WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పొన్నారు'కు 'నరేంద్ర' గుడ్‌బై చెబుతారా...?

గుంటూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. 2019లో జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలు 2018లోనే జరుగుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో జిల్లా రాజకీయాల్లో హఠాత్తుగా సందడి మొదలైంది. పలువురు సీనియర్‌ నాయకులు తమ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుండగా, మరి కొందరు తమకు సేఫ్‌ ప్లేస్‌ కోసం వెంపర్లాడుతున్నారు. నియోజకవర్గాల పునర్‌విభజన కూడా జరుగుతున్న నేపథ్యంలో ఎవరికి వారు గెలిచేచోటు వెదుకుంటున్నారు. జిల్లాలో వరుసగా ఐదుసార్లు విజయం సాధించి రికార్డు సృష్టించిన 'పొన్నూరు' శాసనసభ్యుడు 'ధూళ్లిపాళ నరేంద్ర' కూడా తన నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఊహాగానాలు జోరందుకున్నాయి.

   1994 నుంచి 2014 వరకు వరుసగా ఐదు సార్లు ఆయన 'పొన్నూరు' నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అంతకు ముందు ఇదే నియోజకవర్గం నుంచి ఆయన తండ్రి ధూళిపాళ్ల వీరయ్యచౌదరి రెండు సార్లు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి ఒక్కసారి తప్ప ప్రతిసారీ ఈ నియోజకవర్గంలో 'దూళ్లిపాళ్ల' కుటుంబ హవానే నడిచింది. తొలుత 1983లో 'వీరయ్యచౌదరి' 'గోగినేని నాగేశ్వరరావు'పై  23,712 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. అనంతరం 1985లో 'చిట్టినేని వెంకటరావు'పై మళ్లీ 'వీరయ్యచౌదరి' విజయం సాధించారు. తరువాత 1989లో జరిగిన ఎన్నికల్లో 'చిట్టినేనివెంకటరావు' 'వీరయ్యచౌదరి'పై విజయం సాధించి ప్రతీకారం తీర్చుకున్నారు. తరువాత 1994 ఎన్నికల ప్రచారం సందర్భంగా 'వీరయ్యచౌదరి' రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుమారుడు దూళ్లిపాళ్ల నరేంద్రకుమార్‌ ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. 1999, 2004,2009ల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను ఆయన ఓడించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని సీట్లలోనూ టిడిపి ఓడిపోయినా 'నరేంద్ర' మాత్రం విజయం సాధించగలిగారు.20014లో వైకాపా అభ్యర్థి 'రావివెంకటరమణ'పై విజయం సాధించారు.దాదాపు 31సంవత్సరాలపాటు 'పొన్నూరు' నియోజకవర్గంలో 'దూళ్లిపాళ్ల' హవాకు అడ్డేలేకుండాపోయింది. 'పొన్నూరు' నియోజకవర్గంపై తిరుగులేని పట్టుసాధించిన 'నరేంద్రకుమార్‌'కు మొన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి లభిస్తుందని ప్రచారం జరిగింది. ఆయన అనుచరులు కూడా ఈసారి తమ నేతకు తప్పకుండా మంత్రి పదవి లభిస్తుందని ఆశించారు. అయితే వారు అనుకున్న విధంగా జరగకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేయాలని 'నరేంద్ర'పై ఒత్తిడి పెంచారు.వీరి ఒత్తిడికి తలొగ్గని 'నరేంద్ర' ఎప్పటికైనా తనకు మంత్రి పదవి రావడం ఖాయమని వ్యాఖ్యానించారు.

  ఇది అంతా ఇలా ఉంటే హఠాత్తుగా 2018లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడంతో నియోజకవర్గంలో పరిస్థితులు తారుమారు అవుతున్నాయని రాజకీయంగా కలకలం రేగింది. ప్రస్తుతం జనరల్‌ సీటుగా ఉన్న 'పొన్నూరు' నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ జరిగితే రిజర్వ్‌ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మరో నియోజకవర్గం చూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో తనకు పక్కనే ఉన్న 'పత్తిపాడు' వైపు 'నరేంద్ర' చూస్తున్నారట. ప్రస్తుతం రిజర్వ్‌ నియోజకవర్గంగా ఉన్న 'పత్తిపాడు' నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ జరిగితే జనరల్‌ అవుతుందని చెబుతున్నారు. దీంతో 'పత్తిపాడు'పై 'నరేంద్ర' ప్రత్యేక దృష్టిసారించారని వారు అంటున్నారు.

నియోజకవర్గంపై నరేంద్ర పట్టుకోల్పోయారా...?

 నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ సంగతి పక్కన పెట్టినా 'నరేంద్ర' స్థానికంగా నియోజకవర్గంలో పట్టుకోల్పోయారనే మాట నియోజకవర్గ ప్రజల నుంచి వ్యక్తం అవుతుంది. ఇప్పటికే సంగం డైరీ వ్యవహారంలో ఆయన పీకల దాకా మునిగి ఉన్నారనే మాట వినిపిస్తోంది. దీనిపై ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలు హైకోర్టులో కేసులు వేయటం 'నరేంద్ర'కు చికాకులు సృష్టిస్తోన్న మాట యధార్ధం. అదే విధంగా వరుసగా ఐదుసార్లు గెలిచిన 'నరేంద్ర' కొన్నివర్గాలకే ప్రయార్టీ ఇస్తోన్నారని ఇతర వర్గాలు భావిస్తున్నాయి. అంతే కాకుండా గత ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన 'రావి వెంకటరమణ' ఈసారి 'నరేంద్ర'ను ఓడించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఒక వైపు టిడిపి అధిష్టానం శీతకన్ను వేయటం మరో వైపు ప్రత్యర్థి పుంచుకోవడం 'నరేంద్ర'ను కలవరానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సురక్షితమైన స్థానం కోసం 'నరేంద్ర' అన్వేషిస్తున్నారన్న రాజకీయ విశ్లేషకుల మాట నిజమా...? కాదా...? అనేది త్వరలోనే తేలనుంది.


(1972)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ