WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నారాయణ'కు చెక్‌ పెట్టిన 'సోమిరెడ్డి'...!

నెల్లూరు జిల్లాలో రెండున్నర సంవత్సరాలుపైగా అధికారం చెలాయించిన మున్సిపల్‌మంత్రి నారాయణ దూకుడు పూర్తిగా తగ్గింది. ఆ జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో నిన్నటి వరకు 'నారాయణ' చుట్టూ తిరిగిన అధికార, రాజకీయ యంత్రాంగం మొత్తం 'సోమిరెడ్డి'ని ఆశ్రయిస్తోంది. ఏకపక్షంగా, ఒంటెత్తు పోకడలతో, నియతృంత్వధోరణతో అధికార వ్యవస్థకు కనీస మర్యాద ఇవ్వకుండా అధికారం చెలాయించిన నారాయణకు 'చంద్రబాబే' ఒక పథకం ప్రకారం చెక్‌ పెట్టారని మాజీ మంత్రి ఒకరు మీడియాతో వ్యాఖ్యానించారు. నెల్లూరులో గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గ పోటీకి తన దగ్గర బంధువుకు టిక్కెట్‌ ఇప్పించి గెలిపించుకోలేకపోయిన 'నారాయణ'పై 'చంద్రబాబు' ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో కేవలం మూడు వేల ఓట్ల మెజార్టీతో 'జగన్‌' పార్టీ అభ్యర్థి విజయం సాధించగా, సుమారు 20వేల ఓట్లు చెల్లకుండా పోయాయి. అటు 'జగన్‌' పార్టీకి ఓటు వేయటం ఇష్టం లేక..ఇటు 'నారాయణ' నిలబెట్టిన అభ్యర్థికి ఓటు వేయటం ఇష్టం లేక వారంతా తమ ఓటును చెల్లకుండా చేసుకున్నారు. అంతే కాకుండా బ్యాలెట్‌ పేపర్‌పై 'నారాయణ'కు, నారాయణ నిలబెట్టిన అభ్యర్థికి వ్యతిరేకంగా నినాదాలు రాసి సంచలనం సృష్టించారు. 

   ఈ విషయం తెలుసుకున్న 'చంద్రబాబు' పార్టీపై వ్యతిరేకత లేదని, కేవలం 'నారాయణ'పై వ్యతిరేకతతోనే టిడిపి అభ్యర్థి ఓడిపోయారని ఆయనకు అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది. ఇప్పుడు 'సోమిరెడ్డి'కి మంత్రి పదవి ఇవ్వటంతో 'నారాయణ' దూకుడుకు కళ్లెంపడింది. జిల్లా రాజకీయాలను పట్టించుకోవద్దని మంత్రి నారాయణకు చంద్రబాబు హెచ్చరిక రూపంలో తెలియజేశారు. దీంతో ఖంగుతిన్న 'నారాయణ' ...నిన్నటి వరకు ఏ యంత్రాంగాన్ని అయితే లెక్కచేయలేదో..అదే యంత్రాంగానికి చెందిన వ్యక్తులను పిలిపించుకున్నప్పటికీ ఏ ఒక్కరూ ఆయనతో మాట్లాడేందుకు అంగీకరించటం లేదు. విషయం తెలుసుకున్న 'సోమిరెడ్డి' జిల్లాస్థాయి అధికారులను పిలిపించుకుని తాను అండగా ఉండానని, అధైర్యపడవద్దని, సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని చెప్పారట. ఈ విషయం తెలుసుకున్న 'నారాయణ' 'చంద్రబాబు'కు ఫిర్యాదు చేయడానికి ధైర్యం చాలక...లోకేష్‌బాబుకు చెప్పి మొరపెట్టుకున్నారట. ఆయన కూడా చూద్దాంలే... అని తేలిగ్గా తీసుకున్నారట. ఇక జిల్లాలో అడుగుపెట్టడం కన్నా...తన శాఖకే పరిమితం అయ్యేందుకే 'నారాయణ' నిశ్చయించుకున్నారట.





(560)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ