ్చాఫ్‌చేసి వేరే రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. అయితే..నిన్న పోలీసులు ఆయనను ఉత్తరాఖండ్‌లో అరెస్టు చేసి..ఆంధ్రాకు తీసుకువస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ కేసు రసకందాయంలో పడింది. ఇప్పటి వరకూ ఐపిఎస్‌లు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీలపైనే విచారణ జరుగుతోంది. ఇప్పుడు కుక్కలను విచారిస్తే..ఈ అక్రమకేసులో ఉన్నవారంతా బయటకు వస్తారు. అప్పటి ప్రభుత్వ పెద్దలు చేయమనడంతోనే..తాము అక్రమ కేసులు ఆమెపై బనాయించామని ఇప్పటికే విశాల్ గున్నీ తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. అయితే..ఇప్పుడు..అసలు ఎవరు చెబితే..కుక్కల ఆమెపై అక్రమ కేసు పెట్టారో..పోలీసులు ఆయనను విచారించి తేలుస్తారు. ఇప్పటికి వచ్చిన వివరాల ప్రకారం ముంబాయికి చెందిన పారిశ్రామికవేత్త జిందాల్ పై జత్వానీ అత్యాచారకేసు పెట్టారు. అయితే..ఆ కేసును ఉపసంహరించుకునేలా..ఇక్కడ ఆమెపై కుక్కలతో అప్పటి పాలకులైన జగన్ ఆదేశాలతో..అప్పటి సకలశాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిని ఈ అక్రమ కేసును పెట్టించారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను ఇప్పుడు కుక్కల నిర్ధారిస్తే..ఇక జగన్‌కు, సజ్జలకు ఇక్కట్లు తప్పవు. కుక్కల కనుక జగన్, సజ్జల చెబితేనే..ఆమెపై అక్రమ కేసు పెట్టానని అంగీకరిస్తే..జగన్‌కు పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. ఆయన ఆ విధంగా కనుక స్టేట్‌మెంట్ ఇస్తే..జగన్ ఈ కేసులో ఎ1, సజ్జల ఎ2 అవుతారు. తరువాత ఐపిఎస్‌లు పిఎస్ఆర్, కాంతిరాణా, విశాల్ గున్నీలను అరెస్టు చేస్తారు. మొత్తం మీద ఈ వారంలో ఈ కేసు సంచలనం సృష్టించబోతోంది.