WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బలం పెంచుకున్న 'బొత్స'...!

విజయనగరం జిల్లాలో పదేళ్లపాటు ఏకపక్షంగా అధికారం చెలాయించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హవాకు 2014 ఎన్నికల్లో ఓటర్లు చెక్‌ పెట్టారు. తూర్పు కాపు కులానికి చెందిన ఆ సామాజికవర్గాన్ని అనుకూలంగా మలచుకోవడంలో విఫలమై కేవలం బంధు,మిత్రులకు పనులు చక్కపెట్టి ఆ వర్గానికి దూరమయ్యారు. ఆ ప్రభావమే ఎన్నికల్లో అనామకురాలైన 'కిమిడి మృణాళిని' చేతిలో ఓడిపోవడానికి కారణమైంది. దీంతో రాజకీయంగా, అధికారికంగా మళ్లీ ముందుకెళ్లే అవకాశం తాజా పరిణామాలు కల్పించాయి. బొత్సపై ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన సామాజికవర్గానికి చెందిన 'మృణాళిని'ని మంత్రి పదవి తప్పించి, బొబ్బిలి రాజవంశం, వెలమ కులానికి చెందిన 'సుజయ రంగారావు'కు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. 

  మూడేళ్ల నుంచి కేంద్ర మంత్రిగా అశోక్‌గజపతిరాజు పెత్తనం చెలాయిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఇద్దరు మంత్రులు అగ్రకులానికి చెందిన వారే కావడంతో తూర్పుకాపు కులస్తులు ఈ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే 'బొత్స' తన పాచికలను విసురుతున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి ఒకసారి మాత్రమే ఓడిపోయిన ఎమ్మెల్యే పి.నారాయణస్వామినాయుడుకు మంత్రి పదవి ఇస్తారని తూర్పుకాపులు భావించారు. కానీ 'చంద్రబాబు' 'రంగారావు' వైపు మొగ్గుచూపడంతో ఆ వర్గ ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీ నియోజకవర్గాల్లో గెలుపు ప్రభావం ఆ ఓటర్ల మద్దతుతోనే ఉంటుందని 'చంద్రబాబు'కు తెలుసు. కానీ మంత్రి మృణాళిని తొలగించే ముందు అదే సామాజికవర్గాన్ని దృష్టిలో పెట్టుకోలేదు. దీంతో కొంత మంది నాయకులు, ఎమ్మెల్యేలు ఇటీవల 'చంద్రబాబు'ను కలసి విజయనగరం జిల్లాలో బీసీ సామాజికవర్గ ఓటర్లు తొంభైశాతానికి పైగా ఉన్నారు..అందులో తూర్పుకాపుల ప్రభావం ఎక్కువగా ఉంది...మీరు ఈ విధంగా ఇద్దరు అగ్రకులానికి చెందిన నాయకులకే పదవులు ఇస్తే తామేమి సమాధానం చెప్పాలని, ఈ పరిణామం భవిష్యత్‌ ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం ఉంది..అని చెప్పారట. 

  దీనికి 'బాబు' స్పందిస్తూ జరిగిందేదే జరిగింది...మంత్రి రంగారావుకు సంపూర్ణమద్దతు ఇవ్వండి...కొద్దికాలం తరువాత దీన్ని సరి చేద్దామని చెప్పారట. మంత్రివర్గ విస్తరణ చేయడానికే ఆరు నెలలు సమయం తీసుకున్న 'చంద్రబాబు' దీనిపై ఆయన ఎప్పుడు స్పందిస్తారని ప్రశ్నిస్తున్నారట. దీంతో తూర్పుకాపు ఓటర్లతో పాటు నాయకులు కూడా కొందరు 'బొత్స' వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని టిడిపినాయకులు ఆందోళన చెందుతున్నారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో అగ్రకులాలకు చెందిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం ఏమిటి...? ఈ పరిణామాలు పార్టీకి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు 'బొత్స' రంగంలోకి దిగారు. కానీ...ఆయనకు 'జగన్‌' పూర్తి స్వేచ్ఛ ఇచ్చే అవకాశం లేకపోవడంతో పరిస్థితిలో ఇప్పుడు పెద్దగా మారదని, ఒక వేళ 'జగన్‌' బొత్సకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే 2014 ఎన్నికల ఫలితాలు తారుమారు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు.

(677)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ