WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆర్టీసీని లాభాలబాట పట్టిద్దాం...!

నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీని లాభాలబాటలో నడిపించేందుకు అధికారులందరూ రాత్రింభవళ్లు కష్టపడి పనిచేయాలని సంస్థ ఎండి మాలకొండయ్యనాయుడు ఇచ్చిన పిలుపుమేరకు గుంటూరు జిల్లాలో రీజినల్‌ మేనేజర్‌ జ్ఞానంగారి శ్రీహరి ఇటీవల వివిధ డిపోల మేనేజర్లుతో పాటు యూనియన్‌ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్టీసీని లాభాలబాటలో ఎలా నడిపించాలి. ఏయే రూట్లలో నష్టాలు వస్తున్నాయి...లాభాలు వచ్చే రూట్‌లలో బస్సులు ఎందుకు నడపడం లేదనే విషయంపై లోతుగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్నవారందరూ తమ అభిప్రాయాలను ముక్కుసూటిగా వాస్తవరూపంలో తెలపాలని శ్రీహరి తెలిపారు. తారతమ్య బేధాలు లేకుండా అధికారులు, యూనియన్‌ నాయకులు, ఉద్యోగులు కలసి పరిరక్షణ డ్యూటీ చేయాలని శ్రీహరి పిలుపునిచ్చారు. 

  ఆర్టీసీ సంస్థ చాలా దయనీయమైన స్థితిలో ఉందని, అక్రమవాహనాలు అయిన ఆటోలు, జీపులు ఇతర వాహనాల వల్ల గుంటూరు రీజియన్‌లో నెలకు తొమ్మిది కోట్లు సంవత్సరానికి 105కోట్లు నష్టపోతున్నామని శ్రీహరి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఓటీ సర్వీసులను డబుల్‌ డ్యూటీలుగా మార్చడం వల్ల ఆదాయం పెరగడమే కాకుండా సిబ్బంది అవసరం కూడా పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు రోజుకు 8గంటలు పనిచేయాలని, వివిధ మార్గాల్లో తిరుగుతున్న బస్సులకు కిలో మీటర్‌కు 35రూపాయలు ఖర్చు అవుతుందని, కానీ ఆదాయం రూ.20 మాత్రమే వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ దీనిని ముందుకు తీసుకెళ్లాలంటే ఏకాభిప్రాయంతో కలసిమెలసి పనిచేసినప్పుడు సాధ్యపడుతుందని ఆయన చెప్పారు. కాలాన్ని బట్టి మనం కూడా మారాల్సిన అవసరం ఉందని, సిబ్బందికి డిపో ఆదాయ, వ్యయాలపై ఆవగాహన ఉంటే ఆయా డిపోల నష్టాలు తగ్గుతాయని, తమలో ఉన్న నిర్లప్తతను వదలి కష్టపడి పనిచేయాలని ఆయన కోరారు. ఇప్పటికే ఆర్టీసీలో ప్రయాణిస్తే సురక్షితమని ప్రయాణీకులు నమ్ముతున్నారు..వారి నమ్మకాన్ని మరింత పెంచడానికి గ్రామ స్థాయి నుండి పట్టణస్థాయిలో ఉన్న ప్రజలకు అవగాహన కల్పించాలని శ్రీహరి పిలుపునిచ్చారు. 

  యాక్సిడెంట్‌ జరగడం వల్ల కొన్ని కోట్ల రూపాయలను ఆర్టీసీ చెల్లించాల్సి వస్తుందని, అటువంటి ప్రమాదాలు జరగకుండా తగురీతిలో వ్యవహరించాలని ఆయన కోరారు. ఇటీవల సంస్థలో ప్రవేశపెట్టిన కార్గో సర్వీసు గురించి ప్రయాణీకులకు, సంస్థలకు అవగాహన కల్పించాల్సిన అవసరం అందరిపై ఉందని దీనిపై దృష్టిసారించాలని ఆయన సూచించారు. సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు తమ వంతు కర్తవ్యాన్ని తప్పకుండా అందిస్తామని ఈ సమావేశంలో పాల్గొన్న యూనియన్‌ నాయకులు చెప్పారు. యూనియన్‌ ప్రవేశపెట్టిన అనేక సమస్యలపై ఆర్‌ఎం శ్రీహరి స్పందిస్తూ ఆ సమస్యల్లో కొన్నింటిని పరిష్కరిస్తానని, మిగతా సమస్యలను తరువాత పరిశీలిస్తానని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఎండీ మాలకొండయ్య ఇచ్చిన పిలుపుతో ముందుగా గుంటూరు జిల్లా రీజనల్‌ మేనేజర్‌ శ్రీహరి స్పందించి అధికార యూనియన్‌ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఆయా వివరాలను ఉన్నతాధికారులకు అందజేశారు.

(314)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ