WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'హమ్మయ్య...పాలకమండలి గడువు ముగిసింది'...!

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి గడువు ముగియటంతో అధికారవర్గాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఛైర్మన్‌ కార్యాలయంతో పాటు పలువురు సభ్యుల పేరుతో కొంత మంది చెలరేగిపోయి బ్రేక్‌ మరియు శ్రీవారి సేవా టిక్కెట్లను బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముకున్నట్లు విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఛైర్మన్‌ కార్యాలయ సిబ్బంది చేసిన సిఫార్సు టిక్కెట్లపై విచారణ జరపాలని స్థానిక టిడిపి నేతలు చంద్రబాబును కలసి ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా కొంత మంది బోర్డు సభ్యుల పేరుతో దళారులు రంగప్రవేశం చేసి వారి సిఫార్సులతో అనేక బ్రేక్‌, ఇతర దర్శనాల టిక్కెట్లను బ్లాక్‌లో అమ్మి లక్షలు గడించారు. ఇందులో కొందరిని టిటిడి విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నప్పటికీ ముఖ్యుల ఒత్తిడితో వదిలేయటం జరిగింది. 

  వీరి వ్యవహారం 'చంద్రబాబు'కు తెలిసినప్పటికీ వారిని పిలిచి మందలించడం కానీ...హెచ్చరించకపోవడంతో మరీ రెచ్చిపోయి బాహాటంగానే అమ్మకాలు ప్రారంభించారనే విమర్శలు వచ్చాయి. ఒక పాలకమండలి సభ్యుడు సేవా టిక్కెట్ల అమ్మేందుకు ఇద్దరిని జీతంపై నియమించుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో స్పష్టం అవుతుంది. ఆ పాలకమండలి సభ్యుడిని ప్రముఖ వ్యక్తి సిఫార్సు చేయటంతో మరీ రెచ్చిపోయారు. మీ కార్యాలయ సిబ్బంది టిక్కెట్లు అమ్ముకుంటున్నారని...నిన్నటి ఛైర్మన్‌ 'చదలవాడ కృష్ణమూర్తి' దృష్టికి తీసుకెళితే వారిపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు చివాట్లు పెట్టారట. ఛైర్మన్‌ కుటుంబ సభ్యులు కూడా సేవా టిక్కెట్లను ఎక్కువగా సిఫార్సు చేశారు. ఇందులో కొంత విమర్శ వచ్చినప్పటికీ అధికారులు కూడా చూసీ చూడనట్లు మౌనం వహించారు.ఈ వ్యవహారాలన్నీ టిటిడి ఇఒ సాంబశివరావుకు తెలుసు. కానీ ఏ నాడూ దానిపై స్పందించలేదు..కనీసం విచారణ కూడా చేయలేదు. స్వామి కార్యంతో పాటు స్వకార్యాలను కూడా జెఇఒ శ్రీనివాసరాజు నెరవేర్చుకున్నారు. 

  నీకు ఇంత...నాకు ఇంత చందంగా టిక్కెట్ల వ్యాపార లావాదేవీలు గత రెండు సంవత్సరాల నుంచి బాగానే నడిచాయి. తప్పు ఎవరు చేసినా చర్య తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించలేదు. అటువంటి వాటిని మీరు పట్టించుకోవద్దని ఇఒకు కూడా సలహా ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. దీంతో పాలకమండలి సభ్యులు మరింత రెచ్చిపోయి రెండేళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించి బాగానే వెనకేసుకున్నారు. ఏప్రిల్‌ 24తో పాలకమండలి కాలపరిమితి ముగియటంతో అధికారవర్గాలు ఊపిరి పీల్చుకోవడమే కాకుండా భవిష్యత్‌లో ఇటువంటి పాలకమండలి మళ్లీ రావద్దని కోరుకుంటున్నారు.

(277)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ