‘పట్టాభి’ చేసిన నేరమేమిటో...!?
తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు నామినేటెడ్ పదవి రాకపోవడంపై పార్టీలో విస్తృత చర్చ సాగుతోంది. ఆయనకు ఎందుకు పదవి ఇవ్వలేదనే దానిపై పార్టీలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు. తనపై తన ఇంటిపై వైకాపా మూకలు పదే పదే దాడులు చేసి, ఆయన నోరు మూయించాలని చూసినా..ఆయన వెనకంజ వేయకుండా వైకాపా నియంతృత్వంపై పోరాడారు. ఈ క్రమంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా వెళ్లారు. ప్రాణాలకు వెరవకుండా, పోలీసుతో వీపు వాయించుకునేలా ఆయన కొట్టించుకున్నారు. ఆయన నోరు మూయించడానికి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి చేయని ప్రయత్నం లేదు. అయినా..పట్టాభి వెనక్కుతగ్గకుండా, వెన్నుచూపకుండా పోరాడారు. టిడిపి అధికారంలోకి వస్తే..ఆయనకే మొట్టమొదటి నామినేటెడ్ పదవి దక్కుతుందని టిడిపి వర్గాలతో పాటు, రాజకీయవిశ్లేషకులు, ప్రతిపక్షపార్టీ నేతలూ అంచనా వేశారు. అయితే..అనూహ్యంగా పార్టీ ప్రకటించిన మొదటి నామినేటెడ్ లిస్టులో పట్టాభి పేరు లేదు. ఆయనకు మంచి ప్రాధాన్యత కలిగిన పోస్టు ఇస్తారని భావించిన వారికి, ఆ లిస్టులో ఆయన పేరు లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఎందుకు పట్టాభికి పోస్టు ఇవ్వలేదు..? ఆయన చేసిన నేరం ఏమిటని సామాన్య టిడిపి కార్యకర్తలు ప్రశ్నించుకుంటున్నారు. అప్పటి అధికారపక్షంపై వెన్నుచూపకుండా పోరాడిన పట్టాభిని ఎందుకు పక్కన పెట్టారనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. తండ్రీకొడుకులకు ఆయనను గుర్తించడం ఇష్టం లేకనా..లేక అంతుచిక్కని రహస్యాలు ఏమైనా ఉన్నాయా..? అనే సందేహాలు సామాన్య పార్టీ కార్యకర్తల్లో వస్తున్నాయి. కాగా వీరు కాకుండా మరి కొందరి నేతలు విషయంలో కూడా ఇవే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బ్రహ్మంచౌదరి: టిడిపి అధికారంలో ఉండగా బ్రహ్మంచౌదరి తిరుగులేని పోరాటం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై దాడికి వచ్చినప్పుడు ఆయనను ఎదిరించి తరిమికొట్టిన వారిలో బ్రహ్మంచౌదరి ప్రధముడు. అలానే పార్టీ వివిధ సందర్భాల్లో చేసిన అనేక ఆందోళనల్లోనూ..బ్రహ్మంచౌదరి ముందు వరుసలో ఉంటారు. అటువంటి బ్రహ్మంచౌదరిని కూడా పార్టీ మరిచిపోయినట్లుంది. వివిధ ఛానల్స్‌లో పార్టీ వాయిస్‌ను బ్రహ్మంచౌదరి గట్టిగా వినిపిస్తారు.
ఆనం రమణారెడ్డి: నెల్లూరుకు చెందిన ఆనం రమణారెడ్డి టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ, అధికారంలో ఉన్నప్పుడూ టిడిపి వ్యతిరేకులను చీల్చి చెండాడుతారు. జగన్‌పై, మాజీ మంత్రి రోజాపై ఆయన మాటలతో చేసే దాడులు అంతా ఇంతాకాదు. అటువంటి రమణారెడ్డిని కూడా పార్టీ ఎందుకో పట్టించుకోలేదు.
వెంకటరెడ్డి: కాంగ్రెస్ నుంచి వచ్చిన వెంకటరెడ్డికి మంచి వక్తగా పేరుంది. ఆయన గట్టి ఆధారాలతో ప్రతిపక్షాలను ప్రశ్నిస్తూ, టిడిపికి వాయిస్ ను గట్టిగా వినిపిస్తారు. తన తోటి కులస్థులందరూ వైకాపాలో ఉన్నా..చంద్రబాబుపై ఆరాధనతో ఆయన టిడిపిలో చేరారు. చేరిన దగ్గర నుంచి ఆయన పార్టీ వాయిస్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు.వీరే కాదు తెరవెనుక ఉండి టిడిపి గెలుపుకు పనిచేసిన సి.కుటుంబరావు, జర్నలిస్టు సత్యమూర్తి మరి కొందరిని పార్టీ ఎందుకో నామినేటెడ్ పోస్టుల భర్తీలో పరిగణలోకి తీసుకోలేదు. మహిళల్లో పార్టీ వాయిస్‌ను గట్టిగా వినిపించిన వారికి కూడా గుర్తింపు లభించలేదన్న విమర్శలు పార్టీలో గట్టిగానే వినిపిస్తున్నాయి. కాగా వీరంతా ఓసీలు అవడంతోనే అందరికీ ఒకేసారి పదవులు ఇవ్వలేదనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా కమ్మ సామాజికవర్గానికి చెందిన వారికి పదవులు ఇవ్వడం కష్టం అవుతుందని, కులాల లెక్కలు బేరీజువేసుకునే చంద్రబాబు వీరికి పదవుల విషయంలో ఆలస్యం చేస్తున్నారంటున్నారు.