WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఏడాదిలోపే చింతలపూడిలో నీళ్ళు పరిగెత్తిస్తాం

మైలవరం - దారినపోయే దానయ్యల మాటలు నమ్మకండి. ఏ ఒక్క సెంటు పొలము అమ్మకండి. ఏడాదిలోపే చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీళ్లు పరుగులెత్తిస్తాం. రైతుల పంట భూములకు పుష్కలంగా సాగునీరు అందిస్తాం. అని అంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మాత్యులు దేవినేని ఉమామహేశ్వరరావు రైతులకు అభయమిచ్చారు. శుక్రవారం మైలవరంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ, పట్టిసీమ నిర్మాణం చేస్తున్నప్పుడు మమ్మల్ని ఎగతాళి చేసారని, సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా 10సార్లు పట్టిసీమను పరిశీలిస్తే తాను 20సార్లు పట్టిసీమలో నిద్రలు చేసానని, గుడ్డకాల్చిమీదేసే వారందరికి అనుకున్న సమయానికే పట్టిసీమను పూర్తి చేసి సమాధానం చెప్పామని తెలిపారు. పట్టిసీమ నీళ్ళ వల్లనే కృష్ణాడెల్టా రైతులు దాదాపు 8వేల కోట్ల పంట లాభాలను పొందారని, పట్టిసీమ లేకపోతే కృష్ణాడెల్లా ఆయకట్టు లేనట్లేనని తెలిపారు. 

  గతంలో తాను నిర్వహించిన పాదయాత్రల వలన రైతుల కష్టాలు, సాగునీటి అవసరాలపై పూర్తి అవగాహన పెరిగిందని అంటూ చింతలపూడి ఎత్తిపోతల పథకం పాదయాత్రల అనుభవ ఆలోచనల ఫలితమని చెప్పారు. రాష్ర్టంలోని ప్రతి పౌరుడు పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులను చూడాలని, ఆపనులు జరుగుతున్నందుకు గర్వపడాలని తెలిపారు. రాబోవు కాలంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా పశ్చిమ కృష్ణా ప్రాంతంలోని సాగర్ కాలువలతోపాటు చెరువులు, కుంటలు, వాగుల్లో నీళ్లు పారతాయని, ఈ ప్రాంత భూములకు మంచిరోజులొస్తాయన్నారు. విభజన అనంతరం ఏపి నెత్తిన కష్టాల కుంపటి పెట్టినా చంద్రబాబు నాయుడు తన దార్శనికతతో, దక్షతతో రాష్ర్టాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్నట్లు చెప్పారు. క్రింది స్థాయినుండి పై స్థాయి వరకు అందరూ ప్రజా ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన పనులను చూసి చేతులెత్తిమరీ గర్వంగా ప్రజలకు వివరించాలన్నారు. రెండేళ్ళ పాటు అధికారులు, ఇంజనీర్లు కష్టపడి ఏపీ వరుణ యాప్ ను రూపొందించారని దీనిని స్మార్ట్ ఫోన్లో డౌన్ లోడ్ చేసుకుంటే రాష్ర్ట సమాచారంతో పాటు మీ మీ ప్రాంతాలలోని గాలివేగం, నీటిమట్టం మరియు తేమ శాతం తెలుస్తాయని దానికి అనుగుణంగా రైతులు పనులను చేపట్టవచ్చునన్నారు. 

  వేదికపైన వరుణ యాప్ ను డౌన్ లోడ్ చేసిమరి మైలవరం, రెడ్డిగూడెం ప్రాంతాలలోలని గణాంకాలను ఆయన వివరించారు. ఈ మండు వేసనిలో నాయకులు చలివేంద్రాలు పెట్టి ధాతృత్వం చాటుకోవాలని, స్తోమత ఉన్న నాయకులు ప్రజలకు మజ్జిక కూడా సరఫరా చేస్తే మంచి పేరు వస్తుందని తెలిపారు. నందిగామ నియోజకవర్గంలో స్వర్గీయ దేవినేని వెంకటరమణ మానస పుత్రిక వేదాద్ది ఎత్తిపోతల పథకంను పూర్తిగా కార్యాచరణలోకి తీసుకురావడానికి తనకు నాలుగేళ్లు పట్టిందని కేవలం రూ.18కోట్ల ప్రాజెక్టు చెల్లింపులకు ఎన్నో కొర్రీలు వేసారని, ఐనా పథకాన్ని ఆచరణలోకి తెచ్చినట్లు చెప్పారు. అదే రీతిలో చింతలపూడి ఎత్తిపోతల పథకంను ఏడాదిలోపే కార్యాచరణలోకి తెస్తామన్నారు. నాయకులు మనస్పర్థలు వీడి ఐక్యంగా పనిచేస్తే గ్రామాల్లో అభివృద్ధి మరింత వేగం పుంచుకుంటుదని చెప్పారు. గతంలో ఎమ్మెల్యేలను, మంత్రులను కలవాలంటే చెట్ల దగ్గర, గేట్ల దగ్గర పడిగాపులు పడేవారని ఇప్పుడు ఆ పరిస్థితి పోయిందని, విజయవాడలో కాని మైలవరంలో కాని తన కార్యాలయాల తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఫోన్ చేసినా అందరికీ అందుబాటులో ఉంటున్నానని ఆయన వివరించారు. 

(276)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ