WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తెలంగాణ‌లో కాంగ్రెస్ తో టిడిపి పోత్తు....!?

పెద్ద శత్రువును ఓడించాలంటే చిన్న శత్రువుతో స్నేహం చేయాలట. ఈ సామెతను బాగా వంట పట్టించుకుంటున్నట్లుంది తెలంగాణ టీడీపీ. అందుకే టీఆర్ఎస్ ను ఓడించేందుకు కాంగ్రెస్ తో దోస్తీ కట్టేందుకు ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో టీడీపీ నేత రేవంత్ రెడ్డి మంతనాలు జరిపినట్లు ప్రచారం సాగుతోంది. ఈవిషయం పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదంటున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంంగా పుట్టిన పార్టీ టీడీపీ. తెలుగునాట హస్తం గుర్తును చెరిపేసి విజయభేరి మోగించిన పార్టీ. కానీ తెలంగాణలో ఆ పార్టీ ఉనికే లేకుండా పోతుంది. టీడీపీ ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకోవడమే ఇందుకు కారణం. ముగ్గురంటే ముగ్గురే ఇప్పుడు ఆ పార్టీకి మిగిలారు. పూర్తిగా ఆ పార్టీ పరిస్థితి దిగజారకుండా ఉండాలంటే పొత్తులు పెట్టుకోక తప్పని స్థితి. పోయినసారి ఎన్నికల్లో కమలం పార్టీతో చేతులు కలిపింది టీడీపీ. కానీ అది పెద్దగా అచ్చి రాలేదు. 

  ఏపీలో టీడీపీకి అది లాభించినా..తెలంగాణలో ఇందుకు విరుద్దంగా జరిగింది. అసలుటీడీపీ నేతలను తెలంగాణ బీజేపీ నేతలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఉమ్మడి శత్రువు టీఆర్ఎస్ పై పోరు చేసేందుకు ఆ పార్టీ నేతలు కలిసి రావడం లేదు. దీంతో టీటీడీపీ ఒంటరిగానే కేసీఆర్ సర్కారుపై పోరాటం చేస్తోంది. బీజేపీ వైఖరి పై అసంతృప్తిగా ఉన్న నేతలు విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వద్ద ప్రస్తావించారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. భవిష్యత్ లో చూద్దామని చెబుతున్నారు. అసలే తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఓరుగల్లు సభను ఎన్నికల సభగా మార్చారు సి.ఎం కేసీఆర్. ఈ ఎత్తులు చూస్తే ముందస్తు ఎన్నికలు ఖాయంగా కనిపిస్తోంది.అందుకే ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్నారాయన. కాంగ్రెస్ తో పొత్తు విషయమై చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వక పోవడంతో ముందుకా వెనక్కా అనే సందిగ్దంలో నేతలు పడిపోయారు. టీఆర్ఎస్ ను ఓడించాలంటే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలతో పాటు కామ్రేడ్స్ ను కలుపుకు పోయేందుకు విపక్షాలు సిద్దమవుతున్నాయి. దీంతో అసలు సిసలు రాజకీయం మొదలు కానుంది.

 

(510)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ