WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మరో ఆరు నెలల్లో...లాభాల బాటలో గుంటూరు ఆర్టీసీ....!

నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఆర్టీసీకి చెందిన కొన్ని డిపోలు ఇప్పుడిప్పుడే లాభాల్లోకి వస్తున్నాయి. నష్టాలు వస్తున్న రూట్‌లలో లాభాల్లోకి తెచ్చేందుకు గుంటూరు జిల్లా ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ జ్ఞానంగారి శ్రీహరి చేస్తోన్న ప్రయత్నాలకు ఫలితం దక్కబోతోంది. ఇప్పటికే అనేక గ్రామాల్లో ఆయన స్వయంగా పర్యటించి సామాన్య ప్రజలను కలసి ఆర్టీసీని ఎలా రక్షించుకోవాలి... ఒక వేళ ఆర్టీసీ లేకుంటే రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో వివరించి చెప్పి వారి మన్నలను పొందారు. తన సర్వీసులో ఏ ఉద్యోగి పొట్టకొట్టలేదని, చిన్నపాటి తప్పులకు పెద్దశిక్షలు వేయలేదని, చిన్న చిన్న కారణాలతో సస్పెండ్‌ అయిన వారిని గతంలో సస్పెండ్‌ ఎత్తివేతకు సంవత్సరాల తరబడి ఎదురు చూసేవారని, కానీ తాను వచ్చిన తరువాత అటువంటి వాటిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలనే ఆదేశాలు డిఎంలను ఆదేశించానని ఆయన సమీక్షా సమావేశంలో తెలిపారు. 

  ఆర్టీసీ ప్రయాణీకులకు వడదెబ్బ నుండి రక్షించేందుకు అల్ట్రాడీలెక్స్‌ బస్సులో ఎయిర్‌కూలర్‌ సౌకర్యాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఫ్యాన్లను బస్సు కిటికీల వద్ద ఏర్పాటు చేశామని, ప్రయాణీకులు వేడి గాలులతో ఇబ్బందులు పడుతున్నారని, వడదెబ్బ నుంచి వారికి ఉపశమనం కల్పించేందుకు ప్రత్యేక దృష్టిసారించామని ఆయన తెలిపారు. ప్రయాణీకులను ఆర్టీసీ సురక్షితంగా గమ్యాన్నికి చేర్చుతుందని, పరిశుత్రతోపాటు చల్లదనం అందించాలనే లక్ష్యంతో అనేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పటికే అనేక డిపోలను ఆయన స్వయంగా సందర్శించి అక్కడ ఉన్న అసౌకర్యాలను గమనించి అనేక సౌకర్యాలను కల్పిస్తున్నారు. విజయవాడ నుంచి శ్రీశైలం వద్దకు వెళ్లే బస్సులకు ప్రతిసీటు వద్ద ఫ్యాన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దూరం ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో టివితో పాటు బస్సుల చుట్టూ వట్టివేళ్లు ఏర్పాటు చేసి నిత్యం వాటిపై నీళ్లు చల్లిస్తున్నారు. వేసవి కాలంలో ప్రయాణీకులను గమ్యం స్థానాలకు చేర్చే బాధ్యత ఆర్టీసీ అధికారులదేనని, ప్రయాణీకులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని ఆయన ఆదేశించారు. బస్సు నడిపే సమయంలో ఏ డ్రైవర్‌ అయినా సెల్‌ఫోన్‌ నడుపుతున్నట్లు గుర్తించిన వారు ఫోటో తీసి తనకు వాట్స్‌ప్‌ చేస్తే అటువంటివారిని సస్పెండ్‌ చేస్తానని ఆయన హెచ్చరించారు. గుంటూరు జిల్లాను ప్రమాద రహిత రీజియన్‌గా నిలపడమే ధ్యేయంగా రోడ్డు ప్రమాద భద్రతా కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఆర్‌ఎం శ్రీహరితో పాటు డిప్యూటీ సిటిఎంలు , ఎకౌంట్‌ ఆఫీసర్‌, ప్రొటెక్ట్‌ ఆఫీసర్‌, జిల్లాలోని అన్ని యూనియన్‌ రీజినల్‌ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. 

   గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. గుంటూరును ప్రమాద రహిత రీజియన్‌గా నిలిపేందుకు వెంటనే పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారు, గాయపడ్డవారి ఫోటోలు, పత్రికల్లో ప్రచురించిన క్లిపింగ్‌లను ఆయా డిపోల్లో ఏ రోజుకు ఆ రోజు నోటీస్‌ బోర్డుల్లో ఉండేటట్లు చర్యలు తీసుకున్నారు. విదుల నిర్వహణలో డ్రైవర్లు పూర్తి ఏకాగ్రతతో ఉండాలని, సెల్‌ఫోన్లు వాడవద్దని ఆయన హెచ్చరించారు. అంతే కాకుండా ఆర్టీసీ బస్‌స్టాండ్‌ల్లో నాణ్యతలేని ఫలహారాలను అమ్మితే కేసులు నమోదు చేస్తామని, నిర్వాహకులను హెచ్చరించారు. ఇప్పటికే అనేక బస్సుస్టాండ్లలోని స్టాల్స్‌ను ఆయన తనిఖీ చేయటం జరిగింది. ఎంఆర్‌పి ధరల కన్నా ఎక్కువ ధరలకు తినుబండారాలు అమ్మితే ఆయా షాపులను సీజ్‌ చేస్తామని, తినుబండారాల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించడంతో దాని ఫలితం బస్‌స్టాండ్‌ల్లో కొంత వరకు కనిపిస్తుంది. ఎవరైనా అధిక ధరలకు అమ్మితే తనకు ఫిర్యాదు చేయాలని, వెంటనే చర్యలు తీసుకుంటామని, ఇందులో ఏఒక్కరిని  వదిలేది లేదని 'శ్రీహరి' చెప్పడం జరిగింది. జిల్లాలో ఉన్న డిపోలను లాభాల్లో నడిపించడానికి అనేక ప్రణాళికలను శ్రీహరి సిద్ధం చేశారు. 

   ఖర్చులు తగ్గించుకుని, ఆదాయం పెంచుకోకపోతే డిపోలకు నష్టాలు తప్పవని, డిపోల్లో పనిచేస్తున్న సిబ్బంది, డిఎం సఖ్యతతో ఉండాలని ఆయన సూచించారు. మరో ఆరు నెలల్లో మెజార్టీ డిపోలు లాభాల బాటలో నడవడం ఖాయమని శ్రీహరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సిబ్బంది కృషి చేసి ఆర్టీసీ ప్రతిష్ట పెంచాలని సమీక్షలల్లో ఆయన కోరుతున్నారు. కొన్ని డిపోలలో అమ్ముతున్న తినుబండారల్లో పరిశుత్ర లేకపోవడంతో అక్కడికక్కడే జరిమానా విధించారు. దీంతో పలు డిపోల్లో నాణ్యత కలిగిన తినుబండారాలు అమ్ముతున్నారు. ఆర్టీసీ సంస్థ మనుగడలో ఉంటేనే ఉద్యోగులు, వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయని, మీ అందరూ పరస్పరం సహకరించుకుని ప్రయాణీకులకు ఇబ్బందులు కల్గించకుండా మర్యాదగా వారితో మాట్లాడుతూ మన్నలను పొంది తాము ప్రయాణిస్తే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని కోరుకునే విధంగా ఉండాలని ఆయన సిబ్బందికి సూచించారు.


(440)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ