WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టిడిపికి 'మోదుగుల' గుడ్‌బై...!

గుంటూరు-2 శాసనసభ్యుడు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి టిడిపికి గుడ్‌బై చెప్పబోతున్నారా...? అంటే అవుననే అంటున్నాయి ఆయన సన్నిహిత వర్గాలు. గత కొంత కాలంగా టిడిపిపై, ప్రభుత్వంపై ఆయన దండెత్తుతున్న తీరే దీన్ని బలపరుస్తుంది. ప్రభుత్వంపై పదే పదే విమర్శలు గుప్పిస్తూ ప్రతిపక్షాలకు ఆయన అస్త్రాలు అందిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ, ప్రైవేట్‌ కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వంపై ఆయన సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఒకసారి కాదు...పలుమార్లు కావాలనే ఆయన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. నిన్నటికి నిన్న వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నకిలీ విత్తనాలకు గుంటూరు కేంద్రంగా మారిందని, ప్రభుత్వ పెద్దలే దీనిలో ఉన్నారని ఆయన దుయ్యబట్టారు. నామ మాత్రంగా నకిలీ విత్తతయారీదారులపై దాడులు చేస్తున్నారని, అసలైన దొంగలను పట్టుకోవడం లేదని ఆయన ఆరోపించారు. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి పుల్లారావును లక్ష్యంగా చేసుకుని ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నారు. నకిలీ విత్తనాల తయారీదారుల్లో మంత్రి పుల్లారావు అనుచరులు ఉన్నారని, వాళ్లను మంత్రి పుల్లారావు కాపాడుతున్నారని ఆయన అంటున్నారు. అయితే నకిలీ విత్తనదారులపై ఆయన నేరుగా ఆరోపణలు చేయటం సంచలనం సృష్టిస్తోంది. తన వద్ద సమాచారం ఉంటే ముఖ్యమంత్రిని కలసి ఫిర్యాదు చేయాల్సిన ఎమ్మెల్యే స్వంత మంత్రులపై విమర్శలు చేయటం ఏమిటని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి ఆయన పదే పదే ప్రభుత్వంపై విమర్శలు చేయటం వెనుక వేరే ఉద్దేశాలు ఉన్నాయని జిల్లా టిడిపి నాయకులు అంటున్నారు.

    పార్టీ అగ్రనాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన టిడిపికి గుడ్‌బై చెప్పాలనే ఉద్దేశ్యంతో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల సమయంలో తాను సిట్టింగ్‌ ఎంపినీ అయినా తనకు ఎమ్మెల్యే సీటు ఇచ్చారని ఆయన అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని అయితే ఆ హామీని నిలబెట్టుకోలేదని ఆయన ఆరోపిస్తున్నారు. నర్సరావుపేట పార్లమెంట్‌సభ్యుడిగా తాను పార్లమెంట్‌లో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేసిన పోరాటం వల్ల టిడిపికి మైలేజ్‌ వచ్చిందని, తనను వాడుకుని వదిలేశారని ఆయన అంటున్నారు. పార్లమెంట్‌లో తనపై కాంగ్రెస్‌ ఎంపీలు దాడి చేసి కొట్టినా, తాను సమర్థంగా సమైక్యాంధ్ర కోసం ఉద్యమించానని, త్యాగం చేసిన తనకు జరిగిన న్యాయమేమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎంపి సీటును వదులుకున్నానని, పార్టీ చెప్పినట్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఇంకా తనను అవమానిస్తున్నారని ఆయన వాపోతున్నారు. గుంటూరు మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ విషయంలోనూ పార్టీ అధిష్టానం తనను పట్టించుకోలేదని, తన స్వంత నియోజకవర్గంలో ఉన్న మార్కెట్‌యార్డు చైర్మన్‌ పదవి విషయంలో మంత్రి పుల్లారావు కలుగ చేసుకుని తన అనుచరునికి ఇప్పించుకున్నారని ఇదంతా తనను అవమానాలు పాలు చేయడానికేనని ఆయన అంటున్నారు. ఇన్ని అవమానాలు భరించి ఇక పార్టీలో కొనసాగడానికి తాను సిద్ధంగా లేనని ఆయన అంటున్నారట.

    కాగా గత మూడు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా 'మోదుగుల' పనితీరు నాసిరకంగా ఉందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో ఆయనను పక్కకు పెట్టాలనే నిర్ణయానికి వచ్చిందట. దాంతోనే ఇక తనకు మళ్లీ సీటు ఇవ్వరనే ఉద్దేశ్యంతోనే 'మోదుగుల' ఇలా వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, త్వరలో ఆయన వైకాపాలోకి జంప్‌ కావడం ఖాయమని వారు అంటున్నారు. తన స్వంత బావ అయిన 'అయోధ్యరామిరెడ్డి' వైకాపాలో ఉండడంతో ఈయన కూడా అదే దారిలో నడుస్తారని వారు చెబుతున్నారు. మొత్తం మీద ప్రస్తుతం గుంటూరు జిల్లా టిడిపిలో 'మోదుగుల' వ్యవహారం హాట్‌ టాపిక్‌ అయింది.


(2804)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ