WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఇమ్రాన్‌ఖాన్‌జీ'....'కాశ్మీర్‌'ను పందెంగా పెడతావా...!?

ఆంగ్లేయులు ప్రపంచానికి పరిచియం చేసిన క్రీడ క్రికెట్‌. ప్రాచీన కాలంలో బ్రిటీష్‌ రాయల్‌ ఆర్మీ, బ్రిటీష్‌ రాజకుటుంబీకులు ఈ ఆటను ఆడి ఆస్వాదించేవారు. రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యం తన సామ్రాజ్య విస్తరణ కాంక్షలో ప్రపంచాన్ని గుప్పెటపట్టిన కాలంలో ఈ క్రీడ ప్రపంచ వ్యాప్తంగా పరిచియం చేయబడింది. అయితే ఆంగ్లేయులు తమ సామ్రాజ్యాన్ని విస్తరించినంత వేగంగా ఈ క్రీడను విస్తరించలేకపోయారు. ప్రపంచంపై వారి ఆధిపత్యం ఉన్న రోజుల్లో కానీ, తరువాత కానీ ఈ క్రీడ బహుళ జనాధరణ పొందలేకపోయింది. క్రికెట్‌ అనేది కేవలం కొన్ని దేశాలకే పరిమితమైపోయి వాణిజ్య క్రీడగా చెలామణి అవుతోంది. ఒక ఫుడ్‌బాల్‌లా, ఒక టెన్నిస్‌లా ఈ క్రీడ విస్తరించలేదు...ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ విస్తరించకపోవడానికి కారణాలు అనేక ఉన్నాయి. అయితే ఆశ్చర్యకరంగా మూడో ప్రపంచ దేశాలైన భారత్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ వంటి దీవుల్లోనే క్రికెట్‌ ఆదరణ ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, జింబాబ్వే వంటి మరి కొన్ని దేశాలకు మాత్రమే దీనిలో ఆసక్తి, ఆదరణ ఉంది. ముఖ్యంగా ఉపఖండంలో దీనికి తిరుగులేని గుర్తింపు ఉంది. భారత్‌లో ఈ వ్యామోహం మరింత ఎక్కువ. దీన్ని క్యాష్‌ చేసుకునేందుకే ఐసీఐ నిత్యం ప్రయత్నిస్తోంది. వ్యాపార, వాణిజ్య వస్తువుగా క్రికెట్‌ను తీర్చిదిద్దింది. అయితే దీనిలో ఎంత వ్యాపార ప్రయోజనాలు ఉన్నా...దీన్నో వినోద సాధనంగా సగటు భారతీయుడు గుర్తిస్తున్నారు. క్రికెట్‌లో భారత్‌ గెలిచిన రోజు భారతీయులకు పండుగ రోజే. అదే ఓడిపోతే ఆ రోజంతా వారికి మనశ్సాంతి ఉండదు...! 

   ఇది కేవలం భారత్‌లోనే కాదు...పొరుగు దేశాలైన పాకిస్తాన్‌,బంగ్లాదేశ్‌, శ్రీలంకల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. భారత్‌,పాకిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగితే అది ఓ యుద్ధపోరాటంలా ఉంటుందని తప్ప...క్రీడలో ఉండదు. దేశం మొత్తం ఆ రోజు ఒక ఉద్విగ్నమైన స్థితిలో ఉంటుంది. తమ దాయాది చేతిలో ఓడిపోకూడదని ఇటు భారత్‌, అటు పాకిస్తాన్‌ అభిమానులు కోరుకుంటారు. దీనికి చారిత్రక కారణాలు ఉన్నా...ఇటీవల కాలంలో అవి మరీ ఎక్కువపోయాయి. క్రీడను క్రీడలా కాకుండా రెండు దేశాల మధ్య యుద్ధంలా భావిస్తున్నారు. తమ జట్టు గెలవని రోజు వారి అభిమానులు వేసే వీరంగాలు అంతా ఇంతా కావు...! ప్రపంచకప్‌ కానివ్వండి...! లేదా సాదా సీదా మ్యాచ్‌ కానివ్వండి...గేమ్‌ ఏదైనా గెలుపు మాత్రం తమదే కావాలని అభిమానులు కోరుకుంటారు. ఓడిపోతే ఇక ఆటగాళ్ల దిష్టిబొమ్మ దహనాలు, వారిపై దాడులు సాధారణమైపోతున్నాయి. అందుకు ఆయా రాజకీయపార్టీల విధానాలు కూడా కొంత కారణం అవుతున్నాయి. తమ జట్టు ప్రత్యర్థి ఓడించిందంటే యుద్ధంలో తాము గెలిచినట్లు భావించే పరిస్థితులు రెండు దేశాల్లో కనిపిస్తుంది. ఇప్పుడంటే భారత్‌ పదే పదే పాకిస్తాన్‌పై గెలుస్తుండడంతో పాకిస్తానీయులు పెద్దగా నోరు విప్పడం లేదు కానీ...1980 రోజుల్లో వారు నోటికి హద్దూ పద్దూ ఉండేది కాదు...! నాడు షార్జాలో కానీ, లేదా ఎక్కడైనా కానీ ఎక్కువశాతం గెలుపు పాకిస్తాన్‌ జట్టుదే. అప్పట్లో పాకిస్తాన్‌ జట్టు గొప్పగా ఉండడం, భారతీయ జట్టు కొంత బలహీనంగా ఉండడం వంటి కారణాల వల్ల పాకిస్తాన్‌ పదే పదే గెలుస్తుండేది. 

   ఇమ్రాన్‌ఖాన్‌, మియాదాంద్‌, వసీం అక్రం వంటి పేరెన్నికల ఆటగాళ్ల వల్ల ఆ జట్టు కొంచెం ముందుండేది. అంతే కాకుండా ఇసుక మైదానాలు అయిన షార్జాల్లో వారు చేసే మాయాజాలం  వల్ల కూడా భారత్‌ తరచూ ఓడిపోయేది. దీనితో భారత్‌ అభిమానులు చిన్న బుచ్చుకునేవారు. తమ జట్టు దాయాది చేతిలో పదే పదే ఓడడం వారికి రుచించేది కాదు. అదే సమయంలో పాకిస్తాన్‌ ప్రేక్షకులు చేసే వ్యాఖ్యానాలు, చేష్టలు భారత్‌ను మరింత రెచ్చగొట్టేవి. ఆటలో 'కాశ్మీర్‌' విషయాన్ని తెచ్చే వారు. 'కాశ్మీర్‌' సమస్య పరిష్కారాన్ని క్రికెట్‌ మ్యాచ్‌తో తేల్చుకుందామనే వగరుబోతు మాటలు మాట్లాడేవారు. ఇది సామాన్య సగటు అభిమానులు చేసింది కాదు...సాక్షాత్తూ నాడు పాకిస్తాన్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న 'ఇమ్రాన్‌ఖాన్‌' పేలిన మాటలు..! 'కాశ్మీర్‌' సమస్య పరిష్కరించటం చాలా సులవని భారత్‌, పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడి గెలిచిన వారికి 'కాశ్మీర్‌'ను కట్టబెట్టాలని ఆయన అప్పట్లో సెలవిచ్చారు. నాడు 'ఇమ్రాన్‌' పలికిన పలుకులకు కారణం అప్పట్లో ఆ జట్టు బలంగా ఉండడమే కారణం. 

   ఒక రాజకీయ సమస్యను ఆటతో పరిష్కరించాలన్న మూర్ఖపు మాటలు భారతీయులను కష్టపెట్టాయి. అప్పట్లో ఆ మాటలు సంచలనం సృష్టించాయి....! అయితే ఇప్పుడు కూడా 'ఇమ్రాన్‌ఖాన్‌' ఆ మాటలకు కట్టుబడి ఉన్నారా...? ప్రస్తుతం పాకిస్తాన్‌లో ప్రతిపక్షనాయకుడిగా వ్యవహరిస్తున్న ఇమ్రాన్‌ఖాన్‌ ఇప్పుడు ఈ పంపెం పెట్టగలరా...? ఇటీవల కాలంలో భారత్‌పై పదే పదే ఓడిపోతున్న పాకిస్తాన్‌ జట్టుపై ఆయన ఆ పందెం కాయగలరా...? ఐసీసీ ఛాంపియన్‌ ట్రోఫీ ఫైనల్‌లో ఆదివారం నాడు మరోసారి ఈ జట్లు తలపడబోతున్నాయి. ఇప్పటికే లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను తుక్కు తుక్కుగా ఓడించిన భారత్‌ మరోసారి అదే ప్రతాపం చూపించడానికి సిద్ధంగా ఉంది. మరి ఇటువంటి సమయంలో 'ఇమ్రాన్‌ఖాన్‌' 'కాశ్మీర్‌' పందెం పెట్టగలరా...? ఆ ధైర్యం ఈ మాజీ పాకిస్తాన్‌ ఆటగాడికి ఉందా...? నాడు తమకు ఉన్న బలంతో పదే పదే 'కాశ్మీర్‌' విషయాన్ని ప్రస్తావించిన పొగరబోతు 'ఇమ్రాన్‌ఖాన్‌' నేడు అదే తరహాలో స్పందిస్తారా...? రేపటి మ్యాచ్‌ కోసం ఇరు దేశాల అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తోన్న నేపథ్యంలో 'ఇమ్రాన్‌ఖాన్‌' మరోసారి అటువంటి పందెం వేస్తే క్రికెట్‌ అభిమానులకు మరింత పసందుగా ఉంటుంది కదా...? ఏమంటారూ....!  

(దావులూరి హ‌నుమంత‌రావు)


(569)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ