WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆదాయపన్ను రిటర్ను దాఖలుకు ఆధార్ తప్పనిసరి

 వచ్చేనెల 1వ తేదీనుంచి ఆదాయపన్ను రిటర్ను దాఖలుకు, కొత్త పాన్ నంబరు పొందడానికి ఆధార్ తప్పనిసరి అని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) స్పష్టం చేసింది. ఆదాయపన్ను శాఖ అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థ అయిన సీబీడీటీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆధార్ లేనివారికి, దరఖాస్తు చేసుకోనివారికి సుప్రీంకోర్టు తీర్పు పాక్షికంగా మాత్రమే ఊరటనిచ్చిందని, వారి పాన్ నంబరును రద్దు చేయబోమని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సీబీడీటీ మూడు అంశాలను వివరించింది. 2017 జూలై 1వ తేదీ నుంచి ఆదాయపన్ను రిటర్ను దాఖలు చేసేందుకు, పాన్ నంబరు కొరకు దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ తప్పనిసరి అని వెల్లడించింది. 

  2017 జూలై 1వ తేదీ నాటికి ఆధార్ నంబరు జారీ అయినవారు, కలిగినవారు లేదా ఆధార్ కేటాయింపునకు అర్హులైనవారు సదరు నంబరును ఆదాయపన్ను అధికారులకు పాన్‌తో అనుసంధానం కోసం తెలియజేయాలి అని సీబీడీటీ పేర్కొన్నది. దీనిని పాటించనివారు లేదా ఆధార్ లేనివారి విషయంలో ఏం జరుగుతుందో కూడా వివరించింది. ఆధార్ లేనివారికి లేదా ప్రస్తుతానికి ఆధార్‌కు దరఖాస్తు చేయదలుచుకోనివారికి సుప్రీంకోర్టు పాక్షికంగా ఊరటను కల్పించింది. వారి పాన్ నంబరు రద్దు చేయడం జరుగదు. అప్పుడిక పాన్ తెలియజేయకపోవడం వల్ల కలిగే విపరిణామాల సమస్యే తలెత్తదు అని సీబీడీటీ తెలిపింది. పాన్ నంబరు రద్దు చేస్తే సాధారణ బ్యాంకింగ్, ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడం సాధ్యపడదు కనుకనే సీబీడీటీ ఈ ఊరటను ఇచ్చిందని అధికారులు అంటున్నారు.

(275)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ