WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రజనీ,హరీష్‌,జగన్‌లతో బిజెపి జట్టు...!

రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి దక్షిణాదిపై పట్టుసాధించడానికి బిజెపి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాల్లో బలోపేతం అయిన ఆ పార్టీ ఇప్పుడు తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లపై గురిపెట్టింది. దీనిలో భాగంగా ఆయా రాష్ట్రాల్లో బలపడడానికి ప్రాంతీయపార్టీలో బలమైన నేతలను ఆకర్షిస్తోంది. పలువురు మాజీమంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్న బిజెపి ఇప్పుడు తమిళనాడులో బలమైన శక్తిగా ఉన్న 'రజనీకాంత్‌'కు వలవేసింది. రాజకీయాలు అంటే తనకు ఇష్టం లేదని కొంత కాలంగా చెబుతున్న 'రజనీ' తాజాగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న తన అభిమానులను కలసుకుంటూ వారి మనోభావాలు తెలుసుకుంటున్నారు. అంతే కాకుండా 'దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తాను'...అంటూ చెబుతున్నారు. అయితే ఇదంతా బిజెపి పెద్దలు ఆడిస్తున్న నాటకంలో భాగమేనని, ఆయన త్వరలో రాజకీయాల్లోకి రావడం ఖాయమని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. 'దేవుడు ఆదిశిస్తే కాదు...'మోడీ' ఆదేశిస్తే ఆయన వస్తారు...అంటూ జోకులు పేలుతున్నాయి.

    దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత తమిళరాజకీయాలన్నీ ఢిల్లీ పెద్దల కనుసైగల్లో నడుస్తున్నాయి. దానిలో భాగంగానే 'జయ' మిత్రురాలు 'శశికళ' వ్యవహారం తదనంతరం ఇప్పుడు 'రజనీ' వ్యవహారమని ఆయా వర్గాలు అంటున్నాయి. 'జయ' మృతి తరువాత 'శశికళ' అన్నాడిఎంకెను బిజెపిలో కలపడానికి నిరాకరించడంతో బిజెపి పెద్దలు ఆమెకు చుక్కలు చూపించారు. ఆమె జైలుకు వెళ్లిన తరువాత అన్నాడిఎంకెను పూర్తిగా తమ ఆదీనంలోకి తీసుకున్న బిజెపి పెద్దలు 'రజనీ' ద్వారా తరువాత నాటకాన్ని రక్తికట్టించబోతున్నారు. 'రజనీ' బిజెపిలో చేర్చుకుని రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించబోతున్నారు. 'రజనీ'కి ఉన్న అభిమానగణంతో ఆయన సులువుగా బిజెపిని గెలిపించగలరని వారు నమ్ముతున్నారు. ఒక వైపు అన్నాడిఎంకె చిన్నాభిన్నం అవడం, మరో వైపు డిఎంకె కుటుంబ తగాదాలతో భ్రష్టుపట్టిపోయిన నేపధ్యంలో 'రజనీ' సులువుగా విజయం సాధించగలరని వారు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆయన రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో త్వరలోనే ఆయన ముసుగు తొలగిపోనుంది. దీంతో తమిళనాడులో దిగ్విజయంగా 'బిజెపి' పట్టుసాధించబోతోంది.

     ఇక మరో రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఆ పార్టీ తమ వ్యూహాలను అమలు చేస్తోంది. ఇప్పటికే ఇక్కడ పార్టీని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా కాంగ్రెస్‌,టిడిపి,టిఆర్‌ఎస్‌కు చెందిన అసంతృప్తి నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. టిడిపికి చెందిన ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పార్టీలోకి రమ్మని ఒత్తిడి చేస్తోంది. ఆయన కూడా వెళ్లేందుకు మానసికంగా సంసిద్ధం అయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీమంత్రులు, ఎమ్మెల్యేలను కూడా రావాలని ఆ పార్టీ కోరుతోంది. వచ్చిన వారికి భారీ నజరానాలను కూడా ప్రకటిస్తోందని ప్రచారం జరుగుతుంది. అయితే అన్నికంటే ఆశ్చర్యం కల్గించే అంశం ఏమిటంటే అధికార టిఆర్‌ఎస్‌లో నెంబర్‌ ఫోర్‌గా ఉన్న 'హరీష్‌రావు'పై వలవేసిందట. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా 'హరీష్‌రావు'తో చర్చించారట. ఆయన తమ పార్టీలోకి వస్తే రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనను ప్రకటిస్తామని హామీ ఇచ్చినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వారి భేటీ అయిన విషయం వాస్తవమేనని, అయితే 'హరీష్‌' వారి ప్రలోభాలకు లొంగిపోతారా...? లేదా అనేది ఇంకా తెలియరాలేదు. బిజెపిలోకి వస్తే మంచి భవిష్యత్‌ ఉంటుందనే విషయం వాస్తవమే అయినప్పటికి తన మామ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ద్రోహం చేయడానికి 'హరీష్‌' ముందుకు రారని ఆయా వర్గాలు చెబుతున్నాయి. అయితేపార్టీలో తనకు జరుగుతున్న అవమానంపై 'హరీష్‌' అసంతృప్తిగా ఉన్నారని తనకంటే జూనియర్‌ అయిన కెటిఆర్‌ను కెసిఆర్‌ ప్రోత్సహిస్తున్నారని ఈ నేపథ్యంలో ఆయన ఎటువంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన వర్గం నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనా 'హరీష్‌' కనుక బిజెపి బుట్టలో పడితే ఇక తెలంగాణలో బిజెపికి తిరుగుండదు. సొంత బలంతో పాటు హరీష్‌,రేవంత్‌రెడ్డిల బలంతో బిజెపి సునాయాసంగా విజయం సాధిస్తుందని బిజెపి పెద్దల నమ్మకమట.

   ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఆ పార్టీ పెద్దలు తమదైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఒక వైపు అధికార టిడిపి ప్రభుత్వంలో ఉంటూనే ఆ పార్టీకి ఊపిరి సల్పుకోనివ్వడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉద్దేశ్యపూర్వకంగా వేధిస్తున్న బిజెపి నేతలు తాము ఎదగడానికి ఎటువంటి పనులు చేయడానికైనా వెనుకాడడం లేదు. విభజిత ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా నష్టపోయిందని వేల కోట్లు ఇస్తామని ఎన్నికలు ముందు హామీలు ఇచ్చి ఆ హామీలను తుంగలోకి తొక్కి కపట రాజకీయానికి తెరలేపింది. ప్రత్యేకహోదా విషయాన్ని పక్కకునెట్టి, రెవిన్యూలోటు భర్తీ చేయకుండా, పోలవరంకు ఇస్తామన్న నిధులు ఇవ్వకుండా 'చంద్రబాబు' ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శలు గుప్పిస్తోంది. ఏమీ చేయకుండానే తాము ఎంతో చేస్తున్నామని ప్రచారం చేస్తూ...చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా వ్యవహరిస్తోంది. దీంతో పాటు తమ పార్టీకి చెందిన నేతలపై నిత్యం ఆయనపై విమర్శలు చేయిస్తూ ఇక్కడ బలపడడానికి 'జగన్‌'కు వల విసురుతోంది. 'జగన్‌'పై ఉన్న ఆర్థిక నేరాలను చూపి ఆయన పార్టీని తమలో విలీనం చేయించుకోవడానికి పక్కాగా స్కెచ్‌ వేసింది. దీనిలో భాగంగానే ఇటీవల ప్రధాని మోడీతో ఆయనకు అపాయింట్‌మెంట్‌ ఇప్పించింది.తమ మిత్రునికి శత్రువైన వ్యక్తిని చేరదీయడం దీనిలోభాగమే. 'జగన్‌' ఎటువంటి వ్యక్తి అయినా ఆయనకు 'రెడ్డి,క్రైస్తవ,మైనార్టీ,ముస్లింలలో ఉన్న బలం తమకు పనికి వస్తుందని, ఆయనపై ఉన్న కేసుల విషయంలో తాము రాజీపడితే వచ్చే ఎన్నికల్లో తమ జెండా ఆంధ్రప్రదేశ్‌లో ఎగరడం ఖాయమని బిజెపి పెద్దలు భావిస్తున్నారు. నైతికతను పక్కన పెట్టి దక్షిణాదిపై పట్టుకోసం బిజెపి ఎవరితోనైనా కలవడానికి సిద్ధపడుతోంది. మొత్తం మీద చూస్తే 'రజనీ,హరీష్‌,జగన్‌'లతో కలసి వచ్చే ఎన్నికల్లో దక్షిణాదిలో తమ జెండా ఎగురవేయాలని బిజెపి పెద్దలు కలలు కంటున్నారు. మరి ఇవి ఎంత వరకు నెరవేరుతాయో వేచి చూడాల్సి ఉంది.

(న్యూఢిల్లీ నుంచి డి.హనుమంతరావు)

(1702)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ