టిడిపి లీగల్ టీమ్ ఫెయిల్...!?
తాజాగా సుప్రీంకోర్టు తిరుమల లడ్డూ విషయంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెనుదుమారాన్ని రేపుతున్నాయి. గత జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించింది. వాస్తవానికి ముఖ్యమంత్రి తిరుమల లడ్డూ కల్తీపై ఆధారాలు లేకుండా మాట్లాడలేదు. తిరుమలకు సప్లయి చేసే నెయ్యిని తనిఖీ చేయించి, దానిలో కల్తీ ఉందనే రిపోర్టు వచ్చిన తరువాతే..ఆయన దానిపై మాట్లాడారు. అయితే గౌరవ న్యాయస్థానం రెండో ఓపినీయన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. అయితే.. సుప్రీం న్యాయమూర్తుల అభిప్రాయం ఎలా ఉన్నా..రాష్ట్ర ప్రభుత్వం తరుపున వాదిస్తోన్న న్యాయవాదులు ఈ కేసును సరైన రీతిలో ధర్మాసనం ముందు ఉంచలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గత కొన్నాళ్లుగా తెలుగుదేశం పార్టీ లీగల్ టీమ్ ప్రతివిషయంలో ఫెయిల్ అయినట్లే..ఇక్కడ కూడా ఫెయిల్ అయిందనే భావన పార్టీలో ఉంది. ప్రతిపక్ష వైకాపా సుప్రీంకోర్టులో కానీ, రాష్ట్ర హైకోర్టులో కానీ..తమ హవా చూపిస్తోంది. ఏ కేసు ఏ బెంచికి వెళ్లాలి...? ఎప్పుడు దానిపై విచారణ సాగాలి..అనే విషయాల్లో, ఇంకా కొన్ని విషయాల్లో జగన్ లీగల్ టీమ్ బాగా పనిచేస్తోంది. అదే సమయంలో టిడిపి లీగల్ టీమ్ వైఫల్యం చెందుతూనే ఉంది. అప్పట్లో చంద్రబాబు అరెస్టు సమయంలోనూ, తరువాత ఆయనపై ఉన్న కేసులన్నింటినీ సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఓ పాత్రికేయుడు వేసిన కేసు విషయంలోనూ టిడిపి లీగల్ టీమ్ సరిగా వ్యవహరించలేదనే విమర్శలు ఉన్నాయి. తాజా కేసు విషయంలోనూ అదే జరిగిందనే మాట పార్టీ వర్గాల నుంచి వస్తోంది. వైకాపా టీమ్ ఈ కేసు విషయంలో చాకచక్యంగా వ్యవహరించగా, టిడిపి టీమ్ మాత్రం ఉదాసీనంగా వ్యవహరించిందని, ఢిల్లీలో కానీ, అమరావతిలో కానీ టిడిపి లీగల్ టీమ్ అంత చురుగ్గా వ్యవహరించడం లేదనే భావన పార్టీ వర్గాల్లో ఉంది. ఒకప్పుడు కోర్టుల్లో చంద్రబాబుకు తిరుగులేదని, ఆయనకు వ్యతిరేకంగా కేసులు గెలవడం చాలా కష్టమనే భావన రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఉంది. అయితే..ఇటీవల కాలంలో ఆయనకు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ఎందుకో..అంతగా వీక్ అయ్యారు..తెలియదు.