లేటెస్ట్

బిజెపి బుట్టలో 'పవన్‌' పడతారా..!?

అమెరికాలో జరుగుతున్న 'తానా' సభల్లో 'జనసేన' అధ్యక్షుడు 'పవన్‌కళ్యాణ్‌', బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి 'రామ్‌మాధవ్‌' కలిశారని,వారి మధ్య రాజకీయాల గురించి చర్చ జరిగిందని, 'పవన్‌'ను బిజెపిలోకి తీసుకెళ్లేందుకు 'రామ్‌మాధవ్‌' ఆయనను కలిశారని వార్తలు వస్తున్నాయి. వారిద్దరూ దీనిపైనే చర్చించారని, త్వరలోనే 'పవన్‌' 'బిజెపి'లో చేరతారనే వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిడిపి, జనసేన ఘోరంగా ఓడిపోవడంతో...కొన్నాళ్లుగా రాజకీయాలపై 'పవన్‌' ఆచితూచి మాట్లాడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన రెండు చోట్లపోటీ చేస్తే...రెండు చోట్లా ఓడిపోయారు. అయితే దీనిపై ఆయన స్పందిస్తూ..తాను ఓడిపోయినా...రాజకీయాలను వదలనని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటానని చెబుతున్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని, వచ్చే ఐదేళ్లుమరింత కష్టపడతామని నొక్కి చెప్పారు. ఈ నేపథ్యంలో 'రామ్‌మాధవ్‌'ను 'అమెరికా'లో ఆయన కలవడంతో..పలు రకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. 

మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన 'జనసేన' ఒంటరిగా రాష్ట్రంలో అధికారంలోకి రాలేదని, 'బిజెపి'తో కలిసి వస్తేనే అది సాధ్యం అవుతుందని 'రామ్‌మాధవ్‌' చెప్పారని ప్రచారం జరుగుతుంది. దీనికి 'పవన్‌' స్పందిస్తూ...రాష్ట్రానికి బిజెపి మేలు చేస్తే కలిసి వస్తానని, ప్రత్యేకహోదా, పోలవరం, రాజధాని నిర్మాణానికి సహకరిస్తే...బిజెపితో కలిసి వస్తానని హామీ ఇచ్చినట్లు అక్కడి వర్గాల ద్వారా తెలుస్తోంది. కలిసి రావడం అంటే 'జనసేన'ను కలిపేయడమా..? లేక..బిజెపితో పొత్తు పెట్టుకోవడమా..? అనే దానిపై స్పష్టత రాలేదంటున్నారు. ఇది మొదటి సమావేశమని, ఇటువంటి సమావేశాలు మరిన్ని జరుగుతాయని, 'పవన్‌' బిజెపి వైపు రావడమో...లేక..పార్టీని విలీనం చేయడమో చేస్తే...ఇక్కడ బిజెపి వేగంగా ఎదుగుతుందన్న ఆలోచనతో బిజెపి పెద్దలు ఉన్నారని, అందుకే ముందుగా నిర్ణయించుకున్న ప్రకారమే 'రామ్‌మాధవ్‌' అమెరికా వెళ్లి 'పవన్‌'తో చర్చించారని కొన్ని వర్గాలు అంటున్నాయి. 'కాపు' సామాజికవర్గ యూత్‌లో 'పవన్‌'కు మంచి పట్టుఉంది. దీంతో..'పవన్‌'ను మంచి చేసుకుంటే...ఆ ఓట్లు తనవైపు వస్తాయనే ఆలోచనతోనే..బిజెపి 'పవన్‌'ను దువ్వుతుందని, వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తుందంటున్నారు. రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేసిందని, పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని మొన్నటి వరకు ఆరోపించిన 'పవన్‌' అంత తేలిగ్గా బిజెపి వలలో పడతారా..? అంటే చెప్పడం కష్టమే. మొత్తం మీద వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బిజెపి జెండా ఎగురవేయడమే లక్ష్యంగా 'బిజెపి' పెద్దలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారు. మరి వారి ప్రయత్నాలు ఎంత వరకు విజయం సాధిస్తాయో చూడాలి. 

(525)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ