లేటెస్ట్

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బాటలో ‘ఆనం’...!?

తన రాజకీయ, అధికార అనుభవాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పట్టించుకోకుండా అనేక విధాలుగా అవమానిస్తున్నారని, కనీస మర్యాద ఇవ్వడం లేదని, సమయం వచ్చినప్పుడు అధినేతపై తిరుగుబాటు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆనంరాంనారాయణరెడ్డి భావిస్తున్నారట. జిల్లాల విభజనను దీనికి అనుకూలంగా మలచుకోవాలని ఆయన భావిస్తున్నట్లు ఆనం సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తో పాటు, ఇతర అధికారులు ముఖ్యమంత్రి జగన్‌ను తప్పుదోవపట్టించారని ‘ఆనం’ బాహాటంగానే తప్పుపట్టారు. అధికారపార్టీలో తనకు గుర్తింపు రాదని తెలుసుకున్న ‘ఆనం’ ‘నర్సాపురం’ ఎంపీ రఘురామకృష్ణంరాజు దారిలోనే నడవాలని ఆయన అనుకుంటున్నారా..? అని నెల్లూరు నేతలు చర్చించుకుంటున్నారట. నెల్లూరుకు 30కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘గూడూరు’ను ‘తిరుపతి’ జిల్లాలో కలపారని, వంద కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న ‘కందుకూరు’ను నెల్లూరు జిల్లాలో ఎలా కలుపుతారని, అంతే కాకుండా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గంలోని కొన్ని మండలాలు నెల్లూరుకు దగ్గరలో ఉన్నాయని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా జగన్‌ను అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ధ్వజమెత్తుతున్నారు. టిడిపిలో ఉన్నప్పుడు చంద్రబాబు తనకు విలువ ఇచ్చారని, కొందరు నేతల వల్లే తాను టిడిపిని వీడానని ‘ఆనం’ తెరవెనుక చెబుతున్నారట.


జిల్లాల విభజన సమస్యను ముఖ్యమంత్రి పరిష్కరించకుంటే తమ నాయకుడు అసమ్మతిని తెలియజేస్తారని ‘ఆనం’ అనుచరులు అంటున్నారు. తమ ప్రభుత్వంపై మెజార్టీ వర్గాల్లో వ్యతిరేకత పెరిగిందని, మళ్లీ వైకాపా అధికారంలోకి రావడం చాలా కష్టమని భావించి, నెల్లూరుకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందినంతవరకు దోచుకుంటున్నారని, ఈ విషయం గురించి తాను ముఖ్యమంత్రికి చెప్పానని, అయితే ఆయన పట్టించుకోవడం లేదని ‘ఆనం’ అంటున్నారు. అధికారపార్టీలో ఉండి అవమానాలు పాలవుతున్నానని, ఇంతకంటే రాజకీయాలకు దూరంగా ఉండడమే బెటర్‌ అని కొంతమంది అధికారులతో చెప్పారంటున్నారు. వైకాపాలో తిరుగుబాటు జెండా ఎగురవేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దోవలో ‘ఆనం’ నడుస్తారా..? లేక మౌనంగా ఉంటారా..? అనేది వేచి చూడాలంటున్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డిని ‘చంద్రబాబు’ పక్కన పెడితే ‘టిడిపి’లో చేరి ‘చంద్రబాబు’కు జై కొట్టాలనుకుంటున్నారట. ఇటీవల కొంతమంది విలేకరులు ‘ఆనం’ను కలిసినప్పుడు ‘జగన్‌’ పాలనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. లక్షణాలు ఏ ఒక్కటీ జగన్‌లో తనకు కనిపించలేదని అన్నారట.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ