పదవులపై తమ్ముళ్లలో గందరగోళం...!?
తెలుగుదేశం పార్టీ అధిష్టానం నాన్చినాన్చి ప్రకటించిన నామినేటెడ్ పోస్టులపై తెలుగు తమ్ముళ్లలో ఆనందం కంటే..ఆగ్రహమే ఎక్కువ వ్యక్తం అవుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మూడు నెలల తరువాత ప్రకటించిన ఈ నామినేటెడ్ పదవులు తమ్ముళ్లలో గందరగోళానికి, అసహనానికి, అసంతృప్తికి కారణమవుతోంది. పదవులు వచ్చిన వారు కూడా సంతోష పడకపోవడం..ఈ పదవుల పంపకంలో ఉన్న ప్రత్యేకత. తమకు ఎందుకు పదవులు ఇచ్చారా..? దేవుడా..అని కొందరు..? ఆవేదన చెందుతుండగా, తమకు పదవులు ఇవ్వలేదని మరి కొందరు ఆవేశపడుతున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉండగా పార్టీ కోసం తాము ఎంతో చేశామని, తమను కనీసం గుర్తించ లేదని కొందరు పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపి, నియోజకవర్గస్థాయి నాయకులకు సామాన్య కార్యకర్తలకు ఇచ్చే పదవులు ఇచ్చారని, ఓ కార్పొరేషన్‌లో డైరెక్టర్ పదవా..? అంటూ వారు విస్తుపోతున్నారు. ఇంత చిన్నస్థాయి పదవులు మేము చేయాలా...? ఇవో పదవులా...? వీటి కోసం ఇంత కసరత్తు చేయాలా..? ఈ పదవులు మాకు వద్దులే.. అంటూ కొందరు తిరస్కరిస్తున్నారు. మరొ కొందరు మాత్రం ఏదో ఒకటి ఇచ్చారని సర్దుకుంటున్నారు. అసలు పదవులు రానివారు మాత్రం తండ్రీ కొడుకులు తమకు అన్యాయం చేశారని వాపోతున్నారు. పార్టీ కోసం ఎంతో చేశామని, కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని నిర్వేదంగా చెబుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉండగా, పార్టీ కోసం ప్రాణం పెట్టి పనిచేసిన నేతలకు కనీస గుర్తింపు ఇవ్వలేదనే ఆవేదన వారిలో ఉంది. అయితే..ఇదే మొదటి జాబితా కనుక, అసలైన పదవులు ఇంకా ముందు ఉన్నాయని, వాటి భర్తీ చేసినప్పుడు ఇటువంటి వారికి అవకాశం వస్తుందని కొందరు సర్ధి చెప్పుకుంటున్నారు. మొత్తం మీద ఊరించి..ఊరించి ఇచ్చిన నామినేటెడ్ పదవులు వచ్చినవారికి కానీ..రాని వారికి కానీ సంతృప్తిని ఇవ్వలేదనేది నిజం.