జగన్ చెప్పింది నిజమే..పాపాల్లో బిజెపికీ వాటా...!?
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి తన జీవితంలో మొదటి సారి నిజం చెప్పారు. జీవితంలో ఎప్పుడూ నిజాలు చెప్పని ఆయన తిరుమల లడ్డూ కల్తీ విషయంలో తొలిసారి సత్యాలను పలికారు. తిరుమల పాపాల్లో తనతో పాటు బిజెపి నేతల హస్తం ఉందంటూ ఆయన పరోక్షంగా ఈ పాపాల్లో బిజెపి వాటా ఎంతో సూటిగా చెప్పారు. ప్రధాని నరేంద్రమోడికి ఆయన రాసిన లేఖలో టీటీడీ బోర్డులో తనపార్టీకి చెందిన వారితో పాటు బిజెపి వాళ్లు కూడా ఉన్నారని, అప్పట్లో కేంద్ర బిజెపి మంత్రులు టీటీడీ బోర్డులో తమ పార్టీవారికి స్థానం కల్పించాలని సిఫార్సులు చేశారని, వారి సిఫార్సులను తాను ఆమోదించానని, ఇప్పుడు తిరుమలలో జరిగిన అపచారంలో బిజెపికి కూడా భాగం ఉందని ఆయన పరోక్షంగా బిజెపి వారిని బెదిరిస్తున్నారు. ఇందులో తనతో పాటు..బిజెపి పెద్దల హస్తం కూడా ఉందన్నట్లు ఆయన చెబుతున్నారు. వాస్తవానికి ఆయన చెప్పింది వందకు వందశాతం నిజమే. ఐదేళ్ల జగన్ పాలనలో పాపాల్లో బిజెపి పెద్దల వాటాతో పాటు, రాష్ట్రానికి చెందిన బిజెపి నాయకుల వాటా కూడా ఉంది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన సత్యమే. 2019లో చంద్రబాబును ఓడించడంలో బిజెపి పెద్దల భాగస్వామ్యంతో పాటు, తరువాత రాష్ట్రాన్ని అధోగతిపట్టించడంలో కూడా వారు తమ వంతు సహకారాన్ని జగన్‌కు అందించారు. జగన్ రాష్ట్రాన్ని అరాచకంలోకి నెడుతున్నారని, అమరావతిని భ్రస్టుపట్టిస్తున్నారని, పోలవరం ప్రాజెక్టును అటకెక్కించారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, పవిత్రమైన తిరుమలను ఆయన అన్యమతాలకుచెందిన వారితో నింపేస్తున్నారని ఎన్నోసార్లు ప్రతిపక్షానికి చెందిన వారు కేంద్ర పెద్దలకు చెప్పినా, ఫిర్యాదులు చేసినా..ఇసుమంతైనా పట్టించుకోలేదు. పైగా ఆయనకు ప్రతిసారి మద్దతు ఇచ్చి, రాష్ట్ర నాశనానికి కారకులయ్యారు. కేవలం రాష్ట్ర నాశనమే కాదు, పవిత్రమైన పుణ్యక్షేత్రాలను నాశనం చేస్తున్నా, రాముడు శిరస్సు నరికేసినా, ఆలయాల రథాలను తగులబెట్టినా కేంద్ర పెద్దలు కనీసం ఒక్కసారి కూడా జగన్‌ను మందలించిన పాపానపోలేదు. సరికదా..ఆయనకు ఆర్థికంగా ఎప్పటికప్పుడు సహాయం చేసుకుంటూ..రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకునే..జగన్ తనతో పాటు బిజెపి వాళ్లు కూడా ఈ పాపాల్లో ముద్దాయిలని ఖరాఖండిగా చెబుతున్నారు. తమ దత్తపుత్రుడు గత ఐదేళ్లలో ఏమిచేసినా మురిసిపోయిన ప్రధాని మోడీ..తాజా తిరుమల లడ్డూ..పాపాన్ని ఎలా కడుక్కుంటారో..?