లేటెస్ట్

'జగన్‌' దూకుడుకు 'బిజెపి' కళ్లెం వేస్తోందా...!?

ముఖ్యమంత్రిగా సరిగా ఇంకా కూర్చోకుండానే 'జగన్‌' తీసుకుంటున్న నిర్ణయాలు...రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల వెనుక అవినీతి ఉందని, ఆ అవినీతిని బయటకు లాగుతానని...ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజును 'జగన్‌' ప్రకటించారు. ఆయన ప్రకటించిన వెంటనే...వివిధ అంశాలపై సీరియస్‌గా దృష్టి పెట్టారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కానీ, విద్యుత్‌ విషయంలో కానీ, రాజధాని అమరావతి విషయంలో కానీ, ప్రస్తుతం 'ప్రజావేదిక' విషయంలో కానీ..ఆయన తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో టిడిపి ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, ప్రాజెక్టు టెండర్ల విషయంలో రివర్స్‌టెంటరింగ్‌విధానం చేపడతామని, 20శాతం తక్కువ కోడ్‌ చేసిన వారికి పనులు అప్పగిస్తామని...ఆయన ప్రకటించారు. 'పోలవరం' ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందని, దాన్ని బయటకు తీస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో..దీనిలో జరిగిన అవినీతి బయటకు వస్తుందని, అందరూ భావించారు..కానీ..కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం...టిడిపి హయాంలో ప్రాజెక్టు కోసం సమర్పించిన అంచనాలను ఆమోదించి...'జగన్‌' ప్రయత్నాలకు అడ్డుకట్టవేసింది. ఇప్పుడు ఈవిషయంలో 'జగన్‌' ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు. గత ప్రభుత్వం అవినీతి చేస్తే...బిజెపి ప్రభుత్వం...ఇప్పుడు అదే అంచనాలను ఎలా ఆమోదించిందనే దానిపై...వైకాపా వర్గాల నుంచి సమాధానం రావడం లేదు. 

అదే విధంగా విద్యుత్‌ పిపిఎలపై సమీక్షలు కుదరదని, కేంద్ర విద్యుత్‌శాఖ వర్గాలు తేల్చి చెప్పాయి. పైగా..గత ప్రభుత్వం పిపిఎలను కుదుర్చుకోవడంలో పారదర్శకంగా పనిచేసిందని సర్టిఫికేట్‌ ఇచ్చి...'జగన్‌'కు నేర్పాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది. మరో వైపు రాజధాని విషయంలోనూ..'జగన్‌' అనుకున్న విధంగా చేయలేకపోతున్నారు. రాజధానిలో 25శాతం పూర్తి అయిన పనులను వదిలేసి..మిగతా పనులను ఆపాలన్న 'జగన్‌' నిర్ణయానికి కేంద్రం అడ్డం తగిలింది. రాజధానిలో పనులు చేస్తోన్న సంస్థలు అంతర్జాతీయ సంస్థలని, వాటిని పనిచేయనీయకపోతే అంతర్జాతీయం గా భారత్‌ పరువు పోతుందని...ఎప్పటి వలే వాటిని పనిచేసుకోనివ్వాలని...'జగన్‌' ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. మొత్తం మీద...'జగన్‌' గత ప్రభుత్వ హయాంలో చేసిన వాటిపై చర్యలు తీసుకోవాలని భావిస్తే..వాటికి కేంద్రం అడ్డుపడు తుందని పైన పేర్కొన విషయాలతో స్పష్టం అయింది. గత ప్రభుత్వం అవినీతిమయం..అని నిరూపించాలని..దూకుడుగా వెళుతోన్న 'జగన్‌'కు కేంద్రం ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తోంది. తాజాగా కరకట్ట మీద అక్రమ కట్టడాల విషయంలో దూకుడుగా వెళుతోన్న 'జగన్‌'కు ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నుంచి తీవ్రమైన అభ్యంతరం వచ్చింది. కేవలం ప్రజావేదికను మాత్రమే కూలగొట్టడం..ఎందుకు అన్నింటిని కూలగొట్టాలని సూచించారు. ఇదొక్కటే కాదు...'జగన్‌' ఏ నిర్ణయం తీసుకున్నా..ఏదో రకంగా..వాటిని ఆపడానికి, జగన్‌ను నిరోదించడానికి, రాజకీయంగా అడ్డకట్టవేయడానికి బిజెపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి నెలలోనే...'జగన్‌'ను ఈవిధంగా కట్టడి చేసిన 'బిజెపి' పెద్దలు..రాబోయే రోజుల్లో మరింతగా విజృంభిస్తారనడంలో సందేహం లేదు. 

(579)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ