లేటెస్ట్

విద్యుత్‌శాఖాధిపతిగా ‘విజయానంద్‌’...!

ఇంధనశాఖాధిపతి మరియు ట్రాన్స్‌కో సిఎండిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నాగులపల్లి శ్రీకాంత్‌ కేంద్రసర్వీసులకు వెళ్లబోతున్న నేపథ్యంలో ఆ పోస్టులో పదేళ్లు అనుభవం ఉన్న ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ విజయానంద్‌ను నియమించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో, ప్రత్యేక రాష్ట్రంలో పదేళ్లు ట్రాన్స్‌కో సిఎండిగా బాధ్యతలు నిర్వహించిన ‘విజయానంద్‌’కు విద్యుత్‌ పంపిణీపై పూర్తిగా అవగాహన ఉన్న నేపధ్యంలో ఆయన సేవలను ఉపయోగించుకోవాలనిముఖ్యమంత్రి జగన్‌కు పలువురు ఐఏఎస్‌ అధికారులు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఐఏఎస్‌ అధికారి విజయానంద్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితుడు అని గతంలో దూరం పెట్టిన ‘జగన్‌’ చివరకు ఆయన సేవలనే ఉపయోగించుకోబోతున్నారు.


‘విజయానంద్‌ను అటు ట్రాన్స్‌కో సిఎండిగా, ఇటు ఎనర్జీ సెక్రటరీగా రెండు పోస్టుల్లో నియమిస్తారా..? లేక ఆయనను కేవలం విద్యుత్‌శాఖకే పరిమిత చేస్తారా..? ఈ మాసాంతానికి శ్రీకాంత్‌ రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్‌ అయి కేంద్ర సర్వీసులకు వెళ్ళబోతున్నారు. ఈ మధ్యలో శ్రీకాంత్‌ వారసుడిని ముఖ్యమంత్రి ఎంపిక చేస్తారని, ఇప్పటికే ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చారని సిఎంఓ అధికారులు కొందరు చెప్పినట్లు తెలిసింది. విద్యుత్‌ రంగంలో అపార అనుభవం ఉన్న ‘విజయానంద్‌’కు ఆ బాధ్యతలు అప్పజెబితే, తాజా పరిస్థితికన్నా విద్యుత్‌ పరిస్థితులు మెరుగుపడుతాయని ఆ శాఖలోని సీనియర్‌ అధికారులు అంటున్నారు. కాంగ్రెస్‌ హయాంలో, చంద్రబాబు హయాంలో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన ‘విజయానంద్‌’ వివాదాలకు అతీతంగా ఉంటారని పేరుంది. ముందు ముందు విద్యుత్‌ సంక్షోభం మరింత ముదరనుందని, ‘విజయానంద్‌’ సేవలను ఉపయోగించుకుంటే పరిస్థితులు అదుపులోకి వస్తాయని కొందరు సీనియర్‌ అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు సూచించారని ప్రచారం జరుగుతోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ