సంతకం పెడితే...ఓకే..పెట్టకపోయినా..ఓకే...!?
తిరుమల లడ్డూ వివాదంలో వైకాపా కూరుకుపోయింది. వైకాపా అనే కంటే..ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ కూరుకుపోయారంటేనే బాగుంటుందేమో..! ఎందుకంటే.. అది ఒక పార్టీ కాదు..ఒక వ్యక్తితో నడుస్తోన్న పార్టీ. సరే..దాని సంగతి పక్కన పెడితే..జగన్ పాలనలో తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ కలుషితమైపోయిందని, ఆ లడ్డూలో పందికొవ్వు, ఆవు కొవ్వు కలిశాయని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ఆరోపించారు. ఆయన ఆరోపణలు నిజమేనని నిపుణులు తేల్చి చెప్పారు. అయితే..అదంతా చంద్రబాబు ఆడిస్తున్న నాటకమని, తిరుమల లడ్డూ తమ హయాంలో కల్తీ జరగలేదని, కల్తీ జరిగితే.అది చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాతేనని జగన్ ఆయన పార్టీ నేతలు వాదిస్తున్నారు. అయితే..వారి వాదనను ఎవరూ నమ్మడం లేదు. దేశ వ్యాప్తంగా జగన్‌పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందనేది జగమెరిగిన సత్యమని, గత ఐదేళ్ల జగన్‌పాలనలో తిరుమల లడ్డూ, ఇతర ప్రసాదాలు, అన్నదానం జరిగిన తీరు చూసిన భక్తులు ఇప్పుడు జగన్ అండ్ కో ఏమి చెప్పినా నమ్మడం లేదు. ముఖ్యంగా తిరుమల లడ్డూలో నాణ్యతలేదనేది ఆ పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తారు. దీంతో..జగన్ చెప్పేమాటలను ఎవరూ విశ్వసించడం లేదు. మరోవైపు అధికార కూటమి తిరుమల లడ్డూ వివాదంలో దూకుడుగా వెళుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. వేంకటేశ్వరస్వామికి జరిగిన అపరాధానికి శిక్షగా పవన్ కళ్యాణ్ దీక్షను చేపట్టారు.
ఈ నేపథ్యంలో తాము ఎంత సమర్ధించుకో చూసినా..ప్రజలు నమ్మడం లేదని, వారిని నమ్మించడానికి జగన్ 28వ తేదీన తిరుమలకు వెళతామని ప్రకటించారు. చంద్రబాబు అండ్ కో రాజకీయాలు చేస్తున్నారని దీనికి విరుగుడుగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో వైకాపా నాయకులు పూజలు చేస్తామని ప్రకటించారు. ఇంత వరకూ బాగుంది. అయితే..ఇప్పుడు వైకాపా ఈ పూజల పేరుతో చేద్దామనుకున్న రాజకీయం వారికే తిప్పికొట్టే ప్రమాదం పొంచింది. శనివారం జగన్ తిరుమలకు వెళ్లి పూజలు చేస్తారని వైకాపా ప్రకటించింది. అయితే..ఆయన కనుక తిరుమల వెళ్ళి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలంటో..అన్యమతస్థుడైన జగన్ వేంకటేశ్వరస్వామి పట్ల విశ్వాసం ఉందని ఆలయంలో సంతకం చేయాల్సి ఉంటుంది. గతంలోనే ఈ విషయంలో జగన్‌పై హిందువులు మండిపడుతున్నారు. తమ విశ్వాసాలను దెబ్బతీశారని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిందువుల విశ్వాసాలను పట్టించుకోలేదని, సంతకం చేయకుండా ఆలయంలోకి ప్రవేశించారని అప్పట్లో వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే..అప్పట్లో ఆయన ముఖ్యమంత్రి కనుక, అదీ అపరమిత అధికారం చెలాయిస్తున్నారు కనుక ఎవరినీ లెక్కచేయకుండా పవిత్రమైన వేంకటేశ్వరస్వామి ఆలయంలోకి విశ్వాస సంతకం చేయకుండా తన మందీ మార్భలంతో వెళ్లారు. మరి ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయన తిరుమలకు వెళితే ఆలయ నిబంధనల ప్రకారం అన్యమతస్థుడైన జగన్ తప్పకుండా సంతకం చేయాల్సి ఉంటుంది. ఒక వేళ సంతకం చేయకుండా కనుక ఆయన వెళితే..ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాన్ని జగన్ నిజం చేసినట్లే. ఆయనకు వేంకటేశ్వరస్వామి అంటే లెక్కలేదని, ఆయనపై జగన్‌కు విశ్వాసం లేదని తేటతెల్లమవుతోంది. ఆయన కనుక సంతకం చేయకపోతే..రాష్ట్రంలో ఉన్న హిందువులందరూ కులాలకు అతీతంగా జగన్‌కు దూరం అవుతారు. అదే సమయంలో ఆయన వేంకటేశ్వరస్వామి పట్ల విశ్వాసం ఉందని ప్రకటిస్తే..ఆయన మతమైన క్రిస్టియన్స్ ఆయనపై తిరుగుబాటు వైఖరి తీసుకునే అవకాశం ఉంది. క్రిస్టియన్స్ తమకు దేవుడు ఒక్కడేనని, అతను జీసస్ మాత్రమేనని నమ్ముతారు. ఇప్పుడు కనుక జగన్ వేంకటేశ్వరునిపై విశ్వాసం ఉందని సంతకం చేస్తే..ఆయనకు మొదటికే మోసం వస్తుంది. మొత్తం మీద ఆయన పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క చందం అయినట్లు కనిపిస్తోంది.
తాజా కలం: ఈ బాధల నుంచి తప్పించుకోవడానికి తనకు అనుకూలమైన హిందూ సంఘాలతో ఆయనే తన పర్యటను అడ్డుకునే బాధ్యతలను అప్పగించినట్లు ప్రచారం సాగుతోంది. ఆయనను అడ్డుకుంటామని ఇప్పటికే పలు హిందూ సంఘాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు తనను అడ్డుకున్నాయి కనుక పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ఆయన ప్రకటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.