WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పెదకూరపాడు' వైకాపా అభ్యర్థి 'కన్నా'...!?

సార్వత్రిక ఎన్నికలు షెడ్యూలు ప్రకారం కాకుండా ముందుగా జరపాలని ప్రధాని 'మోడీ' భావిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల కసరత్తును ప్రారంభిస్తున్నాయి. అన్ని రాష్ట్రాలకు, లోక్‌సభతో పాటే ఎన్నికలు జరపాలన్న ప్రధాని మోడీ నిర్ణయం వాస్తవ రూపం దాల్చితే ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల కోసం అన్వేషణను ప్రారంభించాయి. రాజకీయ చైతన్యం అధికంగా కల గుంటూరు జిల్లాలో ఈ అన్వేషణ మరింత వేగంగా జరుగుతోంది. వివిధ పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలకు ఇప్పటి నుంచే గాలం వేస్తున్నారు. జిల్లాలో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైకాపాలు బలమైన అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి. నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణను పట్టించుకోకుండా ఇప్పుడు ఉన్న 17 నియోజకవర్గాలనే దృష్టిలో పెట్టుకుని వారు  అన్వేషణ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గెలుపు వాకిట వరకు వచ్చి బోల్తా పడ్డ వైకాపా ఈసారి అన్ని హంగులతో బలమైన వారిని రంగంలోకి దింపాలని భావిస్తోంది. 2014 ఎన్నికలకు ముందు జిల్లాలోని అన్ని సీట్లను క్లీన్‌స్వీప్‌ చేస్తామని ప్రగల్బాలు పలికిన వైకాపా నేతలు చివరకు కన్నులులొట్టలు పోయిన చందంగా ఐదుసీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వీటిలో మూడు సీట్లు అత్తెసరు మెజార్టీయే. మంగళగిరి, గుంటూరు-1, మాచర్లల్లో ఆ పార్టీ సాధించింది నామ మాత్రపు మెజార్టీనే. మంగళగిరిలో అయితే మరీ ఘోరంగా ఏడు ఓట్ల తేడాతో ఆ పార్టీ అభ్యర్థి గెలిచారు.

   ఇదంతా గతం కాగా..రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలావాలనే బలమైన కోరికతో ఉన్న వైకాపా అధినేత బలమైన అభ్యర్థుల కోసం గాలిస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉండి, వై.ఎస్‌కు అత్యంత సన్నిహితులైన వారిని పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమాన్ని ఆయన ఇప్పటికే ప్రారంభించారు. నర్సరావుపేటలో మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేష్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి గురజాల నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించిన ఆయన ఇప్పుడు పెదకూరపాడుపై దృష్టిపెట్టారు. గతంలో ఇక్కడ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి వై.ఎస్‌ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన 'కన్నా లక్ష్మీనారాయణ'ను ఆయన పార్టీలోకి రమ్మని రాయబారాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఆయన రాయభారం ఎంత వరకు ఫలిస్తుందో కానీ...'కన్నా' కనుక వైకాపాలోకి వస్తే 'పెదకూరపాడు'లో గట్టిపోటీ ఇవ్వవచ్చని పార్టీ నేతలు నమ్ముతున్నారు.

   గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన 'బొల్లా బ్రహ్మనాయుడు' రాజకీయంగా బలహీనుడు కావడంతో ఇక్కడ పార్టీ ఓడిపోయిందని, బలమైన నేత ఉంటే ఇక్కడ పార్టీ గెలుపు తథ్యమని ఆ పార్టీ అభిమానులు అంటున్నారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన  'బొల్లా'ను ఇక్కడ నుంచి పంపేసి కావేటి మనోహర్‌ను ఇక్కడ పార్టీ తాత్కాలిక ఇన్‌ఛార్జిగా 'జగన్‌' నియమించారు. అయితే 'కావేటి మనోహర్‌' సరైన అభ్యర్థి కారని, ఆయన స్థానంలో 'కన్నా'ను రంగంలోకి దించితే ఇక్కడ పోటీ రసవత్తరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 'కన్నా' కనుక పార్టీలోకి వస్తే ఆయన కానీ, ఆయన కుమారుడు 'ఫణీంధ్ర'ను కానీ ఇక్కడ నుంచి రంగంలోకి దింపాలని అధినేత భావిస్తున్నారు. ప్రస్తుతం బిజెపిలో ఉన్న 'కన్నా లక్ష్మీనారాయణ' తన షరతులకు 'జగన్‌' అంగీకరిస్తేనే పార్టీ మారాలనే ఉద్దేశ్యంతోఉన్నట్లు తెలుస్తోంది. తనకు గుంటూరు పార్లమెంట్‌ సీటు, తన కుమారునికి అసెంబ్లీ సీటుతో పాటు జిల్లా పెత్తనం మొత్తం తనకు అప్పగిస్తేనే పార్టీ మారాలనే యోచనతో ఆయన ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరి 'జగన్‌' 'కన్నా'షరతులకు ఒప్పుకుని పార్టీలో చేర్చుకుంటారా...? చూడాలి మరి ఏం జరుగుతుందో...!?


(2403)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ