సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ నేరాంగీకారం...!?
సింగపూర్ మాజీ రవాణాశాఖ మంత్రి జె.ఈశ్వరన్ పై వచ్చిన అవినీతి ఆరోపణలను ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈశ్వరన్ మంత్రిగా పనిచేస్తోన్న సమయంలో పలువురి నుంచి బహుమతులను స్వీకరించినట్లు ఆయన అంగీకరించారని స్థానిక మీడియా తెలిపింది. ఇంగ్లీషు ప్రీమియర్ లీగ్ సాకర్ మ్యాచ్ టిక్కెట్లతో పాటు సింగపూర్ ఫార్ములా 1 గ్రాండ్ ఫిక్స్ టిక్కెట్లను ఆయన బహుమతుల రూపంలో పొందారని, దానితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఓంగ్ బెంగ్‌సెంగ్ నుంచి వందలకోట్ల డాలర్లను లంచాల రూపంలో తీసుకున్నారనే ఆరోపణలపై ఈశ్వరన్‌ను గత ఏడాది జూలైలో అరెస్టు చేశారు. 64 ఏళ్ల ఈశ్వరన్ 2006లో సింగపూర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తరువాత చాలా కాలం ఆయన మంత్రివర్గంలో ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసు సింగపూర్‌ను కుదిపేస్తుంది. ప్రపంచంలో అతి తక్కువ అవినీతి ఉన్న దేశాల్లో సింగపూర్ మొదటి ఐదు దేశాల్లో ఒకటిగా ఉంటుంది. అటువంటి దేశంలో ఇలా ఒక మాజీ మంత్రిపై అవినీతి ఆరోపణలు రావడం, దాన్ని ఆయన అంగీకరించడం సింగపూర్‌లో సంచలనంగా మారింది. సింగపూర్‌కు సంబంధించి చివరి అవినీతి కేసు 1986లో వచ్చింది. ఆ తరువాత ఎప్పుడూ సింగపూర్‌లో అవినీతి కేసు బయటకు రాలేదు.
అమరావతితో ఈశ్వరన్‌కు సంబంధం...!
రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ తలపెట్టిన అమరావతి నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వమే మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించింది. అత్యంత నిజాయితీ కలిగిన దేశం నుండి మాస్టర్‌ప్లాన్ పొందామని అప్పట్లో చంద్రబాబుచెబుతుండేవారు. రాజధానికి మాస్టర్‌ప్లాన్ ఇచ్చిన తరువాత అమరావతి శంఖుస్థాపన కార్యక్రమంలో సింగపూర్ ప్రతినిధిగా ఈశ్వరన్ పాల్గొని తెలుగులో ప్రసంగించారు. అప్పట్లో ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో మహామహులు పాల్గొన్నారు. కాగా అమరావతి నిర్మాణంలో సింగపూర్ సంస్థలు క్రియాశీలకంగా పనిచేశాయి. అయితే అప్పట్లోనే వైకాపా నేతలు సింగపూర్ జోక్యం పట్ల విమర్శలు గుప్పించేవారు. చంద్రబాబు, ఈశ్వరన్ ఇద్దరూ కలిసి దోచుకుంటున్నారని ఆరోపించేవారు. అయితే..తరువాత కాలంలో..టిడిపి ప్రతిపక్షంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన వైకాపా అమరావతికి చెల్లుచీటి రాయడంతో..ఈశ్వరన్ పేరు పెద్దగా వినిపించలేదు. తాజాగా ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలు దృష్ట్యా వైకాపాకు మళ్లీ ఆరోపణలు చేసే అవకాశం దొరికింది.మరి దీనికి టిడిపి ఎలా ప్రతిస్పందిస్తుందో..చూడాలి.