లేటెస్ట్

‘నెట్టెం’ సెట్‌ చేశారా...!?

గత సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో ఘోరంగా దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు ‘చంద్రబాబునాయుడు’ మరమ్మత్తులు చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి పాలైన వెంటనే ఆయన జిల్లా వైపు దృష్టిసారించారు. రాష్ట్ర విభజన తరువాత ‘విజయవాడ’ను రాష్ట్ర రాజధానిగా చేయడంతో ఇక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధికి పునాదులు ఏర్పడ్డాయి. అదే విధంగా కృష్ణా డెల్టాకు అవసరమైన ‘పట్టిసీమ’ ప్రాజెక్టును ఆగమేఘాలపై పూర్తి చేసి రైతులను కాపాడారు. ఇంకా అనేక సంక్షేమపథకాలు, గ్రామాల్లో సీసీ రోడ్లు, ఇతరత్రా అభివృధ్థి కార్యక్రమాలను అద్భుతంగా చేశారు. అయితే ఎంత చేసినా ఇక్కడి ప్రజలు ‘టిడిపి’ని ఘోరంగా ఓడిరచారు. మొత్తం 16అసెంబ్లీ స్థానాలు ఉంటే కేవలం రెండుచోట్ల మాత్రమే ‘టిడిపి’ని గెలిపించారు. ఇంత చేసినా ఎందుకు ఇక్కడ టిడిపి ఓడిరది..అనేదానిపై టిడిపి అధినేత తీవ్రమనోవేదనకు గురయ్యారు. అయితే అప్పట్లో ‘జగన్‌’ ఇచ్చిన హామీలు, ఒక్కసారి చూద్దామనే ప్రజల ఆలోచన, ఇక్కట టిడిపి నాయకుల్లోని అనైక్యత ఓటమికి దారితీసిందనే విషయాన్ని ‘అధినేత’ గుర్తించారు. జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ పార్టీని గాడిలోపెట్టడానికి లోక్‌సభ అధ్యక్షులను నియమించారు. విజయవాడ లోక్‌సభ అధ్యక్షుడిగా మాజీ మంత్రి ‘నెట్టెం రఘురామ్‌’, మచిలీపట్నం లోక్‌సభ అధ్యక్షుడిగా ‘కొనకళ్ల నారాయణ’ను ఎంపిక చేసి బాధ్యతలు అప్పచెప్పారు. దీంతో ఇప్పుడిప్పుడే పార్టీ గాడిన పడుతోంది. 


మాజీమంత్రి ‘నెట్టెం’ను ‘విజయవాడ’ పార్లమెంటరీపార్టీ అధ్యక్షుడిగా నియమించిన తరువాత పార్టీ శరవేగంతో దూసుకుపోతోంది. గ్రూపులకు అతీతంగా ‘నెట్టెం’ అన్నివర్గాలను కలుపుకుని పార్టీని నడిపిస్తున్నారు. అప్పుడెప్పుడో ‘చంద్రబాబు’ ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో ‘నెట్టెం’ ఆయన మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. తరువాత మద్యం కుంభకోణం విషయంలో ఆరోపణలు రావడంతో ‘నెట్టెం’ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ తరువాత నుంచి ఆయన పెద్దగా క్రియాశీలక రాజకీయాల్లో కనిపించలేదు. 2019లో ‘టిడిపి’ ఓడిపోయిన తరువాత నుంచి ఆయన క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అధినేత తనకు అప్పగించిన పనిని సమర్థవంతంగా చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ‘విజయవాడ’ లోక్‌సభ పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో ‘టిడిపి’ ముందంజ లోకివచ్చింది. ‘జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్‌’ నియోజకవర్గాల్లో టిడిపి గెలిచే పరిస్థితులను సృష్టించుకుంది. ఇక్కడ దాదాపు అభ్యర్థులను కూడా ఫైనల్‌ చేసింది. ‘జగ్గయ్యపేట’కు మాజీ ఎమ్మెల్యే ‘శ్రీరాం తాతయ్య, నందిగామకు ‘సౌమ్య’, మైలవరానికి మాజీ మంత్రి ‘దేవినేని ఉమామహేశ్వరరావు’, విజయవాడ తూర్పుకు ప్రస్తుత ఎమ్మెల్యే ‘గద్గె రామ్మోహన్‌రావు’, విజయవాడ సెంట్రల్‌కు ‘బోండా ఉమామహేశ్వరరావు’లు పోటీచేయబోతున్నారు. ఇక ఎస్సీ నియోజకవర్గమైన ‘తిరువూరు’ పరిస్థితి అంత బాగా లేదు. ఇక్కడ పార్టీ ఇన్‌ఛార్జిగా ‘శావలదేవదత్‌’ను నియమించారు. అయితే ఇక్కడ పార్టీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. విజయవాడ వెస్ట్‌లో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఇక్కట ప్రస్తుతానికి విజయవాడ ఎంపి‘కేశినేని నాని’ని ఇన్‌ఛార్జిగా పెట్టారు. ఈ నియోజవక్గంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడానికే ‘కేశినేని’ని ఇన్‌ఛార్జిగా పెట్టినట్లుంది. భవిష్యత్‌ పొత్తు ఆలోచనల్లో భాగంగా దీని గురించి ప్రస్తుతానికి పార్టీ పెద్దలు ఆలోచించడం లేదని తెలుస్తోంది. మొత్తం మీద ‘నెట్టెం’ వచ్చాక ‘విజయవాడ’లోక్‌సభను ‘సెట్‌’ చేశారనే మాట పార్టీ వర్గాల ద్వారా వినిపిస్తోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ