Accreditation Committeeల్లోకి జర్నలిస్టు సంఘాల ప్రతినిధులను తీసుకోవాలి...!
గత వైకాపా ప్రభుత్వం అన్ని వ్యవస్థలను గెలికి గెలికి అస్తవ్యస్థం చేసి,నాశనం చేసేసింది. అన్ని వ్యవస్థలతో పాటు జర్నలిస్టుల వ్యవస్థను కూడా పలురకాలుగా వేధించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే కేసులు పెట్టడం, బెదిరించడం, యాడ్స్ ఇవ్వకుండా చేయడం, కక్షపూరిత చర్యలకు పాల్పడడం..ఇలా ఒకటేమిటి..అనేక రకాలుగా వేధించింది. చివరకు జర్నలిస్టులకు ఇచ్చే Accreditationలపై కూడా నానా యాగీ చేసింది. ఐదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా సమయానికి జర్నలిస్టులకు Accreditationలు ఇవ్వలేదు. అదే విధంగా హెల్త్‌కార్డుల విషయంలోనూ అన్యాయంగా వ్యవహరించింది. దానితో పాటు కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.5లక్షల ఆర్థిక సహాయం చేస్తామని, ఆర్భాటంగా ప్రకటనలు చేసి, జీవో విడుదల చేసి చివరకు తూచ్ అన్నారు. ఇక ఇళ్లస్థలాల గురించి చెప్పేదే లేదు. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి మరో రెండు నెలలు మాత్రమేసమయం ఉన్న పరిస్థితుల్లో జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇస్తున్నామని ఒకటే హడావుడి చేశారు. చివరకు అదీ తుస్సుమంది. ఇలా ఒకటేమిటి..అన్ని విషయాల్లోనూ జగన్ ప్రభుత్వం జర్నలిస్టులకు అన్యాయమే చేసింది. జర్నలిస్టుల Accreditation విషయంలో నానా వేధింపులకు గురిచేసింది. తమకు నచ్చినవారికి, తమకు కావాల్సిన వారికి ఇష్టారాజ్యంగా Accreditationలు మంజూరు చేసింది. అదే విధంగా జర్నలిస్టుల Accreditation Committeeల్లోకి జర్నలిస్టు సంఘాలను తీసుకోకుండా వారికి ఇష్టమైన వారికి, వారికి గులాంగిరీ చేసేవారికి కమిటీల్లో స్థానం కల్పించింది. అనాదిగా ఉన్న సంప్రదాయాన్ని పాటించకుండా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులను Accreditation Committeeల్లోకి తీసుకోకుండా కొత్త పద్దతులను ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రాబోయే రెండు మూడు నెలల్లో Accreditation ఇవ్వాల్సి ఉన్నందున ఈసారి Accreditation Committeeల్లోకి జర్నలిస్టు సంఘాల ప్రతినిధులను నియమించాలి. ఎప్పటి నుంచో ఉన్న ఈ పద్దతిని ప్రభుత్వం పాటిస్తే..జర్నలిస్టులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అధికారులతో కూడిన కమిటీల వల్ల ఉపయోగం లేదని గత ప్రభుత్వ నిర్వాకంతో తేలిపోయింది. గతంలో ఉన్న విధానాన్నే ఈసారి కొనసాగిస్తే ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యాలు లేకుండా అర్హులైన జర్నలిస్టులకు Accreditationలు మంజూరు అవుతాయి. దీనిపై రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పార్థసారధి, రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్, ఇతర ఉన్నతాధికారుల దృష్టిసారించాలి.