‘ద్వారంపూడి’ ఆత్మబంధుకు సివిల్ సప్లయ్ ఛైర్మన్ పోస్టా...!?
నిన్న కూటమి ప్రభుత్వం భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టుల విషయంలో కొన్ని అభ్యంతరాలు, అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి. కూటమిలోని అన్ని పార్టీలను సంతృప్తి పరుస్తూ చంద్రబాబునాయుడు కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తం చేశారు. అయితే..రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎంపిక చేసిన తోట సుధీర్ నియామకంపై జనసేనలోనూ, టిడిపిలోనూ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సుధీర్ కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడనే పేరు ఉందని, ఇప్పుడు సుధీర్ జనసేనలో ఉన్నా..ద్వారంపూడి గీసిన గీతను దాటడని, ఒకరకంగా చెప్పాలంటే ఆయన ద్వారంపూడికి ఆత్మబంధువు వంటివాడనే ప్రచారం నియోజకవర్గంలో జరుగుతోంది. వైకాపాలో సుధీర్ ఉన్నప్పుడు ఆయనను ద్వారంపూడి కాకినాడ టౌన్ బ్యాంక్‌కు వైస్ ఛైర్మన్ పదవిని ఇప్పించుకున్నారు. వారిద్దరి మధ్య విడదీయరాని బంధం ఉందనేది కాకినాడ మొత్తానికి తెలుసు. మరి ఈ విషయం తెలియకుండా..అత్యంత కీలకమైన పౌరసరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని సుధీర్‌కు ఎలా ఇచ్చారో..అన్న చర్చజరుగుతోంది. ఒకవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ద్వారంపూడి అక్రమ రైస్ వ్యాపారంపై తీవ్రస్థాయిలో దాడులు చేస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ద్వారంపూడి అక్రమాలకు దాదాపుగా చెక్‌పెట్టారు. ద్వారంపూడి అక్రమ రైస్ వ్యాపారాన్ని కట్టడిచేశారు. గతంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు కూడా ద్వారంపూడి అవినీతి, అక్రమసంపాదన అంతుచూస్తానని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తరువాత వారిద్దరూ అదేపని చేస్తున్నారు. అయితే..ఇప్పుడు సుధీర్‌ను పౌరసరఫరాలశాఖ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించడంతో..వారు ద్వారంపూడిపై చేస్తోన్న యుద్ధం సజావుగా సాగుతుందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమ రైస్ వ్యాపారానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన ద్వారంపూడిని కట్టడి చేయాలంటే..ఆయనకు సహకరించేవారు ఎవరూ ఈ శాఖలో ఉండకూడదు. అయితే..దానికి విరుద్ధంగా ఆయనకు సన్నిహితుడైన సుధీర్‌ను ఆ పోస్టులో నియమించి ప్రభుత్వం పొరపాటు చేసిందనే చర్చకు ఆస్కారమిచ్చింది.
పవన్‌కు తెలియకుండా జరిగిందా..!?
తోట సుధీర్ నియామకం జనసేన అధినేత, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌కు తెలిసి జరిగిందా..? తెలియకుండా జరిగిందా..? అనే చర్చ జనసేన, టిడిపిల్లో జరుగుతోంది. పవన్‌కు తెలిస్తే..ఈ నియామకం ఆగిపోయేదని జనసేన వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద..జనసేన అధిపతి, సేనాధిపతి ఇద్దరూ ద్వారంపూడి అవినీతి, అక్రమాలపై పోరాటం చేస్తుంటే..ద్వారంపూడికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తికి పదవి రావడం అటు రాజకీయవర్గాలతో పాటు, ఇతర వర్గాల్లో ఆశ్చర్యం కల్గిస్తోంది. ఈ నియామకం ద్వారా ద్వారంపూడిపై జనసేన యుద్ధం దాదాపు ఆగిపోయినట్లేనని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, అదేమీ లేదు..గతంలో వలే..జరుగుతుందని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.