WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జయ' హత్యకు 'దీపక్‌' కుట్ర....!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను హత్య చేసేందుకు తన సోదరుడు దీపక్‌ ప్రయత్నించాడని సంచలన ఆరోపణలు చేశారు ఆమె మేనకోడలు దీప. శశికళ కుటుంబంతో దీపక్‌ కుమ్మకయ్యాడని.. దీపక్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారించాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం జయలలిత నివాసం పోయెస్‌ గార్డెన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన దీపను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మద్దతుదారులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా దీప మాట్లాడుతూ.. పోయెస్‌ గార్డెన్‌లో జయలలిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించేందుకు వెళ్తే శశికళ కుటుంబసభ్యులతో కలిసి దీపక్‌ తనపై దాడి చేశాడని ఆరోపించారు. జయలలిత నివాసం స్వాధీనానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. శశికళ కుటుంబం చేతుల్లో నుంచి అన్నాడీఎంకే పార్టీని కాపాడాలని పిలుపునిచ్చారు.

జయలలితకు తానే వారసురాలినని దీప గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే జయలలిత ఆస్తులు కూడా తనకే దక్కుతాయని చెప్పారు.జయలలితకు అధికారికంగా వారసులు లేకపోవడంతో ప్రస్తుతం ఆమె ఆస్తులన్నీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. అయితే పోయెస్‌ గార్డెన్‌లో తాను నివాసం ఉండేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ దీప ఆదివారం ఉదయం అక్కడికి చేరుకుని డిమాండ్‌ చేశారు. భవనం లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. జయలలిత వారసులకు ఆమె నివాసంలోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వకపోవడం సరికాదని ఆమె పేర్కొన్నారు.

 

(379)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ