I&PRలో ఫైళ్ల దొంగతనం..!?
రాష్ట్ర సమాచారశాఖలో దొంగలు పడ్డారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆదివారం రాత్రి ఈ దొంగతనం జరిగినట్లు సమాచారం. అయితే..దీన్ని అధికారులెవరూ ధృవీకరించడం లేదు. రాష్ట్ర సమాచారశాఖ ప్రధాన కార్యాలయం ద్వారాలకు వేసి ఉన్న స్టీల్ గొలుసును కట్ చేసిన దొంగలు, కార్యాలయంలోకి దూరినట్లు తెలుస్తోంది.దీనిపై సోమవారం ఉదయం కార్యాలయానికి వచ్చిన కొందరు ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే..పోలీసులు కార్యాలయానికి వచ్చి పరిశీలించారని, అయితే..అక్కడ దొంగతనానికి సంబంధించిన ఆనవాళ్లు ఏమీ లేవు. అయితే..ద్వారానికి వేసి ఉన్న స్టీల్ గొలుసును కట్ చేయడంతో..గొలుసుతో పాటు లాక్ కూడా కిందపడి ఉంది. కార్యాలయంలో దొంగతనం జరిగి ఉంటే.. అక్కడ దొరికిన వస్తువులను దొంగలు పట్టుకుపోయేవారు. అదే కాకుండా విలువైన కంప్యూటర్లు, ఇంకా ఇతర వస్తువుల జోలికి వారు వెళ్లలేదు. సాధారణ దొంగలు అయితే..అక్కడ దొరికిన కంప్యూటర్లు, ఇంకా ఇతర విలువైన వస్తువులను తీసుకెళ్లేవారు. అయితే..అటువంటిదేమీ జరగకపోవడంతో..వచ్చిన దొంగలు సమాచారశాఖ దస్త్రాలను దొంగిలించి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత ఐదేళ్ల వైకాపా పాలనలో శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలు, అరాచకాలపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్, ఏసీబీతో విచారణ జరిపిస్తోంది. విచారణ సందర్భంగా సంబంధిత అధికారులు పాత దస్త్రాలను అధికారుల నుంచి విచారణ కోసం తీసుకుంటున్నారు. గత జగన్ ప్రభుత్వంలో వందలకోట్ల ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయిందని, అప్పట్లో అధికారులు, ఇతర ఉన్నతాధికారులు అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై ప్రభుత్వం విచారణ చేయిస్తోంది. అయితే..ఈలోగా సంబంధిత దస్త్రాలను మాయం చేయడానికో లేక ధ్వంసం చేయడానికో కొందరు వ్యక్తులు సమాచారశాఖ కార్యాలయంలోకి చొరబడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అవుట్‌డోర్ యాడ్ ఏజెన్సీలకు వందలకోట్లు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారని, ఇప్పుడు విచారణలో వాటి సంగతి బయటకు వస్తుందనే ఉద్దేశ్యంతో దొంగలు వాటిని నాశనం చేయడానికి వచ్చి ఉంటారనే అనుమానాలు ఉన్నాయి. అదే విధంగా గత ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన పత్రికకు వందల కోట్లు యాడ్స్ ఇచ్చారు. ఆ పత్రికకు ఒకే రోజు దాదాపు 150కి పైగా పుల్‌పేజీ యాడ్స్ ఇచ్చినట్లు దీనిపైన కూడా విచారణ జరుగుతోంది. కొన్ని అవుట్‌డోర్ యాడ్ ఏజెన్సీలకు చెందిన వారు..మూడు నాలుగు ఫేక్ ఏజెన్సీలను పెట్టుకుని వాటి ద్వారా నిధులను కొల్లగొట్టారు. ఒకే వ్యక్తికి చెందిన మూడు ఏజెన్సీలకు, జగన్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తుల బినామా ఏజెన్సీలతో పాటు, ఒక ప్రముఖ యాడ్ ఏజెన్సీ కూడా భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ యాడ్ ఏజెన్సీలు ఇప్పుడు జరుగుతున్న విచారణలో ఒక ప్రధాన అధికారిని కాపాడేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారని, ఆయనేమీ అవినీతి చేయలేదని, గతంలో కార్యాలయాన్ని తన కనుసన్నల్లోనడిపిన అధికారే అవినీతికి పాల్పడ్డారనే ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఆ అధికారితో పాటు, ఇప్పుడు కార్యాలయంలో పనిచేస్తోన్న ప్రధాన అధికారికి కూడా అవినీతిలో ఎక్కువ భాగం ఉందని తెలుస్తోంది. బదిలీ అయిన అధికారి కంటే బదిలీ కాకుండా ఉన్న అధికారి పాత్రే దీనిలో అధికమనే భావన సమాచారశాఖ అధికారుల్లో, ఉద్యోగుల్లో ఉంది. కాగా..ఈ తాళాలు పగులకొట్టి కార్యాలయంలో దూరిన వ్యవహారంపై సమాచారశాఖ ఉన్నతాధికారులకు తెలిసినా..వారు దీని గురించి సీరియస్‌గా పట్టించుకోవడం లేదు. దీనిపై ఈ రోజు అధికారుల మధ్య కొంత చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కార్యాలయానికి సీసీ కెమెరాలు పెట్టాలని లేక వాచ్‌మెన్‌ను పెట్టాలని చర్చించుకున్నారు తప్ప..కార్యాలయ తాళాలు పగులకొట్టి..లోపలకు వచ్చిన వారిపై పోలీసులకు ఇప్పటి వరకూ అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. దీనిపై లోతైన విచారణ జరిపిస్తే..అసలు నిజాలు బయటకు వస్తాయి.