లేటెస్ట్

చర్చలతో 'కెసిఆర్‌' విద్యుత్‌ బాకీలను చెల్లిస్తారా...!?

తెలంగాణ నుంచి ఆంధ్రాకు రావాల్సిన విద్యుత్‌ బకాయిలను చర్చల ద్వారా తమలో తామే పరిష్కరించుకుంటామని చెబుతూ 'జగన్‌' ప్రభుత్వం ఎన్‌ఎల్‌బిటిలో గత ప్రభుత్వం వేసిన కేసును ఉపసంహరించుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తరువాత...ఆంధ్రా విద్యుత్‌ను తెలంగాణ వాడుకుంది. దీని కింద ఆ రాష్ట్రం ఆంధ్రాకు దాదాపు రూ.5732కోట్లు బాకీ పడ్డారు. తెలంగాణ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌-దక్షిణం రూ.4044కోట్లు, తెలంగాణ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌-ఉత్తర రూ.1688కోట్లు ఆంధ్రాకు బాకీ పడ్డారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఈ బాకీ తీర్చాలని తెలంగాణ ప్రభుత్వంపై ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా చెల్లించకుండా మొండికేశారు. దీంతో 'చంద్రబాబు' ప్రభుత్వం నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసు దాఖలు చేసింది. అప్పటి నుంచి ఈ విషయంపై విచారణ జరుగుతోంది. తాజాగా...ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగా..ఇరు రాష్ట్రాల మధ్య సోదరభావంతో పరస్పరం సహకరించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాధినేతలు భావించారు. దానిలో భాగంగా పలు అంశాలపై ఇప్పటికే చర్చలు జరిపారు. 

నదీ జలాల విషయంలో కానీ, ఉద్యోగుల విషయంలో కానీ, ఇతర ఆర్థిక విషయాలో కానీ చర్చలు జరిపి పరిష్కరించు కోవాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా ఆంధ్రాకు రావాల్సిన విద్యుత్‌ బాకీలపై నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఉన్న కేసును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పరస్పర సహకారంతో సమస్యలు పరిష్కరించుకుంటే ఇరు రాష్ట్ర ప్రజలకూ మంచిదే. కానీ...'కెసిఆర్‌'తో వ్యవహారం అంత ఆషామాషీ కాదు. తనకు అనుకూలమైన వాటిపై చక చకా నిర్ణయాలు తీసుకుంటూ...తనను ఇబ్బంది పెట్టేవాటిపై మాత్రం పక్కన పెడుతూ వ్యవహారాలు సాగిస్తారు. గతంలో 'చంద్రబాబు' ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విద్యుత్‌ బకాయిలపై మాట్లాడుతూ..ఆంధ్రానే తమకు బాకీ పడిందని అడ్డగోలుగా వాదించారు. తాము ఆంధ్రాకు రూపాయి కూడా చెల్లించేది లేదని, అవసరమైతే వేరే రాష్ట్రాల నుంచి విద్యుత్‌ కోనుగోలు చేసుకుంటామని తేల్చి చెప్పారు. దీంతో..ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణకు విద్యుత్‌ సరఫరా నిలిపివేసింది. అయినా కెసిఆర్‌ ఖాతరు చేయకపోవడంతో..ఆంధ్రప్రదేశ్‌ ఎన్‌ఎల్‌బిటిని ఆశ్రయించి తమకు రావాల్సిన రూ.5732కోట్లు ఇప్పించాలని కేసు దాఖలు చేసింది. ప్రస్తుత వైకాపా ప్రభుత్వం ఆ కేసును ఉపసంసరించుకోవడంతో...ఆ సొమ్ములను చర్చల ద్వారా కెసిఆర్‌ ప్రభుత్వం చెల్లిస్తుందా..? కేసు ఉంటేనే పట్టించుకోని కెసిఆర్‌ ఇప్పుడు కేసును ఉపసంహ రించుకుంటే సొమ్ములు ఇస్తారా..? చర్చల ద్వారా కెసిఆర్‌ను లంగదీసి ఆంధ్రాకు రావాల్సిన సొమ్ములను 'జగన్‌' ప్రభుత్వం తేగలుగుతుందా..? మహాముదురు అయిన కెసిఆర్‌ను చర్చల ద్వారా ఒప్పించి రూ.5732కోట్లు 'జగన్‌' సాధిస్తే...ఆంధ్రాలో 'జగన్‌' ప్రభ మరింత పెరగడం ఖాయం. మరి చూద్దాం ఏమి జరుగుతుందో..!?

(271)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ