WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

త్రిబుల్ త‌లాక్ పై రాజ‌కీయాలు వ‌ద్దు...!

వివాదాస్ప‌ద ట్రిపుల్ త‌లాక్ అంశంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తన అభిప్రాయాన్ని వినిపించారు. ట్రిపుల్ త‌లాక్ అంశాన్ని రాజ‌కీయ కోణంలో చూడ‌రాద‌న్నారు. బ‌స‌వ జ‌యంతి సంద‌ర్భంగా శనివారం  ఢిల్లీలోని విజ్ఞాన్ భ‌వ‌న్‌లో జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. బసవ బోధనలను సంగ్రహించాలని మోదీ సూచించారు. అహింస, సత్యాగ్రహం, సుపరిపాలన గురించి భారత్ చాలా మంచి సందేశం ఇచ్చిందన్నారు.ముస్లిం మ‌హిళ‌ల‌కు కూడా స‌మాన హ‌క్కులు క‌ల్పించాల‌న్నారు. ట్రిపుల్ త‌లాక్ లాంటి చెడు ప‌ద్ధ‌తుల నుంచి మ‌హిళ‌ల‌ను కాపాడుకునే సంస్క‌ర‌ణ‌ల‌కు ముస్లిం మ‌త‌పెద్ద‌లు దారులు వెతుకుతార‌న్న అశాభావాన్ని కూడా ప్ర‌ధాని వ్య‌క్తం చేశారు. ముస్లిం మతంలో సంస్కరణలు మహిళలకు లాభం చేకూర్చుతాయని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. సంస్కరణలతో ముస్లిం మహిళలకు రక్షణ కలిగించాలన్నారు. ముస్లిం మతంలో తీసుకొస్తున్న సంస్కరణల్లో భాగంగా మరికాస్త ముందడుగు వేసి ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేస్తారని నమ్ముతున్నానని పేర్కొన్నారు. 

  మహిళలు వ్యతిరేకిస్తున్న ఈ విధానం పట్ల ఉదార భావంతో ఉండాలని పేర్కొన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ పద్ధతి రాజ్యాంగపరంగా చెల్లుతుందా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టులోని రాజ్యాంగ ధర్మాసనం వాదనలు వినడానికి అంగీకరించింది. మూడుసార్లు తలాక్‌ చెప్పే విధానం వల్ల తమకు అన్యాయం జరుగుతోందని కొందరు ముస్లిం మహిళలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జాతీయ కార్యవర్గ సమావేశంలోనూ మోదీ ట్రిపుల్‌ తలాక్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కోర్టులో ట్రిపుల్‌ తలాక్‌కు వ్యతిరేకంగా వాదిస్తోంది. సరైన కారణాలు లేకుండా ట్రిపుల్‌ తలాక్‌ను అంగీకరించబోమని ఇటీవల ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు వెల్లడించింది. మూడు సార్లు తలాక్‌ చెప్పి విడాకులు ఇచ్చే విధానంపై ఇటీవల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

.

(130)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ