లేటెస్ట్

డైలమాలో 'పత్తిపాటి'....!

మాజీ మంత్రి 'పత్తిపాటి పుల్లారావు' టిడిపిని వీడాలా...? లేక కొనసాగాలా..? అనే డైలామాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత...ఆయన బిజెపిలో చేరతారని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీన్ని మాజీ మంత్రి 'పత్తిపాటి' పలుసార్లు ఖండించినా..ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఆయన టిడిపిలో ఉండలేరని, బిజెపిలో చేరతారని జిల్లాకు చెందిన నాయకులు చెబుతున్నారు. 'పత్తిపాటి'కి మంత్రి పదవి ఇప్పించిన 'గరికపాటి రామ్మోహన్‌రావు' 'బిజెపి'లో చేరడంతో...ఇక పత్తిపాటి కూడా బిజెపి గూటికి త్వరలో చేరతారని, ఆయన చేరిక లాంఛనమేనని టిడిపి నాయకులు ఆఫ్‌ ది రికార్డుగా చెప్పారు. 

'గరికపాటే' కాకుండా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు 'కన్నా లక్ష్మీనారాయణ'తో 'పత్తిపాటి'కి ఉన్న వ్యాపార సంబంధాలు ఉన్నాయి. తన మిత్రుడు బిజెపిలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడం, ఢిల్లీలో 'గరికపాటి' ఉండడంతో...తాను బిజెపిలో చేరితే తనకు మేలు జరుగుతుందనే భావనతో...'పత్తిపాటి' మొదట పార్టీ మారాలనే ఆలోచన చేశారు. తాను మొదట బిజెపిలో చేరితే...రాబోయే నాలుగేళ్లల్లో బిజెపి తనకు ప్రయార్టీ ఇస్తుందన్న ఆలోచన, వచ్చే ప్రభుత్వంలో నెంబర్‌ టూగా ఉండాలనే భావనతో ఆయన బిజెపి వైపు వేగంగా అడుగులు వేయాలని భావించారు. అయితే...ప్రస్తుతం బిజెపిలో చేరితే లాభమే కానీ...తన నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు, తన సామాజికవర్గం బిజెపి వెనుక రాదని, వారిని కాదని బిజెపిలోకి వెళితే మొదటికే మోసం వస్తుందన్న ఆలోచన 'పత్తిపాటి'లో ఉందట. అంతే కాకుండా...నియోజకవర్గంలో తాను ఓడిపోయినా... టిడిపి కార్యకర్తలు, సానుభూతిపరులు..మళ్లీ టిడిపిని గెలిపించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. తాను పార్టీ మారితే వేరే వారితో పార్టీ  మళ్లీ బలపడుతుందని, వచ్చే మూడేళ్లల్లో ఎన్నికలు ఎప్పుడు జరిగినా..మళ్లీ ఇక్కడ టిడిపి జెండా ఎగరడం ఖాయమనే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుండడంతో...పార్టీ మారితే రాజకీయ భవిష్యత్‌ ఏమవుతుందో తెలియని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారట. మొత్తం మీద...ఇప్పటికిప్పుడు 'పత్తిపాటి' నిర్ణయం తీసుకోరని, మరి కొన్ని రోజులు ఆలోచిస్తారని ఆయన సన్నిహితులు అంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు పార్టీని మళ్లీ గెలిపించాలని, దాని కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉండడం...'పత్తిపాటి'ని పునరాలోచనలోకి తెచ్చిందంటున్నారు. చూద్దాం..మరి ఏమి జరుగుతుందో..!?

(400)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ