సుప్రీం వ్యాఖ్యలపై వైకాపా చంకలు గుద్దుకోవడం ఎందుకు...!?
తిరుమల లడ్డూ విషయంలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలుపై వైకాపా సంబరాలు చేసుకుంటోంది. ఈ కేసులో సుప్రీం చంద్రబాబును రాజీనామా చేయమందని, ఆయన తరువాత ముఖ్యమంత్రి ఎవరు..? అంటూ కొన్ని పేర్లును ప్రస్తావిస్తోంది. అసలు సుప్రీం లడ్డూలో కల్తీయే జరగలేదని చెప్పినట్లు, చంద్రబాబు వ్యాఖ్యలపై తీర్పు వచ్చినట్లు ఏదో ఒకటే హడావుడి చేస్తోంది. ఇంత వరకూ అక్కడ ఏమీ జరగలేదు. అక్కడ జరిగింది కేవలం లడ్డూలో కల్తీ జరిగిందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీం స్పందిస్తూ రెండో ఓపీనియన్ తీసుకోకుండా భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంపై ఆలోచించి మాట్లాడాల్సిందని మాత్రమే పేర్కొంది. దీనికే..వైకాపా నాయకులు, కార్యకర్తలు ఒకటే చిందులేస్తున్నారు. ఈకేసులో చంద్రబాబు ప్రభుత్వం నియమించిన సిట్‌ను ఆపమని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదు. అదే సమయంలో..లడ్డూలో కల్తీ లేదని వైకాపా ప్రభుత్వ హయాంలో లడ్డూ నాణ్యత బ్రహ్మాండంగా ఉందని చెప్పిందా..? ఎందుకు ఈ చంకలు గుద్దుకోవడం..? పవిత్రమైన వేంకటేశ్వరస్వామి ప్రసాదంలో నాణ్యత లేదని, తిరుమలలో పరిస్థితులు బాగా లేవని, అన్నదానం, వసతి, ఇతర విషయాల్లో కూడా గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించిందనేది జగమెరిగిన సత్యమే. దర్శన టిక్కెట్ల విషయం నుంచి దేవదేవుడి నగల వరకూ ఎంత దోచుకున్నదీ..విచారణ జరిగాల్సిందే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆఖరి తీర్పేమీ ఇవ్వలేదు. కేవలం చంద్రబాబు తొందరపడి వ్యాఖ్యలు చేశారనే అన్నది తప్ప...చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని చెప్పలేదు. ఇప్పుడు వైకాపావాళ్లు అడుగుతున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయిస్తే మంచిదే కదా..? గత ఐదేళ్లలో తిరుమలలో ఏమి జరిగిందో..అందరికీ తెలుస్తుంది కదా..? సీబీఐ, లేదా ప్రత్యేక సంస్థ లేదా సుప్రీం ఆధ్వర్యంలో విచారణ జరిగితే ఇంకా మంచింది. దీనితోనైనా నిజాలు బయటకు వస్తాయి కదా..? వైకాపా కోరుకున్నట్లు సీబీఐ విచారణ జరిగితే..చంద్రబాబుకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఎందుకంటే..గత ఐదేళ్లలో అక్కడ ఎన్ని పాపాలు చేశారో..వైకాపా వాళ్లకే బాగా తెలుసు. మొత్తం మీద..వైకాపాకు ఒక ఘోరమైన ఓటమి తరువాత ఒక్కరోజైనా చంకలు గుద్దుకునే అవకాశం సుప్రీం వ్యాఖ్యల ద్వారా వచ్చింది. అంతే...!?