లేటెస్ట్

'బిజెపి'లోకి 'నాదెండ్ల భాస్కర్‌రావు'...!

'అన్న ఎన్టీఆర్‌'కు వెన్నుపోటు పొడిచి...ప్రజా ఛీత్కారంతో క్రియాశీలక రాజకీయలకు దూరమైన మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు త్వరలో బిజెపిలో చేరుతున్నారట. తెలుగు రాష్ట్రాల్లో 'అమిత్‌షా' పర్యటన సందర్భంగా ఆయన 'బిజెపి' తీర్థం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు.. పార్టీలో నెంబర్‌ టూగా ఉన్న 'నాదెండ్ల భాస్కర్‌రావు' పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత...ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నారు. అయితే రాష్ట్ర ప్రజల అపూర్వపోరాటంతో...మళ్లీ ఎన్టీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి దక్కింది. తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన 'నాదెండ్ల' తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యారు. తాను క్రియాశీలక రాజకీయాలకు దూరం అయినా...తన తనయుడు 'నాదెండ్ల మనోహర్‌'ను కాంగ్రెస్‌ తరుపున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. 2004,2009 ఎన్నికల్లో 'నాదెండ్ల మనోహర్‌' కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచి స్పీకర్‌గా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన మొన్న ఎన్నికలకు ముందు 'జనసేన' పార్టీలో చేరి మళ్లీ పోటీచేసి ఓడిపోయారు. దీంతో ఆయన 'జనసేన'లో కొనసాగుతారా..? లేక తండ్రితో పాటు 'బిజెపి'లో చేరతారా..? అనే దానిపై చర్చలు సాగుతున్నాయి. దాదాపు 25ఏళ్లకు పైగా క్రియాశీలిక రాజకీయాలకు దూరంగా ఉన్న 'నాదెండ్ల భాస్కర్‌రావు'ను బిజెపి ఎందుకు చేర్చుకుంటుందో ఎవరికీ అర్థం కావడం లేదు. వృద్ధాప్యంలో ఉన్న 'నాదెండ్ల' వల్ల ఒరిగేదేమిటో...? ఆంధ్రాకు అన్యాయం చేసి మొన్నటి ఎన్నికల్లో మట్టికొట్టుకుపోయిన 'బిజెపి' ఇటువంటి నాయకులతో బలోపేతం అవ్వాలనుకుంటే అయ్యేపనేనా..? అంటూ రాజకీయపరిశీలకులు ఎద్దేవా చేస్తున్నారు. 

(295)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ