‘భీమ్లానాయక్’ దెబ్బ ‘జగన్’పై పడుతుందా..?
జనసేనాధిపతి నటించిన భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా అనేక అవాంతరాలు సృష్టిస్తే ‘పవన్’ను ఇబ్బంది పెట్టినట్లేనని ముఖ్యమంత్రి భావిస్తున్నారని, అయితే కాపు సామాజికవర్గంలో దీని వల్ల వైకాపాపై వ్యతిరేకత పెరిగిందని, ఈ విషయంలో స్వయంకృతాపరాధంతో తీసుకున్న నిర్ణయాలు తమందరికీ నష్టం కలిగించే అవకాశం ఉందని కొందరు అమాత్యులు, అధికార ముఖ్యనేతలు ఆవేదనతో తెరవెనుకన చెబుతున్నారు. 2019 పవన్ అభిమానులతో పాటు ‘చంద్రబాబు’పై వ్యతిరేకత కాపు సామాజిక వర్గ ఓటర్లు జగన్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చిన విషయం ఎన్నికల ఫలితాల తరువాత స్పష్టమైంది. నా అభిమానులతో పాటు, నా సామాజికవర్గం వారు జనసేనకు ఓటు వేసినట్లైయితే తమకు 40 నుంచి 50 సీట్లు వచ్చేవని తన సమావేశాలకు హాజరైన వారిలో సగం మంది తమకు ఓటు వేసినా ఫలితాలు మరో విధంగా ఉండేవని, ‘పవన్’ బాహాటంగానే నిష్టూరమాడారు. ఎప్పుడైతే ‘కాపు’ రిజర్వేషన్‌ను ముఖ్యమంత్రి రద్దు చేశారో..కాపు కార్పొరేషన్‌కు నిధులు కేటాయించలేదో కాపు సామాజిక వర్గంలో వ్యతిరేకత పెరిగిపోతూనే ఉంది. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ‘జగన్’ను ఓడిరచడమే లక్ష్యంగా పెట్టుకుంటారని, చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటారని, దాని ప్రభావం అధికారపార్టీకి నష్టం కలుగుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ‘జనసేనాధిపతి’ పవన్‌ను ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ పెట్టుకోవడం అధికారపార్టీకి మద్దతు ఇచ్చిన కాపు సామాజికవర్గం వారికి మింగుడుపడడం లేదు. ఇటీవల ‘చిరంజీవి’ ముఖ్యమంత్రిని ప్రాదేయపడిన విధానంపై ‘పవన్’ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా అన్న చిరంజీవిపై పరోక్షంగా చురకలు వేశారు. తమ సామాజికవర్గానికి ‘పవనే’ బలమైన నేత అని కాపు సామాజికవర్గం నమ్ముతోంది. మా ముఖ్యమంత్రి అనవసరంగా ‘పవన్’ను టార్గెట్‌గా పెట్టుకుని తమ రాజకీయజీవితంతో ఆడుకుంటున్నారని కాపు సామాజికవర్గ నేతలు పలువురితో చెబుతున్నారు. ఈ విషయంపై బాహాటంగా నిరసన తెలపాలని అధికారపార్టీ నేతలు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారట. ‘పవన్’ను టార్గెట్‌గా పెట్టుకున్న ‘జగన్’ అందుకు తగ్గ మూల్యం చెల్లించకతప్పదని రాజకీయవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ‘పవన్’ అభిమానుల హడావుడి చూస్తుంటే ‘జగన్’కు వ్యతిరేకంగా ఓటు వేయడం ఖాయమని (వీరిలో ఎక్కువ మంది జగన్ పార్టీకి ఓటు వేసిన వారే) ఆ సామాజికవర్గ నాయకులు చెబుతున్నారు.