WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఈ ఏడాది వ‌ర్షాలు అంతంత మాత్ర‌మే...!

 ఈ ఏడాది వర్షపాతం మధ్యస్థంగా ఉంటుందని, నైరుతి రుతుపవనాలు సాధారణ సమయానికంటే ముందే చేరుకుంటాయని భారత వాతావరణశాఖ డైరెక్టర్ డీఎస్ పాయ్ వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 30 నాటికి దక్షిణ కేరళ తీరానికి చేరుకుంటాయని పేర్కొన్నారు. సాధారణ సమయం కంటే(జూన్ 1) రెండు రోజుల ముందే ఇవి కేరళకు చేరుకుంటాయని వివరించారు. ఎల్‌నినో వాతావరణం కారణంగా ఈసారి తక్కువ వర్షపాతం ఉంటుందని అధికారులు మొదట అంచనా వేశారు. అయితే దానికి భిన్నంగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు ఇటీవల ప్రకటించారు. నైరుతి రుతుపవనాలు భారత్‌కు తూర్పు తీరంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులకు సాధారణంగా మే 20 నాటికి చేరుకుంటాయి. కానీ ఈ సారి ముందే చేరుకోవడం విశేషం. 

  కొన్ని రోజులుగా అండమాన్ సముద్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాలు అండమాన్ సముద్రానికి మే 15-20 మధ్య చేరుకుంటాయి. ఈసారి మే 14 నాటికే దక్షిణ అండమాన్ సముద్రానికి చేరుకున్న రుతుపవనాలు 48 గంటల్లో సముద్రమంతటా విస్తరించాయి. కేరళ తీరానికి ఈ నెల 30 వరకు చేరుకుంటాయని భావిస్తున్నాం అని తెలిపారు.వర్షపాతం ఎంత శాతం ఉంటుందనే అంశంపై మాట్లాడుతూ మేం ఏప్రిల్‌లో విడుదల చేసిన అంచనాల ప్రకారం 96 శాతం వర్షపాతం ఉంటుందని చెప్పాం. మళ్లీ పరిస్థితులను అధ్యయనం చేసి జూన్ మొదటి వారంలో తాజా అంచనాలను విడుదల చేస్తాం అని చెప్పారు. ఎల్‌నినో ప్రభావం గురించి మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో ఎల్‌నినో వాతావరణ పరిస్థితులు తటస్థంగా ఉంటాయని, వర్షాకాల సీజన్ రెండో భాగంలో ఎల్‌నినో బలహీనపడే అవకాశమున్నదని వివరించారు. ఈ ఏడాది కరువు ఏర్పడే అవకాశం లేదని చెప్పారు.

(372)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ