WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఒంటరిగా బరిలోకిదిగుతాం

ఒంటరిగా బలపడ్డాం.. ఒంటరిగా పోదాం అనే నినాదంతో తెలంగాణలో కార్యచరణ ప్రారంభిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే లక్ష్మణ్‌ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలను విస్మరించిందని, మాటలు కోటలు దాటుతున్నాయి చేతలు గడప దాటడం లేదన్నారు. విమర్శించే వారిపై ఎదురు దాడి చేయడం సరికాదని, ప్రతిపక్షాలను అణిచేయడమే పనిగా పెట్టుకున్నారంటూ లక్ష్మణ్‌ ఆరోపించారు. తెలంగాణలో కమలం గాలి వీస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు పూర్తి సమయాన్ని వెచ్చించేందుకు 70 మంది ముందుకొచ్చారని రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ వెల్లడించారు. వీరికి అవసరమైన శిక్షణ అందించామన్నారు. మరో 50 మంది కూడా సుముఖత వ్యక్తం చేశారని ఆయన తెలిపారు.

  ‘సబ్‌కాసాత్‌- సబ్‌కా విసాస్‌’ అక్షరాలా అమలవుతుండటంతో మైనార్టీల ప్రాబల్యం అధికంగా ఉన్నచోట్లలోనూ పార్టీ జయకేతనం ఎగరేస్తోందని ఆయన గుర్తు చేశారు. మతపరమైన రిజర్వేషన్లు, సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు.. ఇలా చట్టవిరుద్ధ నిర్ణయాలతో తెరాస ప్రభుత్వం అభాసుపాలవుతోందన్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకం కాస్తా ఫీజు బకాయిల పథకంగా మారిందని విమర్శించారు. బీసీ సంక్షేమం అంటూ బహిరంగంగా మొసలికన్నీరు కార్చే కాంగ్రెస్‌, ఇతర పార్టీలు రాజ్యసభలో ఓబీసీ కమిషన్‌కు చట్టబద్ధత తెచ్చే బిల్లును అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. ఇలాంటి అన్ని విషయాలను ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. మతపరమైన రిజర్వేషన్ల విషయంలో విజయవంతంగా నిరసన కార్యక్రమాలను చేపట్టిన జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. మే నెలలో తెలంగాణలో అమిత్‌షా పర్యటన నేపథ్యంలో ఎలా వ్యవహరించాలనే అంశమై ఈ సమావేశాల్లో నిర్ణయిస్తామన్నారు. త్వరలోనే జిల్లా, మండల స్థాయిలోనూ కార్యవర్గ సమావేశాలను నిర్వహించేలా చూస్తామని ఆయన వివరించారు.

(109)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ