WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బంగారు తెలంగాణలో రైతులకు సంకెళ్లు...!

మిర్చి ధరకు సరైన రేటు రావడం లేదనే ఆగ్రహంతో మొన్నామధ్య ఖమ్మం మిర్చియార్డుపై రైతులు దాడి చేసిన విషయం తెలిసిందే కదా...! దీనిపై తెలంగాణ పోలీసులు పలువురు రైతులపై కేసులు నమోదు చేశారు. మొదట మార్కెట్‌యార్డుపై దాడి చేసింది రైతులు కాదని...వారంతా గూండాలన్న తెలంగాణ ప్రభుత్వం చివరకు రైతులపైనే కేసులు నమోదు చేసింది. కేసులు నమోదు తరువాత ఇప్పుడు వారినందరినీ అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరుస్తోంది. అయితే కేసులు పెట్టడం, కోర్టులో హాజరు పరచడం పోలీసులు విధి అయినా...రైతుల చేతులకు సంకెళ్లు వేయటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రైతులు దోపిడీదారులా...? లేక ఉగ్రవాదులా...? లేక హంతకులా...? లేక రేపిస్టులా...? నలుగురికి అన్నం పెట్టే రైతు చేతికి సంకెళ్లు వేస్తారా...? ఇదేనా బంగారు తెలంగాణ అంటూ రైతు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులకు, నేరాలే జీవితంగా గడిపేవారికి, పారిపోయే అవకాశం ఉన్నవారికి మాత్రమే సంకెళ్లు వేయాలని, సాధారణ నేరస్తులకు, రిమాండ్‌ ఖైదీలకు సంకెళ్లు వేయవద్దని సుప్రీంకోర్టు, ఇతర మానవ హక్కుల సంఘాళ్లు పలుసార్లు చెప్పినా తెలంగాణ పోలీసులు మాత్రం వాటిని చెవికెక్కించుకోకుండా అన్నం పెట్టేరైతు చేతికి సంకెళ్లు తగిలించారు.

   కాగా ఈ వ్యవహారంపై తెలంగాణ రైతాంగం, ఇతర సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆరుగాలం కష్టించి పనిచేసి నలుగురికి అన్నం పెట్టేరైతన్నకు సంకెళ్లు వేయటం సరికాదని, ఇప్పటికైనా వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుని వారిని విడుదల చేయాలని వారు కోరుతున్నారు. రైతులను విడుదల చేయకపోతే తామంతా జైలు బయటే దీక్ష చేస్తామని హెచ్చరిస్తున్నారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది రైతులకు సంకెళ్లు వేయడానికా...? అని ప్రశ్నిస్తున్నారు.


(412)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ