తిరుమల లడ్డూ కల్తీపై స్వతంత్ర సిట్ తో విచారణ
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్‌తో దర్యాప్తుకు ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం నాడు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు, ఎపి ప్రభుత్వం తరుపునుంచి ఇద్దరు, FSSAI నుంచి ఒకరు ఈ దర్యాప్తు బృందంలో ఉంటారు. స్వతంత్ర సిట్ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. వేంకటేశ్వరునికి దేశవ్యాప్తంగా భక్తుల ఉన్నందును వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశాలను ఇచ్చినట్లు పేర్కొంది. వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. తిరుమలకు సరఫరా చేసే నెయ్యిలో కల్తీ జరిగిందని, దీనిపై తనిఖీ చేయిస్తే విషయం బయటపడిందని ఎన్‌డిఏ ఎమ్మెల్యేల సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనితో దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. పరమపవిత్రమైన తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వులు కలిపారనే దానిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వరస్వామి భక్తులు విస్తుపోయారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసి విచారణ జరుపుతుండగా వైకాపా సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై సీబీఐతో విచారణ జరపాలని సుప్రీంలో వైకాపా రాజ్యసభ సభ్యుడు పిటీషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు మరికొందరు కూడా పిటీషన్ ధాఖలు చేశారు. దీనిపై సుప్రీంలో విచారణ జరగగా, కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా సుప్రీం కోరింది. కేంద్రం అభిప్రాయం ప్రకారం స్వతంత్ర దర్యాప్తు చేయించాలని నిర్ణయించారు.